లైట్ తీసుకుంటే….. జగన్ కు ఇబ్బందులు తప్పవా?

రాముడు త్రేతాయుగంలో ఈ లోకాన్నీ శాసించాడు. రామబాణం ముందు వేరేదీ అసలు పనిచేయదు. రాముడు మాటకు ఎదురులేదు, తిరుగులేదు. ఇక రామభక్తి కూడా అలాంటిదే. రాముడుని తలంచుకుంటే [more]

Update: 2021-01-25 12:30 GMT

రాముడు త్రేతాయుగంలో ఈ లోకాన్నీ శాసించాడు. రామబాణం ముందు వేరేదీ అసలు పనిచేయదు. రాముడు మాటకు ఎదురులేదు, తిరుగులేదు. ఇక రామభక్తి కూడా అలాంటిదే. రాముడుని తలంచుకుంటే ఎంతటి గంభీర సాగరాలనైనా కూడా చిటికలో దాటేస్తారు. అంతటి రామశక్తి ముందు ఎవరూ నిలువలేరు కూడా. ఇదిలా ఉంటే రాముడి పవర్ ఎంటో ఆధునిక భారత రాజకీయం చవి చూసింది. ఉత్తర భారతాన మూడు దశాబ్దాలుగా అయోధ్య, రాముడు ఎంతలా ప్రభావితం చేశాయో వేరేగా చెప్పనక్కరలేదు.

విరాళాలతో అలా…

ఇక ఇపుడు అయోధ్య రాముడు కల సాకారం అవుతోంది. ఆలయ నిర్మాణానికి గత ఏడాది ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు. రెండేళ్ళలో మహత్తరమైన రామ మందిరం అయోధ్యలో నిర్మాణం కానుంది. 1500 కోట్ల రూపాయలతో రాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి కావాల్సిన మొత్తాన్ని ఇస్తామని ఎంతో మంది బడా నాయకులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. అయినా రామ మందిర నిర్మాణ కమిటీ నో చెప్పింది. అందరూ తలా కొంత వేసి ఇస్తే 130 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో రాముడి కోవెల భవ్యంగా తయారవుతుంది అని పేర్కొంది. దాన్ని ఇపుడు బీజేపీ రాజకీయంగా బహు చక్కగా వాడుకుంటోంది. అయోధ్య గుడికి విరాళాలు అంటూ ఏపీలో ఎక్కడికక్కడ బీజేపీ ప్రచారం మొదలెట్టింది.

ఇవాళ రూపాయిలు…

రాముడు కోవెల కోసం రూపాయి విరాళం ఇచ్చినా కూడా తీసుకుంటామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. తమ వారి ద్వారా ప్రచారాన్ని చేయిస్తున్నారు. ముందుగా వారే విరాళాలు ఇస్తున్నారు. పల్లె సీమల్లో ఇపుడు రాముడి కోవెలకు విరాళాల సేకరణ జోరుగా సాగుతోంది. మరి ఇవాళ రూపాయి విరాళం అంటూ ముందుకు వస్తున్న కాషాయ పెద్దలు రేపటి రోజున రాముడికి ఒక్క ఓటు అంటూ ప్రచారం మొదలుపెడితే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు దుకాణాలు సర్దుకోవాల్సిందే అంటున్నారు. ఇప్పటికే బీజేపీ హిందూ కార్డుని ఏపీలో తీసింది. ఆ వలలో డైరెక్ట్ గా టీడీపీ చిక్కుకుంటే వైసీపీ కూడా అదే దారిలోకి వస్తోంది.

ఇబ్బందేనా…?

ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీని ఎదుర్కొనే విషయంలో జగన్ కచ్చితంగా వ్యవహరించాల్సి ఉందని ఆ పార్టీలో డిమాండ్ వస్తోందిట. హిందూ ధర్మాన్ని తప్పనిసరిగా పాటిస్తూనే బీజేపీని రాజకీయాన్ని ఎండగట్టాలని కూడా పార్టీ నాయకులు గట్టిగా సూచిస్తున్నారుట. హిందూ విగ్రహాలపైన దాడులో ఉన్న రాజకీయ కుట్రను బట్టబయలు చేయడం ద్వారా ఎంతటి పెద్ద వాళ్లు ఏ పార్టీ వారు ఉన్నా సరే బయట పెట్టాలని కోరుతున్నారుట. కేవలం టీడీపీ మీద మాత్రమే విమర్శలు చేస్తూ బీజేపీని వదిలేస్తే అసలైన ముప్పు ఆ వైపు నుంచే పొంచి ఉందని అంటున్నారుట. ఏపీలో ఇప్పటికే రాజకీయాల్లోకి మతం చొచ్చుకువస్తోందని వామపక్ష నేతలు నారాయణ రామకృష్ణ వంటి వారు ఆందోళన చేస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా మతాన్ని రాజకీయాలకు దూరం పెట్టాలని సూచిస్తున్నారు. మరి బీజేపీని లైట్ తీసుకుంటే మాత్రం జగన్ కే చివరికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News