గొంతు కోసింది అందుకేనట

జగన్ ఒట్టి తెలివి తక్కువ వాడు అని రాజకీయం నిండా పండించుకున్న నేతలు అనుకుంటున్నారు. ఎందుకంటే నోటి కాడ ముద్దను దూరం చేసుకున్నాడని, చేతికందే ఫలాలను పారబోసుకున్నాడని [more]

Update: 2020-01-28 02:00 GMT

జగన్ ఒట్టి తెలివి తక్కువ వాడు అని రాజకీయం నిండా పండించుకున్న నేతలు అనుకుంటున్నారు. ఎందుకంటే నోటి కాడ ముద్దను దూరం చేసుకున్నాడని, చేతికందే ఫలాలను పారబోసుకున్నాడని అటువంటి వారి ఆలోచన. ఇక వైసీపీలో కూడా కొంతమంది ఆలాగే ఆలోచిస్తూండవచ్చు. మండలిలో ఒక్క ఏడాదిన్నర కాలం కళ్ళు మూసుకుంటే చాలు వారు వీరవుతారు. అంటే వేరే పార్టీ ద్వారా ఫిరాయించడం కాదు, హ్యాపీగా మందబలంతో వైసీపీ ఎమ్మెల్సీలే మండలిలో ఎటు చూసినా నడయాడుతూ ఉంటారన్న మాట. మరి ఆ సంగతి జగన్ కి తెలియదా. తెలిసి కూడా ఎందుకు మండలి పైన వేటు వేశారు. తన పార్టీ నేతల భవిష్యత్తుని కూడా ఎందుకు నరికేసుకున్నారు. అంటే ఇక్కడే ఉంది జగన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

ఎన్నో జరుగుతాయి….

నిజానికి మండలిలో వైసీపీకి మెజారిటీ రావడానికి పద్దెనిమిది నెలల సమయం అనుకున్నా కూడా రాజకీయ గండరగండడు చంద్రబాబుకు అంత టైం ఇస్తే ఎన్నో ఈ మధ్యలో జరిపేయగల ఘనాపాటీ అన్నది జగన్ ఆలోచన. పైగా ప్రతీ బిల్లుకూ శాసనమండలి మోకాలడ్డుతుందని జగన్ భావన. జగన్ సైతం టీడీపీ విధానాలనే తిరగతోడుతున్నారు. మరి వారికి అది ఒళ్ళు మండించే విషయమే. దాంతో వారు ఎడ్డెమంటే తెడ్డేమంటారు. ఈ తలకాయ నొప్పి ఓ వైపు, ప్రతీసారి సర్కార్ పరువు పోవడం మరో వైపు. దాంతో పడలేకనే జగన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అలా భర్తీ……

ఇక జగన్ కూడా ఎన్నికల వేళ చాలా మందికి ఎమ్మెల్సీలను చేస్తామని హామీలు ఇచ్చాడు. అయితే ఇపుడు మండలే లేకుండా పోయింది. దాంతో రాజకీయ పునరావస కేంద్రం అన్నది లేదని వారంతా మధన పడడం ఖాయం. దానికి జగన్ ఆల్టర్నేషన్ ఆలోచించారని అంటున్నారు. ముందుగా ప్రాంతీయ కమిషనరేట్లను వేస్తారు. అందులో సభ్యుల సంఖ్యను నాలుగు నుంచి ఏకంగా తొమ్మిదికి పెంచుతారుట. ప్రతీ మూడు జిల్లాలకు ఒక ప్రాంతీయ‌ కమిషనేరేట్ ఉంటుంది. దాని చైర్మన్ కి క్యాబినెట్ హోదా ఉంటే మెంబర్స్ కి ఎమ్మెల్యే హోదా ఉంటుందిట. ఇలా తాను ఎమ్మెల్సీలుగా హామీ ఇచ్చిన వారిని అక్కడ అకామిడేట్ చేసి వారిలో అసంతృప్తి లేకుండా చూడాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలను కూడా పాతిక వరకూ పెంచుతారు కాబట్టి ఈ కమిషనరేట్లూ కూడా పెరిగి ఇబ్బడి ముబ్బడిగా పదవులు వస్తాయి.

అదీ ధైర్యం….

మరో వైపు చూసుకుంటే 2024 నాటికి ఏపీలో 175 ఎమ్మెల్యే సీట్లు 225 అవుతాయని కూడా ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే అదనంగా యాభై సీట్లు వచ్చి చేరుతాయి. వాటిలో ఈ ఆశావహులను, హామీ ఇచ్చిన వారిని సర్దుకోవాలని కూడా జగన్ మాస్టర్ ప్లాన్ తో ఉన్నారట. ఎమ్మెల్యేలుగా అయితే వెయిటూ, గౌరవం వేరుగా ఉంటుందని కూడా నచ్చచెబుతారట. ఇక మరో వైపు నామినేటెడ్ పదవులు కూడా ఎమ్మెల్సీలుగా హామీ పొందిన వారికి ప్రయారిటీ ఇచ్చి భర్తీ చేయాలని మరో ఆలోచన ఉందని అంటున్నారు. మొత్తానికి విపక్షం టీడీపీకి ఈ ఎమ్మెల్సీ పదవులు పోతే మరేమీ ఉండవు, అధికారంలో ఉండడంతో తాను ఏదో విధంగా మ్యానేజ్ చేసి తాను హామీ ఇచ్చిన వారికీ, నమ్ముకున్న వారికీ న్యాయం చేస్తానని జగన్ గట్టిగా తీర్మానించుకున్నారట. అందుకే ఎటువంటి బెంగా బెదురూ లేకుండా మండలి పై ఒక్క వేటు వేసి టీడీపీ గొంతు కోశారని అంటున్నారు.

Tags:    

Similar News