జగన్ చేసిన ప్యాచ్ వర్క్ తో ఫ్యాన్ తిరిగేనా..?

చూడబోతే ముంగిట్లో మునిసిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు చూస్తే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కధ సెగలు రేపుతోంది. విశాఖ మీద మోజు పడిన జగన్ కి [more]

Update: 2021-02-28 15:30 GMT

చూడబోతే ముంగిట్లో మునిసిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు చూస్తే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కధ సెగలు రేపుతోంది. విశాఖ మీద మోజు పడిన జగన్ కి అనూహ్యంగా ఈ రకమైన ఇబ్బంది ఎదురైంది. విశాఖ మేయర్ ఎలాగైనా వైసీపీకి దక్కాలని కన్న కలలకు ఉక్కు పోరాటం అడ్డంగా మారుతోంది. దీంతో వైసీపీ నేతలు ఎన్ని చెప్పినా కూడా ముఖ్యమంత్రి జగన్ నోట గట్టి మాట వినాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. వారు కోరినట్లుగానే జగన్ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు.

అది నిజమే అంటూ….

పోస్కో ప్రతినిధులతో జగన్ మంతనాలు రహస్యంగా జరిపారు. విశాఖ ఉక్కుని తుక్కుగా అమ్మేసుకోవడానికే జగన్ ఇదంతా చేస్తున్నాడు అంటూ విపక్ష నేత చంద్రబాబు చాలానే చాడీలు చెప్పారు. మరి అసలు విషయం ఏంటి, జగన్ ఏం చెబుతారు అన్న ఆందోళన అయితే ఉక్కు కార్మికులలో ఉంది. కానీ జగన్ వారితో మనసు విప్పే మాట్లాడారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. తాను పోస్కో ప్రతినిధులతో భేటీ కావడం వాస్తవం అని ఆయన పక్కా క్లారిటీగా చెప్పడం ద్వారా తన నిజాయ‌తీని చాటుకున్నారు. ఇక తమ మధ్య జరిగిన సంభాషణను కూడా జగన్ విడమరచి చెప్పారు. కడప, క్రిష్ణపట్నంలలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయమని తాను పోస్కో ప్రతినిధులకు చెప్పానని జగన్ అసలు నిజం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి పోస్కో రాదంటే రాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు.

వాస్తవ దృక్పధంతో ….

నాడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ కూడా జగన్ ఈ వైరస్ ఇప్పట్లో పోదు సావాసం చేయాల్సిందే అంటూ చెప్పి కుండబద్ధలు కొట్టారు. దాని వల్ల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇపుడు కూడా ఉక్కు పరిశ్రమ విషయంలో జగన్ పక్కా యధార్ధవాదిగానే ఉక్కు కార్మికుల ముందు విషయాలు పంచుకున్నారు. మన ప్రయత్నం మనం చేద్దామంటూ తాను ఎంతవరకూ చేయగలనో దాన్నే ఆయన వారి ముందు పెట్టారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా కూడా వత్తిడి తెస్తామని చెప్పారు. ఉక్కుని ఎలా లాభాల బాట పట్టించవచ్చో తాను ఢిల్లీ పెద్దలకు సూచనలు చేశానని కూడా జగన్ వివరించారు. కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తుందని కూడా ఆయన ఆశాభావంతో ఉన్నారు.

సేఫ్ జోన్ లోనేనా….?

మరి సీఎం జగన్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు. కేంద్రంలో సయోధ్య నెరుపుతూనే ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో చిత్తశుద్ధితో ఎంత చేయాలో అంతా చేస్తానని అన్నారు. మరి జగన్ మాటలకు ఉక్కు జేఏసీ నేతలు అయితే ఓకే అన్నారు కానీ తెలుగుదేశం నేతలు ఊరుకుంటారా. దగ్గరలో విశాఖ మేయర్ ఎన్నికలు ఉన్నాయి. పైగా ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా విశాఖలో ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు తగిన చాన్స్ కోసం ఎదురుచూస్తున్న పసుపు పార్టీ జగన్ ప్రయత్నాలకు, ఆయన మాటలకు వక్ర భాష్యం చెప్పకుండా ఉంటుందా. జగన్ ని కార్నర్ చేసి మరీ ఉక్కు కార్మిక లోకం ముందు, విశాఖ జనం ఎదుట దోషిగా నిలబెట్టకుండా ఉంటుందా. మరి అదే జరిగితే వైసీపీ సంగతేంటి. విశాఖలో తోసుకువచ్చిన్ మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ రకమైన రిజల్స్ట్స్ వస్తాయి. జగన్ చేసిన ప్యాచ్ వర్క్ తో ఫ్యాన్ గిర్రున తిరుగుతుందా. జనం జగన్ మాటలను, ఉక్కు పోరాటం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని ఎంత వరకూ నమ్ముతారు. ఇవన్నీ వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News