అసలు అజెండా అదేనట

చంద్రబాబు జగన్ కి ఓ విధంగా రాజకీయ గురువే అని చెప్పాలి. పదేళ్ల జగన్ పోరాటమంతా చంద్రబాబుతోనే. అందుకే బాబు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయడం [more]

Update: 2019-09-08 03:30 GMT

చంద్రబాబు జగన్ కి ఓ విధంగా రాజకీయ గురువే అని చెప్పాలి. పదేళ్ల జగన్ పోరాటమంతా చంద్రబాబుతోనే. అందుకే బాబు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయడం ద్వారా జగన్ రాటుదేలారు. ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు అని బాబు నుంచే జగన్ నేర్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ ని తన రాజకీయ వారసునిగా చేద్దామనుకున్నారో లేదో తెలియదు. జగన్ మూడు నెలల ఎంపీగా ఉన్నపుడే ఆయన దుర్మరణం పాలు అయ్యారు. నాటి నుంచి జగన్ రాజకీయాల్లో ఎదురుదెబ్బలు ఎక్కువగా తిన్నది ప్రత్యక్షంగా, పరోక్షంగా అయినా బాబు నుంచే. అందువల్ల జగన్ ఒక్కొక్కమెట్టూ ఆ దెబ్బల నుంచే ఎదిగారు. అలా రాజకీయాల్లో జగన్ ఎదుగుదల వెనక బాబు ఉండాలనుకోకపోయినా ఉన్నారనిపిస్తుంది. ఇక జగన్ ముఖ్యమంత్రిగా కూడా బాబు వారసునిగా వచ్చారు. ఆయన చంద్రబాబు పాలనను బాగా అధ్యయనం చేశారు. బాబు ఎందుకు ఓడిపోయారన్నది బాబు కంటే కూడా జగన్ కి బాగా తెలుసు. అందుకే ఆయన గత సర్కార్ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఐటీ రాజధానిగా విశాఖ….

వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా జగన్ అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో పలు అభివ్రుధ్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ విధంగా తన గురి అంతా ఉత్తరాంధ్ర అని చెప్పకనే చెప్పారు. ఇక రోజు మొత్తం శ్రీకాకుళంలో జగన్ అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ముఖాముఖీలో జగన్ మాట్లాడుతూ ఏపీలో ఐటీని బాగా అభివృధ్ధి చేస్తామని చెప్పారు. విశాఖను ఐటీ రాజధానిగా చేస్తామని మనసులోని మాటను కూడా చెప్పారు. ఓ విధంగా విశాఖను ఐటీ పేరిట అభివృధ్ధి చేస్తే హైదరాబద్ అంత కాకపోయినా రెండవ భాగ్యనగరం అవుతుందన‌డంలో సందేహం లేదు. అదే విధంగా విశాఖను టూరిజం హబ్ గా కూడా చేయాలన్నది జగన్ ఆలోచన అంటారు. ఈ కారణంగానే విశాఖకు చెందిన అవంతి శ్రీనివాసరావుకు టూరిజం శాఖ ఇచ్చారు. ఇక సినీ రాజధానిగా కూడా విశాఖను తీర్చిదిద్దుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అంటున్నారు. ఆయన సినీ నిర్మాత కూడా కావడం విశేషం. ఇలా జగన్ దృష్టి విశాఖ, ఉత్తరాంధ్ర మీద ఉందని ఆయన వేస్తున్న అడుగుల బట్టి తెలుస్తోంది.

కర్నూలులో హైకోర్టు….

ఇది కూడా ప్రచారంలో ఉంది. ఏపీ హైకోర్టును క‌ర్నూలు లో పెట్టడం ద్వారా రాయలసీమను గేట్ వే ఆఫ్ డెవలపమెంట్ అనిపించాలని జగన్ తపన పడుతున్నారని అంటారు. తిరుపతిని హోలీ టూరిజం గాను, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను పారిశ్రామిక వాడలుగా చేయాలన్న ఆలోచన ఉండబట్టే నెల్లూరుకి చెందిన మేకపాటి గౌతం రెడ్డిని పారిశ్రమల శాఖ మంత్రిగా చేశారని చెబుతారు. బాబు సొంత జిల్లా చిత్తూరుని కూడా పారిశ్రామిక నగరంగా చేయాలని కూడా జగన్ అజెండాలో ఉంది. మొత్తానికి చూసుకుంటే జగన్ తాను ఏది అనుకుని ముఖ్యమంత్రి అయ్యారో దానిని ఆచరణలో పెట్టేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారని చెప్పాలి. సంకల్పం బలంగాఉంది. ఇక కార్యాచరణ కూడా సాగుతుందని రాష్ట్ర సమగ్ర అభివ్రుధ్ధిని కోరే వారు అంటున్నారు.

Tags:    

Similar News