మీరు సూపర్…… మీ టీం ఇంకా సూపర్

జగనన్న మీరు సూపర్‌. మీ టీం ఇంకా సూపర్. మీది ఎంత దయార్ద్ర హృదయం కాకపోతే మీ ఓటమిని బలంగా కాంక్షించిన వారిని, శత్రువుని పొగిడే వాళ్లను [more]

Update: 2019-09-25 06:30 GMT

జగనన్న మీరు సూపర్‌. మీ టీం ఇంకా సూపర్. మీది ఎంత దయార్ద్ర హృదయం కాకపోతే మీ ఓటమిని బలంగా కాంక్షించిన వారిని, శత్రువుని పొగిడే వాళ్లను అక్కున చేర్చుకుంటావు. మీ మీద… మీ కుటుంబం మీద బురద చల్లిన వాళ్లని క్షమించి వదిలేస్తావ్. అక్షరం ముక్క రాకున్నా… అనువాదం రాకున్నా… మాధ్యమాలతో ఎలా మసలుకోవాలో తెలియకున్నా.. ఆదరించి దరి చేర్చుకుంటావు. వాళ్లేం పనిచేస్తారో వారికే తెలియకున్నా అందలమెక్కించేస్తావు. ఎంత విశాల హృదయం కాకపోతే ప్రత్యర్ధులు విమానాలు సమకూరిస్తే ఇడుపుల పాయ మీదుగా చక్కర్లు కొట్టి ఫోటోలు తీసి నానా యాగీ చేసిన వాళ్లను మీ జట్టులో పెట్టుకుంటావు. మీ తాత, తండ్రుల్ని ఫ్యాక్షనిస్టులుగా అసైన్డ్‌ భూములు ఆక్రమించిన వారిగా చిత్రీకరించినోళ్ళని అడగ్గానే నీ టీంలో కలిపేసుకుంటావు.

జాప్యం జరుగుతుందనేనా?

అక్కడెక్కడో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతుంటే రైతుల భూముల్ని బలవంతంగా గుంజుకున్నారని యాగీ చేసినోళ్ల మీద ప్రేమ చూపిస్తావు. అదే మీ గొప్పతనం. మీ టీం గొప్పతనం. అంతెందుకు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తు చేయాలని వ్యూహాలు రచించే శతఘ్నుల్ని, మరఫిరంగుల్ని ఏరికోరి జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఏరి తీసుకొచ్చి మరీ మీ గూట్లో పెట్టుకుంటావు. మీ గుట్టుమట్టులన్ని ప్రత్యర్ధులకు తెలియడంలో జాప్యం జరుగుతుందనే కదా వారికి కష్టం లేకుండా దగ్గరే పెట్టుకున్నావు. ఇప్పటికే మీ పేరు చెప్పుకుని రెచ్చిపోతున్నారు. వాళ్ల ముఖాన అధికారిక గుర్తింపు ఏదో పారేస్తే అది కూడా అధికారికం అవుతుంది.

పక్కలో బల్లేలను పెట్టుకుని మరీ….

ఎంతైనా మీ వ్యూహం మరెవ్వరికి రాదు. పక్కలో బల్లేలను పెట్టుకుని పనిచేస్తే భవిష్యత్తులో వెన్నుపోటు పొడిచారని చెప్పుకోడానికైనా ఉంటుందనేగా మీ లాజిక్. అదేదో అందరికి తెలిసేట్టు చేస్తే మరిన్ని బల్లేలు, ఖడ్గాలు వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతాయిగా. ఇప్పటికే చాలామంది ఆకలి మీదున్నారు. అవురావురుమంటూ ప్రభుత్వాన్ని నమిలేయడానికి. వాళ్లక్కూడా కాస్త దారి చూపించి పుణ్యం కట్టుకోండి. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరట కూడా. ఇలా కాంట్రాక్టర్లు, దళారులు, పవర్ బ్రోకర్లు చాలామంది సీఎం డ్రీం టీంలో చోటు దక్కించుకోడాని తెగ ఊబలాటపడుతున్నారు. వారి మీద కూడా కాస్త దయ చూపించన్నా. థ్యాంక్స్ జగనన్నా నీ ఉదాత్త హృదయానికి. ఇది మీకు తెలిసి జరుగుతుందో? లేదో? తెలియదు కాని.. మీ పక్కలో బల్లేలను పెట్టుకుని మరీ తిరుగుతున్నారన్న మాట వాస్తవం.

Tags:    

Similar News