జగన్ అందుకే అలా…?

వైఎస్సార్ హయాంలో కామ్రెడ్స్ తో మంచి సంబంధలే నెరిపారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా 1999 నుంచి 2004 మధ్య కాలంలో పనిచేసినపుడు వామపక్షాలను కూదా కలుపుకుని [more]

Update: 2019-11-09 05:00 GMT

వైఎస్సార్ హయాంలో కామ్రెడ్స్ తో మంచి సంబంధలే నెరిపారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా 1999 నుంచి 2004 మధ్య కాలంలో పనిచేసినపుడు వామపక్షాలను కూదా కలుపుకుని పోరాటాలు చేశారు. కాంగ్రెస్ జాతీయ‌ పార్టీ కాబట్టి వామపక్షాలతో ఆ అనుబంధం దేశమంతటా కొనసాగింది. అయితే వైఎస్సార్ కి వ్యకిగతంగానూ కామ్రెడ్స్ మంచి స్నేహితులుగా నాడు మెలిగారు. జగన్ దశాబ్ద రాజకీయంలో ఒంటరిగానే ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. ఆయన ఎపుడూ ఇతర పార్టీల నేతలతో పెద్దగా సఖ్యత నెరిపిన సందర్భాలు కూదా లేవు. అలా అని ద్వేషించినది కూడా లేదు. అటువంటి జగన్ హఠాత్తుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఇంటికి వెళ్ళారు. ఆయన్ని పరమర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధుని సీఎం పలకరించడం వరకూ సహజ పరిణామమే అనుకున్నా జగన్ రాజకీయ శైలి ఎరిగిన వారు మాత్రం ఇది కొత్త వార్తగానే భావించారు. జగన్ ఓదార్పు యాత్రలు ఎన్ని చేపట్టినా ఇలా వ్యక్తిగత పరామర్శలు తక్కువ చేస్తారు.

సందర్భం కూడా….

ఇక జగన్ మధుని పరామర్శించిన సందర్భం కూడా ఇపుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే మరో వైపు జగన్ ప్రతిపక్షాల విమర్శల జడితో తడిసిముద్దవుతున్న నేపధ్యం ఇపుడు ఉంది. ఇక ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినపుడు ఎంత లేదనుకున్నా రాజకీయాలే ప్రస్తావనకు వస్తాయన్నది నిజం. అందులో వామపక్షాలు నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ ఉంటాయి. ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. మధు లాంటి వారు నెలకు నాలుగైదు లేఖలైనా ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల గురించి రాస్తూ ఉంటారు. అటువంటిది ముఖ్యమంత్రే మధు ఇంటికి రావడం అంటే అందులో అర్ధం పరమార్ధం ఉంటాయని అంటున్న వారూ ఉన్నారు. ఇదే ఇపుడు చర్చగా కూడా ఉంది. ఏపీలో పవన్ లాంగ్ మార్చ్ చేసినపుడు కామ్రేడ్స్ మద్దతు ఇవ్వకుండా దూరం పాటించాయి. ఓ విధంగా పవన్ తో తూచ్ అన్నట్లుగానే వారి వైఖరి ఉందన్న మాటలు కూడా వినవస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జగన్ మధుని పరామర్శించడం బట్టి చూస్తే ఇది పరామర్శకే పరిమితమా లేక దీర్ఘకాలంలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

విపక్షం నుంచి బాసట…

నిజానికి జగన్ వైఖరి ఎరిగిన వారు ఆయన ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోరని కచ్చితంగా చెబుతారు. అదే విధంగా ఆయన ఒంటరి పోరుకే ముందుకు సాగుతారని అంటారు. అయితే ప్రభుత్వంలోకి వచ్చాక కొంత సడలింపు ఉంటుంది. ప్రజలను మాత్రమే విశ్వాసంలోకి తీసుకోవడం కాదు, ప్రతిపక్షాలను కూడా కొంత విశ్వాసంలోకి తీసుకోవాలి. అలా చూసుకున్నపుడు జగన్ తో మొదటి నుంచి విభేదిస్తున్న టీడీపీ, జనసేనలతో వైసీపీకి పొత్తు అసలే కుదరదు, బీజేపీ వరకూ కేంద్ర నాయకత్వంతోనే సయోధ్య నేరుపుతున్నారు. ఇక రాష్ట్రం వరకూ వస్తే కామ్రేడ్స్ ని కలుపుకుని ముందుకు వెళ్తే ప్రజా సమస్యలపైన మరింత దృష్టి పెట్టినట్లుగా ఉంటుంది, వారి సలహా సూచనలు పాటించడం ద్వారా ప్రతిపక్షం నుంచి కూడా మద్దతు పొందే వీలు అవుతుందన్న ఆలోచనలు ఉన్నాయన్నమాట ఈ భేటీ గురించి విశ్లేషించినపుడు అనిపిస్తోంది. అయితే ఉన్నంతలో కామ్రెడ్స్ నిర్మాణాత్మకమైన విపక్షంగా ఉంటారని, వారు లేవనెత్తే సమస్యల్లో ప్రజలు తప్ప రాజకీయం ఉండదని అంతా నమ్ముతారు. ఆ భావనతోనే జగన్ కూడా కామ్రేడ్స్ ని కలుపుకుని ముందుకు సాగుతారేమో చూడాలి.

Tags:    

Similar News