కోర్టులు ప్రభుత్వాలను కూల్చగలవా ?

కోర్టు ఉన్నది ఈ దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం చేయాల్సిందే. అంతకు మించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడడానికి. ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే కోర్టు [more]

Update: 2020-10-17 06:30 GMT

కోర్టు ఉన్నది ఈ దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం చేయాల్సిందే. అంతకు మించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడడానికి. ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే కోర్టు తలుపు తడతారు. ఎవరైనా ఒక ప్రజా ప్రభుత్వాన్ని కూల్చితే కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకుంటారు. అలాటిది ఒక ప్రభుత్వాన్ని కూల్చమంటూ కోర్టులలో కొందరు పిటిషన్లు వేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. అసలు ఏపీ సర్కార్ చేసిన నేరమేంటి. ఒక వేళ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏమైనా కోర్టు ధిక్కరణకు పాల్పడితే దానికి ఆయనకు శిక్ష వేయవచ్చు. దానికి మించి ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి ఉందా అన్నదే ఇపుడు చర్చ.

డిస్మిస్ చేయాలట….

జగన్ సర్కార్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. అందులోని అంశాల తీవ్రత కూడా అలాగే ఉంది. దాని మీద విచారణ జరపాలని ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖ న్యాయవాదులు కోరుతున్నారు. మరి అది వదిలేసి నిరాధారమైన ఆరోపణలు అంటూ కొందరు న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు వేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఏదైనా విచారణ జరిపితే కదా ఆధారమో, నిరాధారమో తేలేది అన్నది కూడా మేధావుల నుంచి వస్తున్న మాట. జగన్ సర్కార్ ని వెంటనే డిస్మిస్ చేయండి అని పిల్స్ వేస్తున్న వారు ఇది ప్రజాస్వామ్యదేశమని ఎందుకు మరచిపోతున్నారు అన్నది మరో చర్చగా ఉంది.

ఆ సందర్భాలు లేవుగా……

ఒక ప్రభుత్వం కూలిపోవడం అంటే దానికి మెజారిటీ లేకపోతే జరుగుతుంది. ఏపీలో చూసుకుంటే జగన్ సర్కార్ కి 151 మంది ఎమ్మెల్యేల మంద్దతు ఉంది. అంతకు మింది మరో అరడజన్ మంది విపక్ష సభ్యుల మద్దతు కూడా ఉంది. ఇక ఆయన మీద గవర్నర్ చర్యలు తీసుకుని కేంద్రానికి లేఖ రాస్తే అపుడు సర్కార్ కూలేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అంటున్నారు. మరి ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారితేనో, లేక సమాజం సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంటేనో గవర్నర్ చర్యలకు ఉపక్రమించవచ్చు. అపుడు కేంద్రం రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేయవచ్చు. అలా చేసిన దానికి కూడా కోర్టులలో సవాల్ చేసి నిలిచిన గెలిచిన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఇక్కడ అలాంటిదేమీ లేకుండా జగన్ సర్కార్ ని కూలదోస్తారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న.

ఇదీ రాజకీయమేనా….?

ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కాలమే అయింది. ఇంకా మూడున్నరేళ్ల పాలన ఉంది. అంటే ఇంతకు రెట్టింపు పాలనాధికారం జగన్ చేతుల్లో ఉంది. కానీ జగన్ సర్కార్ని రద్దు చేస్తారు అని టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలలో అలజడి లేపి ఆ పార్టీలో ఏదైనా చీలిక తేవాలని విపక్ష తెలుగుదేశం ప్లాన్ గా ఉందా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. పాతికేళ్ల క్రితం ఇలాంటి చీప్ ట్రిక్స్ తోనే అన్న ఎన్టీఆర్ సర్కార్ ని కూలదోసి చంద్రబాబు గద్దెనెక్కాడు. ఇపుడు అలాంటి పరిస్థితులు కనుచూపు మేరలో కూడా లేవు. అయినా కొండకు వెంట్రుక కట్టి లాగితే పోయేదేముంది అన్న తరహాలో ఈ రాజకీయ డ్రామా ఆడుతున్నారు. మొత్తానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News