జగన్ లో మొదటి సారి చూశారట

పాలకులు తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవి అని భావించినపుడు వాటిని సమర్ధించుకునేందుకు గట్టిగానే నిలబడాల్సి ఉంటుంది. ప్రజలు కొన్నిసార్లు తప్పుగా ఆలోచన చేసినా పాలకులు ముందుకువెళ్ళి వాటి [more]

Update: 2020-01-21 11:00 GMT

పాలకులు తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవి అని భావించినపుడు వాటిని సమర్ధించుకునేందుకు గట్టిగానే నిలబడాల్సి ఉంటుంది. ప్రజలు కొన్నిసార్లు తప్పుగా ఆలోచన చేసినా పాలకులు ముందుకువెళ్ళి వాటి మీద నిలబడితే దీర్ఘకాలంతో తీర్పు వారికే అనుకూలంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ పొరుగు రాష్ట్రం తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె. కేసీఆర్ ఆ సమ్మెను అరవై రోజుల పాటు సాగనిచ్చి మొండిగా నిలబడ్డారు. చివరికి దానికి కూడా తనకు అనుకూలం చేసుకున్నారు. అలాంటి గట్టితనం మొదటిసారిగా జగన్ లో ఏపీ జనం చూస్తున్నారు.

అన్నింటికీ కాదు….

జగన్ విషయం తీసుకుంటే ఆయన ఆర్ధిక పరిస్థితులు కూడా చూడకుండా వరాలు ఇచ్చే వేలుపుగా మారిపోయారని విమర్శలు ఉన్నాయి. ఇక ఆయన జనం కోణంలో ఆలోచన చేస్తూ కాస్త మెత్తగానే ఉంటారని, కొత్త కాబట్టి జగన్ ను సులువుగా వంచేయవచ్చునని కూడా అంచనాలు వేసుకున్నారు. కానీ తాను తలచుకుంటే కొన్ని చోట్ల కఠినంగా కూడా ఉంటానని జగన్ నిరూపించుకున్న ఘటనే అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడం. దీంతో అన్నిటికీ తాను ఒకే అంటూ తలూపేది లేదని కూడా ఆయన పక్కాగా చెప్పినట్లైంది.

అలా అనుకున్నారా…?

ఇసుక విషయంపై పెద్ద రాధ్ధాంతమే జరిగింది. జగన్ వెంటనే ఎప్పటికపుడు సమీక్షలు జరిపి ప్రతిపక్షాల మాట వింటున్నట్లుగా కొంత కనిపించారు. ఇంగ్లీష్ మీడియం విషయం తీసుకుంటే ఒకటి నుంచి తొమ్మిది వరకూ అని మొదట్లో అన్న జగన్ ప్రతిపక్షం ఆందోళన తరువాత ప్రాధమిక స్థాయికే మొదట పరిమితం చేశారు. ఈ రెండు ఉదాహరణలను చూసిన టీడీపీ, జనసేన వంటి పార్టీలు రాజధాని విషయలో కూడా జగన్ ని వెనక్కు లాగవచ్చునని అనుకున్నాయి. అందుకే నెల రోజులుగా గట్టిగానే పోరాటం చేశాయి. కానీ సీన్ ఇక్కడే రివర్స్ అయింది.

ముందుకేనా…?

తనకు అన్ని విషయాల మీద క్లారిటీ ఉందని చెప్పుకుంటున్న జగన్ మూడు రాజధానుల విషయంలోనూ అలాగే వ్యవహరించారు. తాను ఏమనుకున్నదీ అక్షరాలా చేసి చూపించారు. తన పట్టుదల, గట్టిదనం ముందు ప్రతిపక్షం ఉడత ఊపులు సాగవని కూడా తేల్చేశారు. అవసరం అయితే ఒక మోడీలా, మరో కేసీఆర్ లా తాను కూడా గట్టిగా నిలబడగలనని నిరూపించుకున్నారు. మొత్తానికి జగన్ కఠిన వైఖరి ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఆయన పాలనకు కొత్త, ఎటైనా మొగ్గుతారు అన్న మాటలు ఇకపైన పెద్దగా వినిపించవేమో.

Tags:    

Similar News