జగన్ వెనక్కు తగ్గారా?

వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరకట్ట మీద ఆక్రమణలను కూల్చివేస్తామని ఆర్భాటం చేసింది. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ [more]

Update: 2019-11-08 11:00 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరకట్ట మీద ఆక్రమణలను కూల్చివేస్తామని ఆర్భాటం చేసింది. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ నిర్మాణమని తేల్చింది. దీనికి తోడు అప్పట్లో చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. అయితే ఇది కొంత జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రజావేదికను కూల్చే వేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు సయితం తప్పు పట్టారు.

కరకట్టపై ఆక్రమణలు….

ఈ నేపథ్యంలో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా వరద నీరు చేరింది. దీంతో చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో కూల్చివేస్తామని, నివాసం ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై రాజకీయ రగడ కూడా జరిగింది. ప్రధానంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయాల్సిందేనని మీడియా ముందుకు వచ్చారు.

బాబు నివాసం కూడా….

అయితే ఇది జరిగి రెండు నెలలు గడుస్తుంది. చంద్రబాబు నివాసం ఉంటున్న భవన యజమాని లింగమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట మీద అనేక భవనాలు ఉన్నాయి. తొలినాళ్లలో కొన్ని చోట్ల కూల్చివేతలను ప్రారంభించిన సీఆర్డీఏ అధికారులు మళ్లీ రెండు నెలల నుంచి కూల్చివేతల జోలికి పోవడం లేదు. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉందని అధికారులు చెబుతుండగా రాజకీయ వత్తిడులే కారణమన్న వాదనలూ విన్పిస్తున్నాయి.

కేంద్రం నుంచి ఆదేశాలేనా?

ముఖ్యంగా కరకట్ట మీద ఉన్న భవనాలు బడా బాబులవే కావడంతో కేంద్రం స్థాయిలో జగన్ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తొలినాళ్లలో హడావిడి చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా వెనక్కు తగ్గడం వెనక కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలేనంటున్నారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం యజమానులకు కొంత సమయం ఇస్తామని, అప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించకుంటే తామే కూల్చివేతకు దిగుతామంటున్నారు. మొత్తం మీద కరకట్టమీద కూల్చివేతల విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.

Tags:    

Similar News