విశాఖ మేలు అంటున్న జగన్ …తీర్పు ఎలా ఉంటుందో ?

జగన్ సర్కార్ మొదటి నుంచి లక్ష కోట్లరూపాయల భారీ బడ్జెట్ సినిమా అమరావతి రాజధాని అని అంటోంది. తాము వాటిని భరించేందుకు సిద్ధంగా లేమని కూడా చెప్పేస్తోంది. [more]

Update: 2020-12-19 09:30 GMT

జగన్ సర్కార్ మొదటి నుంచి లక్ష కోట్లరూపాయల భారీ బడ్జెట్ సినిమా అమరావతి రాజధాని అని అంటోంది. తాము వాటిని భరించేందుకు సిద్ధంగా లేమని కూడా చెప్పేస్తోంది. ఏపీలో రాబడి అంతంతమాత్రంగా ఉంటే ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము అంతా తెచ్చి ఒకే చోట కుమ్మరిస్తే మిగిలిన 12 జిల్లాల సంగతేంటని కూడా నిలదీస్తోంది. దీని మీద అసెంబ్లీ లోపలా బయటా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. లక్ష కోట్లు కాదు చాలా తక్కువతోనే అమరావతి రాజధాని తయారై ఏపీ మొత్తానికి అతి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది అని చంద్రబాబు సహా తమ్ముళ్ళు మరో వైపు చెబుతూ వచ్చారు.

అటూ ఇటూ ….

ఇపుడు మూడు రాజధానుల వ్యవహారం హై కోర్టులో విచారణ దశలో ఉంది. మూడు వద్దు ఒక్కటే ముద్దు అంటూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటి మీద విచారణ ముగిసింది. ఇపుడు ప్రభుత్వం తరఫున వాదనలు కూడా ధీటుగా వినిపిస్తున్నారు. సుప్రీం కోర్టi సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేతో పాటు ప్రభుత్వ న్యాయవాది శ్రీరాం కూడా వైసీపీ సర్కార్ వాదనలను చక్కగా కోర్టు దృష్టికి తెచ్చారు. విశాఖ కనుక రాజధానిగా చేస్తే పెద్దగా ఖర్చు ఉండదని, రెడీమేడ్ సిటీ కాబట్టి వెంటనే ప్రగతి పరుగులు అందుకుంటుందని కూడా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇంతకంటే మంచి పరిష్కారం కూడా ప్రభుత్వం వద్ద లేదని కూడా చెప్పుకొచ్చారని సమాచారం.

తేలిపోతుందా…?

కొత్త సంవత్సరం ముంగిట జగన్ కి సరికొత్త సవాళ్ళు చాలానే ఉన్నాయని అనుకోవాలి. హైకోర్టు మూడు రాజధానుల మీద రోజు వారీ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించిన తీర్పు కూడా రావచ్చు అనుకుంటున్నారు. ఇక అటు అమరావతినే ఏకైక రాజధాని అని డిమాండ్ చేస్తూ పిటిషన్లు వేసిన వారు, ఇటు ప్రభుత్వం తరఫున మూడు రాజధానులు మీద సర్కార్ న్యాయవాదులు వాదించారు. ఈ వాదనల మీద హైకోర్టు ఏం చెబుతుంది అన్నది మాత్రం ఆసక్తి కలిగించే అంశమే. ఇక దుష్యంత్ దవే అయితే రాజధాని అన్నది పాలనాపరమైన నిర్ణయమని, అందులో కోర్టుల జోక్యం కూడదని కూడా వాదించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రమేయం కూడా రాష్ట్రాల రాజధానుల విషయంలో ఉండదని కూడా స్పష్టం చేశారు. మరో వైపు కేంద్రం కూడా రాజధానుల విషయంలో తమ పాత్ర ఏమీ లేదని అఫిడవిట్ కూడా దాఖలు చేసిన నేపధ్యంలో ఈ తీర్పు ఎలా ఉంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News