అవి దెబ్బేస్తాయి…పారాహుషార్

మొత్తానికి మొత్తం పదమూడు జిల్లాల్లోనూ ఏకపక్షంగా గెలుచుకున్న వైసీపీ బంపర్ మెజారిటీ కొట్టి 151 అసెంబ్లీ సీట్లతో సర్కార్ ని ఏర్పాటు చేసింది. అయితే కేవలం ఏడు [more]

Update: 2020-01-11 12:30 GMT

మొత్తానికి మొత్తం పదమూడు జిల్లాల్లోనూ ఏకపక్షంగా గెలుచుకున్న వైసీపీ బంపర్ మెజారిటీ కొట్టి 151 అసెంబ్లీ సీట్లతో సర్కార్ ని ఏర్పాటు చేసింది. అయితే కేవలం ఏడు నెలల వ్యవధిలోనే రెండు జిల్లాలు పూర్తిగా యాంటీ అయ్యాయి. దానికి కారణం రాజధాని తరలింపు వ్యవహారం. ఇప్పటివరకూ ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంలో బోధన, కరెంటు కోతలు వంటి సమస్యలు వచ్చినా కూడా జగన్ సర్కార్ కి వ్యతిరేకత పెద్దగా రాలేదు. అయితే అమరావతి రాజధాని రగడ మాత్రం అలా ఇలా లేదని అంటున్నారు. దాంతో అత్యంత కీలకమైన రెండు జిల్లాలు కృష్ణా, గుంటూరులను వదిలేసుకోవాలా అన్న సందేహం సొంత పార్టీ నుంచే వస్తోంది. అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అంచనా వేయడంతో మంత్రులు, సీనియర్లు కూడా భయపడుతున్నారు.

అది నిజమేనా…?

అమరావతి రాజధాని తరలింపు వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగనే పార్టీ నేతలకు చెబుతున్నారట. ఓ వైపు స్థానిక ఎన్నికల నగరా మోగిన నేపధ్యంలో పార్టీ విజయావకాశలపైన అంచనాకు వచ్చిన జగన్ నాయకులతో మాట్లాడుతూ, ఏపీలో అన్ని చోట్లా వైసీపీ స్వీప్ చేయాలి. 2019 విజయాన్ని రిపీట్ చేయాలని కోరారు. అదే సమయంలో కృష్ణా, గుంటూరులలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చునని కూడా జగన్ విశ్లేషించారు. అక్కడ ప్రజల్లో కొంత బాధ ఉంది. దాని వల్ల మునుపటి పరిస్థితి ఉండకపోవచ్చునని జగనే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో విషయం అర్ధం కాక విపక్ష రాజకీయం ప్రభావంతో జనం అలా కొంత విభేధించినా వారిని కలుపుకుని పోతే మాత్రం మంచి ఫలితాలే రాబట్టవచ్చునని ధైర్యం నూరిపోశారట. మరి మంత్రుల మనసులోనూ అదే భావన ఉంది. అందువల్ల వారు కూడా స్థానిక ఎన్నికల్లో జెల్ల ఈ రెండు జిల్లాల్లో తప్పదని ముందే బెంబేలెత్తుతున్నారుట.

బాధ్యత ఇంఛార్జులదే….

ఇక స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం నుంచి అన్ని జెడ్పీ పీఠాలను గెలిపించే బాధ్యత అచ్చంగా ఇంచార్జి మంత్రులదేనని జగన్ ఆదేశించారని అంటున్నారు. ఏ మాత్రం ఆదమరచినా కూడా విపక్షం దాన్ని అవకాశంగా చేసుకుంటుందని జగన్ హెచ్చరించినట్లుగా భోగట్టా. ఏపీ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అన్ని రకాలుగా హామీలను తీర్చామని, సంక్షేమానికి పెద్ద పీట వేశామని కూడా జగన్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అందువల్ల రాజకీయంగా ఉన్న అన్ని అవకాశాలూ వాడుకుని పార్టీని గెలుపు తీరాలను చేర్చాలని, ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని కూడా జగన్ మంత్రులకు సూచించారట.

ఆదుకుంటాయా…?

జగన్ అధికారంలోకి వచ్చాక అనేక పధ‌కాలను వరసగా ప్రజలకు అందించారు. ఇందులో అడిగిన వారికీ, అడగని వారికీ కూడా ఇచ్చారు. ఉదాహరణకు ఒక ఇంట్లో ఆటో డ్రైవర్ ఉంటే అతనికి 12 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు, భార్యకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్నారు, బిడ్డకు అమ్మ ఒడి ద్వారా పదిహేను వేలు ఇస్తున్నారు. ఇంకా ఇళ్ళు మంజూరు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఇలా ఒక కుటుంబానికి లక్షల్లోనే లబ్ది కలిగేలా జగన్ పధకాలు డిజైన్ చేశారు. మరి వాటి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలంటే స్థానిక ఎన్నికలు రిఫరెండమేనని అంటున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి సహజంగానే మొగ్గు ఉంటుంది, అదే సమయంలో సరైన వ్యూహాలు లేకపోతే చతికిలపడే ప్రమాదమూ ఉంది. మరి జగన్ హెచ్చరించారు. నాయకులు పాటిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News