జగన్ దానిని సాధించగలరా..?

కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ఎన్నికల ఫలితాల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, [more]

Update: 2019-05-28 03:30 GMT

కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ఎన్నికల ఫలితాల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కలకత్తా, లక్నో అంటూ ప్రధాన నగరాలన్నీ ఆయన కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగారు. ఒకానొక సమయంలో అయితే హంగ్ వస్తే ప్రధాని ఎవరో నిర్ణయించేది చంద్రబాబే అని, ప్రధానమంత్రి చంద్రబాబు అవుతారని కూడా వార్తలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు లోక్ సభ స్థానాలే దక్కాయి. ఇదే సమయంలో ఫలితాల ముందు సైలెంట్ గా ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలను గెలుచుకుని స్వీప్ చేశారు. దీంతో ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో జగన్ పాత్ర ఏమిటనే చర్చ మొదలైంది. ముఖ్యంగా విభజన హామీల సాధనకు, ప్రత్యేక హోదా కోసం జగన్ ఎటువంటి వ్యూహం అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

నాలుగో అతిపెద్ద పార్టీగా…

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనం లోక్ సభ సీట్లలోనూ బలంగా వీచింది. ఒకానొక దశలో 25 ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నా చివరకు టీడీపీ అభ్యర్థులు ముగ్గురు స్వల్ప మెజారిటీతో గట్టెక్కడంతో వైసీపీకి 22 ఎంపీ సీట్లు దక్కాయి. జాతీయ స్థాయిలో అత్యధిక ఎంపీలు సాధించిన పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది. మొదట బీజేపీ, తర్వాత కాంగ్రెస్ ఉండగా 23 సీట్లు సాధించిన డీఎంకే మూడో స్థానంలో ఉంటే 22 సీట్లతో వైసీపీ నాలుగో స్థానంలో ఉంది. దీంతో పార్లమెంటు వైసీపీ ఎంపీల పాత్ర కీలకంగా మారనుంది. ఎన్నికల ప్రచారంలో 25కు 25 ఎంపీ సీట్లు మనమే గెలుచుకుని ప్రత్యేక హోదా సాధించుకుందామని జగన్ పదేపదే కోరారు. అనుకున్నట్లుగానే ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. కేంద్రంలో హంగ్ వస్తే తమ ఎంపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతారని, దీంతో ప్రత్యేక హోదా కచ్చితంగా వస్తుందని జగన్ భావించారు. అయితే, జగన్ అనుకున్నది జరగలేదు. పూర్తి మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.

ప్రత్యేక హోదా తెస్తారా..?

ఇక, ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ మొదటి భేటీలోనే జగన్ ఎంపీలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం ఎటువంటి పోరాటానికైనా, త్యాగానికైనా సిద్దంగా ఉండాలని జగన్ సూచించారు. నరేంద్ర మోడీతో జగన్ సత్సంబంధాలు నెరుతూనే ఏపీకి వచ్చే హక్కులు సాధించాలని భావిస్తున్నారు. మోడీకి పూర్తి మెజారిటీతో ఉన్నందున ఆయన పేచీలు పెట్టుకునే ఆలోచన జగన్ చేయకపోవచ్చు. కాకపోతే బతిమాలో, ఒత్తిడి చేశో జగన్ ప్రత్యేక హోదా తీసుకురావాలి. తాను ప్రత్యేక హోదా తెస్తానని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. మరి, హామీ నెరవేర్చుకోవాలంటే కేంద్రంతో జగన్ ఎటువంటి పాత్ర పోషిస్తారో చూడాలి. ఆయన ప్రమాణస్వీకారానికి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలని కోరారు. మరి, 22 ఎంపీ సీట్లు దక్కించుకున్నా జగన్ ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించగలరా లేదో చూడాలి. ఒకవేళ ప్రత్యేక హోదా సాధించగలిగితే మాత్రం ప్రజల్లో జగన్ కు ఆధరణ రెట్టింపు కావడం ఖాయం.

Tags:    

Similar News