బీజేపీకే జగన్ గురి ?

జగన్ రాజకీయం బాగానే నేర్చారు. ఆయన ఇపుడు అందులో రాటుదేలారు. ఏదైనా గురి చూసి బాణం వేస్తున్నారు. అది తగలాల్సిన వారికి తగులుతుంది. దాంతో తెర వెనక, [more]

Update: 2020-06-02 14:30 GMT

జగన్ రాజకీయం బాగానే నేర్చారు. ఆయన ఇపుడు అందులో రాటుదేలారు. ఏదైనా గురి చూసి బాణం వేస్తున్నారు. అది తగలాల్సిన వారికి తగులుతుంది. దాంతో తెర వెనక, ముందుసాగుతున్న సయ్యాటలు కూడా ఒక్కసారిగా ఆగిపోతాయి. చెడుగుడు చెలగాటలకు, రాజకీయ కయ్యాటలకు కూడా కొంత బ్రేక్ పడుతుంది. జగన్ ని ఇపుడు ఏపీలో బాగా చికాకు పెడుతున్నది టీడీపీ కాదు, బీజేపీ, నిజమే ఇది. బీజేపీకి ఏపీలో ఒక్క సీటు, కనీసమాత్రంగా క్యాడర్ కూడా లేదు కానీ జగన్ ని అడ్డుకుంటోంది. పెద్ద గొంతులో విరుచుకుపడుతోంది. ప్రతీ చిన్నదాన్ని బూతద్దంతో చూపిస్తూ నానా యాగీ చేస్తోంది. అందుకే బీజేపీకి గొంతులో పచ్చి వెలక్కాయ లాంటి ప్రత్యేక హోదాను జగన్ కదిపారు.

తేనేతుట్టేనా?

ఉమ్మడి ఏపీలో ప్రత్యేక తెలంగాణను అంతా రాజకీయంగా వాడుకునేవారు. దాని ఊసు తెస్తే తేనే తుట్టెను కదిపినట్లేనని కూడా అంతా అనేవారు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్రం ఒక బ్రహ్మపదార్ధం అని అందరి భావన. అది రాదు అన్నది రాజకీయ జీవుల నిశ్చిత అభిప్రాయం కూడా. అయితే వాడుకుంటే మాత్రం రాజకీయ అందలాలు అందించే నిచ్చెన కూడా అదే. అందువల్ల రాజకీయ నిరుద్యోగులు మాత్రమే తెలంగాణా అంటూ హడావుడి చేసేవారు. వారు ధాటికి పాలకులు బెదిరి ఎంతో కొంత తగ్గేవారు, సర్దుకునేవారు. ఇలా గడిచేది తెలంగాణా పేరిట తమాషా రాజకీయం, ఇపుడు విభజన ఏపీలో ప్రత్యేక హోదా కూడా అలాంటి అంశమే మరి. దాన్ని జగన్ ఇపుడు తెలివిగానే ముందుకు తెస్తున్నారు.

నాడూ నేడూ…

జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడూ ప్రత్యేక హోదానే ఆయుధంగా చేసుకుని ఉద్యమించారు. దాని వల్ల చంద్రబాబు ఎక్కువ టార్గెట్ అయ్యారు జగన్ కి రావల్సిన రాజకీయ లాభం భారీ ఎత్తున దక్కి ముఖ్యమంత్రి కుర్చీ ఒళ్ళోకి వచ్చిపడింది. ఇపుడు ఏడాదిగా ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడడంలేదు. నిజానికి ప్రతిపక్షం ఈ అస్త్రంగా చేసుకుని అధికార పార్టీ మీదకు దండెత్తాలి. కానీ ఎవరి రాజకీయ అవసరాలకు వారు తలొగ్గి హోదాను గోదాంలో పడేశారు. అందువల్ల మళ్ళీ జగన్ వద్దకే ఈ నినాదం వచ్చింది. ఈసారి జగన్ దాని ఒడుపుగా రెండవ వైపు నుంచి వాడుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఒక్క దెబ్బకు……

ప్రత్యేక హోదాతో ఏపీలో బీజేపీని ఈసారి విలన్ చేయడానికి జగన్ తగిన పధకాన్ని రెడీ చేశారని అంటున్నారు. ఏపీకి ఒక్క పైసా కేంద్రం నుంచి తేకుండా ఊసుపోని ఉపవాస దీక్షలతో, నిరసనలతో నిత్యం గడబిడ చేస్తున్న బీజేపీకి ఈ విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ఇక బీజేపీతో జట్టు కట్టిన జనసేనాని హోదా కాడెను ఎపుడో వదిలేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. మోడీని హోదా విషయంలో తిట్టి గొడవ పెట్టుకుని ఘోర ఓటమిని కొని తెచ్చుకున్న చేదు అనుభవం కళ్ళముందున్న చంద్రబాబు ఆ ఊసు ఎత్తరంటే ఎత్తరు. దాంతో జగన్ హోదా విషయంలో ఈ మూడు పార్టీలను ఒకే గాటకు కాట్టేసి తనదైన రాజకీయం మొదలెడతారని అంటున్నారు. హోదా అంశాన్ని సజీవంగా ఉంచితే బీజేపీకి ఏపీలో ఎప్పటికీ బ్రేకులు తప్పవు, అంటకాగుదామని చూస్తున్న టీడీపీకి, పొత్తు పెట్టుకున్న జనసేనలకు కూడా ఇదే అడ్డుతగులుతుంది. దాంతో తాను సేఫ్ జోన్లో ఉండవచ్చునని జగన్ ఈ సరికొత్త ఆలోచన చేశారని అంటున్నారు.

Tags:    

Similar News