జగన్ హీట్ పెంచడం లేదే..!

రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగలి ఉన్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటున్నారు. [more]

Update: 2019-03-23 02:30 GMT

రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగలి ఉన్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటున్నారు. రోజుకు ఆరేడు చోట్ల ప్రచారసభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ఎన్నికల హీట్ పెంచేస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో వెనుకబడినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ ఎక్కువగా ప్రచారం చేయడం లేదు. జగన్ మూడు నెలల క్రితం వరకు పాదయాత్రతో ప్రజల్లోనే ఉన్నారు. అయితే, అది ఎన్నికల ప్రచారం కిందకు రాదు. ఎన్నికల వాతావరణం వచ్చాక చేసిన ప్రచారం ప్రజల్లోకి ఎక్కువగా వెళుతోంది. ఈ విషయంలో జగన్ కంటే చంద్రబాబు ముందున్నారు.

ఓవైపు మీడియా బలం… మరోవైపు ప్రచార హోరు

ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఉదయం టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన అందులో ఏం మాట్లాడారో అది మీడియాలో బాగా హైలెట్ అవుతుంది. ప్రతీరోజూ ఆయన సుమారు ఆరు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రకటనలు కూడా న్యూస్ ఛానళ్లతో పాటు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో హోరెత్తుతున్నాయి. సహజంగానే తెలుగుదేశం పార్టీకి మీడియా బలం ఎక్కువగా ఉంటుంది. దీంతో చంద్రబాబు ప్రచారం బాగా ప్రజల్లోకి వెళుతోంది. ఆయన తన పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ప్రచారంలో వెనుకబడ్డ జగన్

ఓ వైపు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రచారం హోరెత్తిస్తుండగా జగన్ మాత్రం వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కంటే ఒక రోజు తర్వాత జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు రోజుకు మూడు చోట్లే ప్రచారం నిర్వహించారు. తర్వాత ఓ రోజు మేనిఫెస్టో తుది కసరత్తు కోసం, మరో రోజు నామినేషన్ కోసం ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం పార్టీ పనులు ఉదయం వేళ చూసుకుంటే వెంటనే ప్రచారానికి బయలుదేరి రాత్రి వరకు చేసుకుంటున్నారు. జగన్ కు మీడియా బలం కూడా తక్కువగా ఉండటంతో ఆయన ప్రచారాన్ని కూడా పెద్దగా చూపించడం లేదు. అసలుకే జగన్ తక్కువ సభలు నిర్వహిస్తుండటం, అవీ పెద్దగా మీడియాలో హైలెట్ కాకపోతుండటంతో చంద్రబాబు ప్రచారం మాత్రమే ఏకపక్షంగా ప్రజల్లోకి వెళుతోంది. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రకటనలు కూడా ఇంకా మొదలు కాలేదు. దీంతో టీవీల్లోనూ టీడీపీ ప్రచారం ఏకపక్షంగా సాగుతోంది. మరి, ఇంకా 20 రోజులే ప్రచారానికి సమయం ఉండటంతో జగన్ ఇప్పటికైనా స్పీడ్ అందుకుంటారేమో చూడాలి. అయితే, జగన్ తో పాటు షర్మిల, విజయమ్మ కూడా ప్రచారపర్వంలోకి దిగుతుండటం వైసీపీ ప్రచార జోరు ఏమైనా పెరుగుతుందేమో చూడాలి.

Tags:    

Similar News