అక్కడ పోటీ …నాతోనే …జగన్ బెంచ్ మార్క్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలపై వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అధికార వైసీపీ గెలుపు ఖాయమేనని సొంతపార్టీతో పాటు పరిశీలకులూ అంగీకరిస్తున్న వాస్తవం. కానీ ఆపార్టీ అధినేత జగన్ [more]

Update: 2021-03-20 15:30 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలపై వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అధికార వైసీపీ గెలుపు ఖాయమేనని సొంతపార్టీతో పాటు పరిశీలకులూ అంగీకరిస్తున్న వాస్తవం. కానీ ఆపార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త బెంచ్ మార్కు పెడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన విజయంతో సాఫీగా సేద తీరుతున్న తిరుపతి, నెల్లూరు ప్రజాప్రతినిధులు, మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థులతో కాదు, కడప ఉప ఎన్నికలో 2011లో తనకు లభించిన మెజార్టీతో పోటీ పడాలనేది అధినేత సూచన. దీనిని బట్టి చూస్తే భారీ విజయాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లుగా స్పష్టమై పోతోంది. సాధారణ విజయం తనకు సంతృప్తి ఇవ్వదనే సంగతిని జగన్ తాజా సమీక్షల్లో నేతలకు గట్టిగానే చె్ప్పేశారు. ‘బాబు , భాజపా ఎక్కడున్నారు? ప్రత్యర్థులే లేరు. వారితో పోల్చుకుంటే మనమూ వెనకబడతాం. పాజిటివ్ ఓటుతో రికార్డు సృష్టించాలి. పోటీ ఇతర పార్టీలతో కాదు. ఇది వైసీపీకి జాతీయ ప్రతిష్ఠ. అందుకే కాంగ్రెసు నుంచి బయటికి వచ్చిన తర్వాత కడప ఉప ఎన్నికతో క్రియేట్ చేసిన రికార్డు వంటిదే మరోసారి తిరుపతిలో రావాలి.‘ అంటూ జగన్ మోహన్ రెడ్డి తన అంచనాలను పార్టీ నేతలతో పంచుకున్నట్లు సమాచారం. అప్పట్లో జగన్ 4.5 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించారు. దీనిని బట్టి చూస్తే తిరుపతిలో బలమైన పోటీ ఇవ్వాలనుకుంటున్న బీజేపీకి, సొంత గడ్డపై మునిసిపల్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడికి గట్టి షాక్ ఇవ్వాలనే కృతనిశ్చయంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ గీస్తున్నట్లు చెప్పాలి.

అతి విశ్వాసం డేంజర్…

అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో వైసీపీ శ్రేణులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వంపై వివిధ అంశాల వారీగా ప్రతిపక్షాలు తొలి నుంచి పోరాటం సాగిస్తున్నాయి. దానికి మీడియా మద్దతు తోడైంది. దాంతో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం వైసీపీకి లోపించింది. నిరంతరం పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాల వార్తలతో మీడియా ఊదరగొడుతూ వచ్చింది. ప్రజల్లో వైసీపీపై అసంత్రుప్తి తీవ్రస్థాయికి చేరుకుందనే భావనను కల్పించింది. దీంతో అధికార పార్టీ సైతం అయోమయానికి గురైంది. నిజంగానే ప్రజల్లో పలుకుబడి పలచనైపోతోందేమోననే ఆందోళన నెలకొంది. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు ఆ అనుమానాలను పటాపంచలు చేసేశాయి. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి సామర్థ్యంతో వైసీపీ పని చేసింది. త్రిముఖ పోరాటం సాగించింది. ఒకవైపు ప్రతిపక్షాలతో మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో, ఇంకో వైపు న్యాయ వ్యాజ్యాలతో ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ప్రతిపక్షాలు తామూహించినంత బలంగా లేవని ఎన్నికల ఫలితాల తర్వాత తేలింది. ఇది అతి విశ్వాసానికి దారి తీస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీనిని స్వయంగా ఎత్తిచూపుతూ తిరుపతి ఎన్నికలు జాతీయంగా తమకు చాలా ప్రతిష్ఠాత్మకమని గుర్తు చేశారు. మతపరమైన అజెండాను రాష్ట్రంలో లేవనెత్తిన టీడీపీకి, బీజేపీకి ఏక కాలంలో చెక్ పెట్టేందుకు ఈ ఎన్నికను సవాల్ గా చేసుకోవాలనేది వైసీపీ అధినేత ఆంతర్యం.

అతీతమైన పోరాటం…

ప్రతిపక్షాలు గెలుపోటములకు అతీతమైన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సొంత జిల్లాలో చేదు అనుభవాలు చంద్రబాబు నాయుడికి కొత్తేమీ కాదు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసింది తిరుపతి ప్రాంతమే. పొలిటికల్ ఓనమాలు దిద్దుకున్నదీ ఇక్కడే. యూనివర్శిటీ రాజకీయాల్లో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పరోక్ష వ్యూహాలతో చిత్తు చేసింది కూడా తిరుపతిలోనే. అటువంటి చంద్రబాబు నాయుడికి తిరుపతిలో భరోసానివ్వగల నాయకుడు కనిపించడం లేదు. గెలవడం సంగతి దేవుడెరుగు. కనీసం దీటైన పోటీనైనా ఇవ్వగలమా? అన్న సందేహం టీడీపీ శ్రేణులను వెన్నాడుతోంది. నైతికంగా దెబ్బతిని ఉన్న పార్టీ క్యాడర్ ను ఒక తాటిపైకి తేవడమే అధినేత కర్తవ్యంగా మారింది. తిరుపతి మునిసిపల్ ఎన్నికల్లో ఊహించనంత దారుణంగా పరాజయం పాలవ్వడాన్ని టీడీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో శాసనసభనియోజకవర్గానికి ఒక మాజీ మంత్రిని, క్లస్టర్లకు మాజీ ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జులుగా పెడతానని చంద్రబాబు చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఎంతమంది పనిచేస్తారనేది అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.

లుకలుకలే…

బీజేపీ, జనసేన లుకలుకలు ఇంకా సర్దుకోలేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో పవన్ పుట్టించిన ప్రకంపనలు ఆంధ్రాలోనూ వెన్నాడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక తుది ఘట్టంలో పవన్ ప్లేటు ఫిరాయించి టీఆర్ఎస్ కు మద్దతు పలకడంపై బీజేపీ అధిష్ఠానమూ అసంతృప్తిగానే ఉంది. కానీ ఇప్పటికిప్పుడు పవన్ ను ఏమీ అనలేని పరిస్థితి. తిరుపతిలో డిపాజిట్లు తెచ్చుకునేందుకైనా పవన్ తో కలిసి నడవాల్సిందేననేది కొందరి బలమైన నమ్మకం. జనసేన పోటీ లేదనడంతోనే బలిజ సామాజిక వర్గం సైలెంట్ అయిపోయింది. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో లక్ష పాతిక వేల వరకూ ఈ వర్గం ఓట్లు ఉంటాయని అంచనా. ఎస్సీ ల జనాభా గణనీయం. ఆ ఓట్లు ఎలాగూ పెద్దగా పడవనే అంచనా ఉంది. ప్రధాన ప్రత్యర్థులు అయిన టీడీపీ, వైసీపీలు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలు, క్లస్టర్లు, గ్రామాల వారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసేసుకున్నారు. ఇంకా బీజేపీ, జనసేన కూటమి సన్నాయి నొక్కుల దశలోనే ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News