అయిపోయినట్లేనా?

జగన్ సర్కార్ అడుగులు శాసన మండలి రద్దు వైపే నడుస్తున్నాయా ? అవుననే అని అధికారపార్టీ వైఖరి స్పష్టం చేస్తుంది. మరో ఏడాదిన్నర వరకు వేచి చూసి [more]

Update: 2020-01-26 05:00 GMT

జగన్ సర్కార్ అడుగులు శాసన మండలి రద్దు వైపే నడుస్తున్నాయా ? అవుననే అని అధికారపార్టీ వైఖరి స్పష్టం చేస్తుంది. మరో ఏడాదిన్నర వరకు వేచి చూసి లబ్ది పొందడం మాటెలా ఉన్నా మండలిని అడ్డుపెట్టుకుని టిడిపి రాబోయే రోజుల్లో సైతం అడ్డుతగులుతోందని అంచనా వేస్తున్న వైసీపీ ప్రజలతో నేరుగా సంబంధం లేని వారికి మంగళం పాడేయటమే మంచిదన్న అభిప్రాయం పార్టీ లో మెజారిటీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విస్తృతం గా మండలి ఉంచాలా పీకేయాలా అన్న చర్చ మొదలు పెట్టేశారు. కీలకమైన రాజధానుల బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన క్షణం నుంచి వైసిపి అధినేత పార్టీ పెద్దలతో విస్తృత స్థాయి చర్చలు జరిపారంటున్నారు. అసెంబ్లీలో సైతం మంత్రులు, ఎమ్యెల్యేలు ముఖ్యంగా ఎమ్యెల్సీ అయి మంత్రులైన వారితోనే మండలి రద్దు చేయాలనే స్లోగన్ విజయవంతంగా ఇప్పించగలిగారు జగన్.

షాక్ లోనే టిడిపి …

మండలి రద్దు అంశం వైసీపీ చేతిలో లేదంటూ పైకి ప్రకటనలు చేస్తున్న టిడిపి లోపల మాత్రం అంతర్మధనం చెందుతున్నట్లు నేతల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశం ఇప్పట్లో తేలేది కాకపోయినా లేక వైసీపీ బ్లాక్ మెయిల్ చేసేందుకే అని నిజంగా అంచనా వేస్తే టిడిపి మండలి రద్దు పై పెద్దగా పట్టించుకునే పరిస్థితే ఉండదు. కానీ మండలి పరిణామాలపై సర్కార్ సీరియస్ అయిన దగ్గర నుంచి దానిపై చంద్రబాబు నుంచి గల్లీ లీడర్స్ వరకు మీడియా సమావేశాలు పెట్టించి మరీ అదో ఘోరమైన తప్పిదంగా ప్రచారం మొదలు పెట్టేసింది. అదేవిధంగా టిడిపి లో వున్న మండలి సభ్యులు ఎక్కడ చేజారిపోతారో అని జాగర్తలు మరోపక్క తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే శాసనమండలి ఛైర్మన్ పై దాడి దూషణలు అంటూ టిడిపి సాగిస్తున్న ప్రచారం ఇప్పుడు పక్కకు పోయింది. మండలి రద్దు అవుతుందా? అవ్వదా? అనే అంశంపైనే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ సాగుతుంది.

వారికి ఉద్యోగాలు ఎలా …?

వైసీపీ నిజంగానే మండలి రద్దు వైపే నిర్ణయం తీసుకుని కేంద్రంలోని మోడీ సర్కార్ త్వరిత గతిన ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తే ఒక్కసారిగా ముప్పై మందికి పైగా టిడిపి నేతలు రాజకీయ నిరుద్యోగులు అయిపోతారు. అధికారంలో ఉంటే వారికి ఏదో ఒక బెర్త్ ఏర్పాటు చేయెచ్చు. విపక్షంలో ఉండి పార్టీ తీసుకున్న నిర్ణయానికి బలై పోయామని గగ్గోలు పెట్టే వారిని ఓదార్చడం ఎలా అన్నదే అధినేత ముందు వున్న అసలు సవాలు కానుంది. ఇందులో మరీ ముఖ్యంగా కుమారుడు నారా లోకేష్ ని సైతం బాబు సముదాయించాలిసి ఉంటుందని అంటున్నారు. ఎమ్యెల్సీ వంటి పదవుల్లో వున్న వారు కూడా ఇప్పటికే పార్టీ అధికారపక్షంపై చేసే పోరాటాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. ఇక పదవులు లేకపోతే వీరంతా పార్టీకోసం ఏ మేరకు పనిచేస్తారన్నది ప్రశ్నార్ధకమే అంటున్నారు. ఇలాంటి చిక్కు సమస్యలన్నిటిని నలభై ఏళ్ళ పొలిటికల్ స్టార్ బాబు ఎలా అధిగమిస్తారు అన్నది ఆసక్తికరం.

Tags:    

Similar News