భవిష్యత్తులో కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్..అక్షర క్రమంలో ముందుంది. అప్పు..ఇందులో కూడా అ ఉంది. ఇది కూడా అగ్రభాగమే . ఈ రెండూ కలిపి ఇపుడు అప్పుల ఆంధ్రాగా ఏపీ నిలిచింది. ఉమ్మడి [more]

Update: 2020-08-09 09:30 GMT

ఆంధ్రప్రదేశ్..అక్షర క్రమంలో ముందుంది. అప్పు..ఇందులో కూడా అ ఉంది. ఇది కూడా అగ్రభాగమే . ఈ రెండూ కలిపి ఇపుడు అప్పుల ఆంధ్రాగా ఏపీ నిలిచింది. ఉమ్మడి ఏపీలో అయితే ఎన్ని అప్పులు చేసినా కనిపించేది కాదు, 23 జిల్లాల పెద్ద రాష్ట్రం. పైగా బంగారు లాంటి హైదరాబాద్ ఉంది. అందువల్ల ఎవరైనా ధీమాగా ఇచ్చేవారు. తీర్చేస్తామన్న భరోసా ఉండేది. ఇపుడు రెండుగా విడిపోయిన తరువాత కూడా తెలంగాణాకు అప్పులు అంటే అక్కడ విపక్ష కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీని తిడుతున్నారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారని విమర్శిస్తున్నారు. నిజానికి సంపన్న రాష్ట్రం తెలంగాణాకే అంత బెంగ, బెదురు ఉంటే ఏపీకి ఇంకెంత ఉండాలి.

అందుకేనా భేటీ…?

ఇదిలా ఉండగా హఠాత్తుగా ఏపీకి చెందిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశారు. ఆమెతో ఏపీకి ఆదుకోవాలని, కరోనా కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో పన్నులు అయినా వసూలు కాక ఆదాయం మొత్తం కుప్పకూలిందని, భయంకరమైన పరిస్థితి ఉందని వివరించారు. విభజన హామీలు నెరవేర్చాలని కూడా ఆయన కోరారు. అంతేకాదు, ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కూడా అర్ధించారు. దీనితో పాటు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కూడా కోరినట్లుగా టాక్.

విదేశీ రుణమా…?

ఏపీ ఆర్ధిక పరిస్థితి చూసి దేశీయంగా ఉన్న సంస్థలు అప్పులు ఇవ్వడంలేదని టాక్ అయితే ఉంది. ఇక చంద్రబాబు ఉన్నంతలో చాలా చోట్ల అపులు చేశారని అంటారు. ఆయన పలుకుబడి అమోఘం. అందువల్ల ఎక్కడ అప్పు దొరికితే అక్కడకు వెళ్ళి మరీ చేశారని, ఫలితంగా వైసీపీకి అప్పులు చేసుకునే వెసులుబాటు కూడా లేదని అంటారు. ఈ నేపధ్యంలో విదేశాల వైపు ఏపీ చూపు సారించిందట. వెతగ్గా వెతగ్గా అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ట్రస్ట్ కి చెందిన సంస్థ వారు ఏపీకి తొమ్మిది వేల కోట్ల మేర అప్పులు ఇచ్చేందుకు అంగీకరించారని ప్రచారం అయితే సాగుతోంది.

భారీగానే ….

దీనికి సంబంధించిన సమాచారం చూస్తే భారీగానే వడ్డీ వడ్డింపులు ఉన్నాయట. అయితే అప్పు తీర్చేందుకు మాత్రం ఓ నలభయేళ్ళ గడువు విధించారని చెబుతున్నారు. అయితే ఈ అప్పు తెచ్చినా వడ్డీలు కట్టడం అంటే మాటలు కాదు, పైగా విదేశీ రుణాలు అంటే మన రూపాయిని మార్చి వారికి డాలర్లలో చెల్లించాలి. మన రూపాయి నానాటికీ పాపాయి అవుతున్న వేళ తెచ్చిన అప్పుకు నాలుగింతలు కట్టినా తీరుతుందా అన్న ప్రశ్న ఆర్ధికవేత్తల నుంచి వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే విదేశీ రుణాలకు ఈ రకమైన కారణాలతోనే కేంద్రం బ్రేకులు వేస్తోందని చెబుతున్నారు. దాని విషయం చర్చించి కేంద్రం అనుమతులు పొందేందుకే బుగ్గన ఢిల్లీ వెళ్లారని అంటారు. మరి కేంద్రంలోని మోడీ సర్కార్ విదేశీ అప్పు కోసం ఏపీకి పచ్చ జెండా ఊపుతుందా. లేక అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా వదిలేస్తుందా అన్నది చూడాలి మరి. అప్పు చేసినా చేయకపోయినా కూడా ఏపీకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

Tags:    

Similar News