డేంజర్ జోన్ లో వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు ఉన్న పరిస్థితే మళ్లీ పునరావృతమవుతుందా ? జగన్ చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారా ? టీడీపీ చేస్తున్న ప్రచారం జగన్ [more]

Update: 2019-02-24 01:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు ఉన్న పరిస్థితే మళ్లీ పునరావృతమవుతుందా ? జగన్ చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారా ? టీడీపీ చేస్తున్న ప్రచారం జగన్ కు మైనస్ అవుతందా ? తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జగన్ విఫలమవుతున్నారా ? అనే ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ హవా కనిపించింది. అంతకుముందు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు సాధించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా జగన్ వేవ్ స్పష్టంగా కనిపించింది. జగన్ అధికారంలోకి వస్తున్నారనే వాతావరణం కనిపించింది. అదే సమయంలో రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన చంద్రబాబు చాణక్యం ముందు జగన్ చతికిలపడ్డారు. జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. వైసీపీకి ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లునని, జగన్ ను అనుభవం లేదని, అవినీతి పరుడని, జగన్ వస్తే ఫ్యాక్షనిజం వస్తుందని, రకరకాలుగా ప్రచారం చేశారు. దీంతో కచ్చితంగా గెలవాల్సిన జగన్ విజయానికి కొంత దూరంలోనే ఆగిపోయారు.

గత వ్యూహాన్నే అమలు చేస్తున్న టీడీపీ

ఈ ఎన్నికల విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేల్లో తేలుతోంది. అన్ని జాతీయ సంస్థలూ జగన్ స్వీప్ చేయనున్నారని అంచనా వేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ ప్రజలకు చేరువ కాగలిగారు. గత ఎన్నికల్లో ప్రభావం చూపని జిల్లాల్లోనే ఈసారి జగన్ పట్ల సానుకూలత పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అలెర్ట్ అయ్యారు. గత ఎన్నికల మాదిరిగానే టీడీపీ శ్రేణులు ప్రచారం ప్రారంభించాయి. ప్రతీ రోజు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ జగన్ పై కొత్త కొత్త ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధినేత నోటి వెంట వచ్చిన మాటలనే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. ఇక, రాష్ట్రంలో టీడీపీ అనుకూల మీడియా పెద్దఎత్తున ఉండటంతో ఈ ప్రచారం సులువుగా ప్రజల్లోకి వెళుతోంది.

ఆరోపణలు తిప్పకొట్టకపోతే…

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని జగన్ లైట్ గా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారు. తన గురించి ముఖ్యమంత్రి రోజుకో కొత్త ఆరోపణ చేస్తుంటే జగన్ మాత్రం కౌంటర్ ఇచ్చుకోలేకపోతున్నారు. బీజేపీని ఏపీ పాలిట విలన్ గా ప్రజల్లోకి తీసుకెళ్లిన టీడీపీ.. బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో ‘జగన్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే’ అని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు ‘జగన్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే’ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఈ లిస్టులోకి కేసీఆర్ ను కూడా చేర్చారు. తిరిగి గత ఎన్నికల మాదిరిగానే జగన్ అవినీతిపరుడు, అనుభవం లేదు అని టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మౌత్ పబ్లిసిటీ చేస్తున్నాయి. దీనికి వైసీపీ కానీ, జగన్ కానీ చెక్ పెట్టలేకపోతున్నారు.

వ్యతిరేక మీడియా ప్రభావం గుర్తించడం లేదా..?

జగన్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని, అమరావతిని తరలిస్తారనే ప్రచారమూ చేస్తున్నారు. తాను గెలిస్తే పోలవరం, అమరావతి వంటి అభివృద్ధి పనులు మరింత వేగంగా చేస్తానని జగన్ చెప్పలేకపోతున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి ప్రతీరోజు జగన్ గురించి మాట్లాడుతున్నారు. సహజంగా సీఎం మాటలకు మీడియా కవరేజి ఎక్కువగా ఉంటుంది. జగన్ మాత్రం ముఖ్యమంత్రికి కౌంటర్ ఇవ్వకుండా పార్టీ నుంచి ఒకరిద్దరు నెతలు మాట్లాడుతున్నారు. వారి మాటలకు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ ఉన్న వైసీపీ అభిమానులు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, గత ఎన్నికల కంటే ఈసారి సోషల్ మీడియా ప్రభావం పెరిగినా ప్రజలందరికీ చేరలేదు. కేవలం నవరత్నాలు, టీడీపీ వైఫల్యాలనే నమ్ముకుంటే జగన్ మరోసారి దెబ్బతింటారని విశ్లేషకులు అంటున్నారు. ఎప్పటికప్పుడు టీడీపీ చేస్తున్న ఆరోపణలను పూర్తి స్థాయిలో తిప్పికొడితేనే జగన్ పట్ల వ్యతిరేకత రాకుండా ఉంటుందనే విషయం జగన్ గుర్తించకపోతే కష్టమే అంటున్నారు.

Tags:    

Similar News