జగన్ పార్టీకి ధీమా అదేనా..?

ఎన్నికల్లో విజయం కోసం శాయశక్తులా కష్టపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత విజయంపై పూర్తి ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ రోజు [more]

Update: 2019-04-18 02:30 GMT

ఎన్నికల్లో విజయం కోసం శాయశక్తులా కష్టపడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత విజయంపై పూర్తి ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ రోజు నుంచి ఆయనలో ధీమా కనిపిస్తుంది. కేవలం జగన్ లోనే కాకుండా కార్యకర్త స్థాయి నుంచి ప్రతీ ఒక్కరు వైసీపీ అధికారంలోకి వస్తుందనే కచ్చితంగా చెబుతున్నారు. కొందరయితే వైసీపీకి 120 సీట్లకు తక్కువ రావని లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. వైసీపీ నేతల్లో ఇంత ధీమా రావడానికి పక్కా లెక్కలు ఉన్నాయంట. జిల్లాల వారీగా ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిని అంచనా వేసిన తర్వాత లెక్కలు వేసుకొని గెలుపుపై ధీమాకు వచ్చేశారు.

భారీగా సీట్లు పెరుగుతాయట…

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 నియోజకవర్గాలను గెలుచుకుంది. ఇంకో 21 స్థానాలు గెలిస్తే అధికారం దక్కించుకునేది. అప్పుడు కడప. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మిగతా అన్ని జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ కంటే టీడీపీ చాలా ముందుంది. అయితే, ఈసారి మాత్రం సీన్ రివర్స్ అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన జిల్లాల్లో వైసీపీ ఇప్పటికీ బలంగానే ఉంది. దీంతో ఆ జిల్లాల్లో గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ రావని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

రెండు జిల్లాలు మినహా…

ఇక, తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా అండగా నిలిచిన జిల్లాల్లో ఈసారి పరిస్థితి మారిపోయిందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాల్లో ఈసారి టీడీపీకి చాలా సీట్లు తగ్గిపోతాయని, టీడీపీ కంటే తమ పార్టీకే అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసిన ఎఫెక్ట్ పూర్తిగా టీడీపీపైనే పడిందని, కచ్చితంగా టీడీపీ సీట్లకు ఇక్కడ భారీగా కోత పడనుందని భావిస్తున్నారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల్లో అనూహ్యంగా పుంజుకుందని, ఈ జిల్లాల్లో టీడీపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఇక, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలిపి గత ఎన్నికల్లో కేవలం వైసీపీ 9 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక్కడి నుంచి కూడా వైసీపీ సీట్లు పెంచుకోనుందని అనుకుంటున్నారు. మొత్తంగా కేవలం కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే టీడీపీ, వైసీపీకి చెరిసగం సీట్లు వస్తాయని, మిగతా అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో కచ్చితంగా 120 స్థానాలను వైసీపీ గెలుస్తుందని లెక్కలు కట్టారు. దీంతో వైసీపీ కార్యకర్త నుంచి అధినేత జగన్ వరకు విజయం పూర్తి పూర్తి ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News