సజావుగా లేదటగా

అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కెలుక్కున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఏడు నెలల్లో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ తో [more]

Update: 2020-01-13 14:30 GMT

అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కెలుక్కున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఏడు నెలల్లో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ తో అనేకవర్గాలు జగన్ కు అనుకూలంగా మారాయి. అమ్మఒడి కార్యక్రమంతో లక్షల మంది లబ్దిపొందారు. రైతు భరోసాతో ఆ వర్గం అనుకూలమయింది. ఇక ఫీజురీఎంబర్స్ మెంట్ పథకంతో జగన్ దాదాపు కోటిమందికి చేరువయ్యారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడంతో లక్షలాది కుటుంబాలు “థాంక్యూ సీఎం” అని నినదించారు.

కొన్ని వర్గాలు మాత్రం….

అయితే అమరావతి రాజధాని విషయంలో మాత్రం జగన్ కు కొన్ని వర్గాల ప్రజలు దూరం కాక తప్పదంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొంత జగన్ నిర్ణయానికి సానుకూలత కనపడుతున్నప్పటికీ ముఖ్యంగా కొన్ని వర్గాలు మాత్రం అమరావతిని కదిలించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార వర్గాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మేధావులు సయితం రాజధానిని తరలించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో నెలన్నర రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

ఏపీలో ఈ నెల 17వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 660 జడ్పీటీసీలకు, 10229 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజధాని తరలింపు అంశం ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. సంక్షేమ పథకాలను ఎన్ని అమలు చేసినా సెంటిమెంట్ తో జగన్ కు రివర్స్ అవుతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజధాని సెంటిమెంట్ కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితమవుతుందని వైసీపీ భావిస్తున్నా మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రభావం అంతో ఇంతో ఉండే అవకాశముంది.

నెలన్నరే సమయం….

ఈ నేపథ్యంలోనే జగన్ ఈ ఎన్నికలను ఎలా డీల్ చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోనెలన్నర రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయన ఈ సమస్యను పూర్తి స్థాయిలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది జరగకుంటే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజధాని ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశముంది. జగన్ నిర్ణయం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే వచ్చిన ఎన్నికల్లో వ్యతిరేకత వస్తే మున్ముందు జగన్ కు ఇబ్బందులే. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News