బాజా భజంత్రీలు ఎక్కువయ్యాయే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భజంత్రీ చేసే వాళ్లు ఎక్కువయినట్లు కన్పిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సయితం భజన బృందానికి ఎక్కువగానే ప్రయారిటీ ఇస్తున్నట్లు కన్పిస్తుంది. [more]

Update: 2019-07-13 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భజంత్రీ చేసే వాళ్లు ఎక్కువయినట్లు కన్పిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సయితం భజన బృందానికి ఎక్కువగానే ప్రయారిటీ ఇస్తున్నట్లు కన్పిస్తుంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఇది స్పష్టంగా కన్పించింది. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్ భజన చేసే వాళ్లకు ఫిదా అవుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

బాబు సయితం…..

చంద్రబాబునాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావును విస్మరించారు. ఆయన పేరిట కొన్ని పథకాలను పెట్టిన చంద్రబాబునాయుడు అనేక పథకాలకు తన పేరును పెట్టుకున్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న కానుకలు అంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. చంద్రబాబునాయుడు కూడా భజన బృందం ఆటలో చిక్కుకుని పథకాలకు తన పేర్లను పెట్టుకున్నారు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సయితం అదే బాటలో పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పట్టుమని పదేళ్లు కాలేదు….

చంద్రబాబునాయుడు 70వ వడిలో పడటం ఆయన దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగానే తెలుగుదేశం పార్టీని నడుపుతుండటంతో పెద్దగా ఎవరూ పథకాలకు ఆయన పేర్లను పెట్టుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి పట్టుమని పదేళ్లు కూడా కాలేదు. తొలిసారి అధికారంలోకి వచ్చింది. కొన్ని పథకాలకు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు ప్రకటించారు. కానీ మరికొన్న పథకాలకు తన పేరును పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

ఎందుకంత తొందర….?

జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన అంటూ కొన్ని పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను పెట్టేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వత్తిడి వల్లనే ఆ పథకాలకు జగన్ పేరు పెట్టాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఈ పథకాలు జగన్ మెదడులో నుంచి వచ్చినవంటూ తమకు తామే వైసీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ భజన బృందాల వలలో పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సయితం చంద్రబాబునాయుడు లాగే వ్యవహరిస్తున్నారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. ఇకనైనా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటే వ్యవహరిస్తే మంచిదంటున్నారు.

Tags:    

Similar News