ఇద్దరూ సరైనోళ్లే.. మరి జగన్ ఎత్తు?

రాష్ట్రంలో జెడ్పీ ఎన్నిక‌లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ స్థానాల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్లను ఖ‌రారు చేసింది. త్వర‌లోనే నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల కానుంది. [more]

Update: 2020-02-02 15:30 GMT

రాష్ట్రంలో జెడ్పీ ఎన్నిక‌లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ స్థానాల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్లను ఖ‌రారు చేసింది. త్వర‌లోనే నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల కానుంది. అయితే, ఈ ప‌ద‌వుల కోసం అధికార పార్టీలో నాయ‌కులు భారీ ఎత్తున పోటీ ప‌డుతున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో టికెట్లను త్యాగం చేసిన వారు, వారితోపాటు ఎన్నిక‌ల్లో స్వల్ప తేడాతో ఓడిన వారు కూడా ఇప్పుడు జెడ్పీ పీఠాల‌పై క‌న్నేశారు. దీంతో ఇలాంటి వారంతా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ క‌రుణ కోసం ప్రయ‌త్నిస్తున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని గుంటూరును ఆనుకున్న ఉన్న ప్రకాశం జిల్లా జెడ్పీ పీఠం జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు.

పోటీ పెరగడంతో….

దీంతో ప్రకాశం వైసీపీలో ఈ పీఠాన్ని ఆశిస్తున్న నేత‌ల మ‌ధ్య తీవ్రమైన పోటీ నెల‌కొంది. వీరిలో ముఖ్యంగా ముగ్గురు కీల‌క నాయ‌కులు పోటీ ప‌డుతుండ‌డంతో రాజ‌కీయాలు హీటెక్కాయి. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్రసాద్‌రెడ్డి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంక‌ట‌రెడ్డి, మ‌రో కీల‌క నాయ‌కుడు ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ గొట్టిపాటి భ‌ర‌త్ కూడా ఇప్పుడు ప్రకాశం జెడ్పీపై ఆశ‌లు పెంచుకున్నారు. దీంతో వీరిలో ఎవ‌రికి ఈ ప‌ద‌వి వ‌రిస్తుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఆయా నేత‌ల ప్రొఫైల్ చూస్తే.. బూచేప‌ల్లి వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి కూడా జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయ‌న ఎంతో కృషి చేశార‌నే సింప‌తి సంపాయించుకున్నారు.

జగన్ వెన్నంటే ఉండి….

మార్కాపురం నుంచి 2014లో విజ‌యం సాధించిన జంకే వెంక‌ట‌రెడ్డి నిజాయితీప‌రుడైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ పోటీకి రెడీ అయినా.. వ‌యో భారం స‌హా తీవ్రమైన పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్కకు త‌ప్పించారు. జిల్లాలో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అంద‌రూ పార్టీ మారిపోయినా ఆయ‌న మాత్రం పార్టీ మార‌లేదు. ఈ క్రమంలో టికెట్ త్యాగం చేసిన ఆయ‌న‌కు ఎమ్మెల్సీ కానీ ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వి కానీ ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

భరత్ సయితం….

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎమ్మెల్సీ వ‌స్తుందో ? లేదో ? అన్న సందేహంతో ఉన్న ఆయ‌న జెడ్పీ చైర్మన్ పీఠంపై క‌న్నేసిన‌ట్టు టాక్‌. ఇక బూచేప‌ల్లి సైతం జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చినా జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు ఇప్పుడు జ‌డ్పీ చైర్మన్ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. ఇక‌, ప‌రుచూరు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌గా ఉన్న గొట్టిపాటి భ‌ర‌త్‌కూడా ప‌ద‌వి కోసం ఆశిస్తున్నారు. ప‌ర్చూరు టిక్కెట్ త్యాగం చేసిన భ‌ర‌త్‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అయితే ప‌ర్చూరులో వైసీపీ ఓడిపోవ‌డంతో పాటు గ్రూపు రాజ‌కీయాలు ఎక్కువుగా ఉండ‌డం భ‌ర‌త్‌కు మైన‌స్‌గా మారింది. అయితే, ఈ ముగ్గురిలోనూ జ‌గ‌న్ మొగ్గు బూచేప‌ల్లికే ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News