ఆన్సర్… సింపుల్… జగన్ …ఎగ్జాంపుల్

చూడబోతే యువ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు కరెక్ట్ గానే ఉన్నట్లున్నాయి. లేకపోతే దేశంలో మూడవ ర్యాంక్ ఎలా సాధించగలరు. గతసారి నాలుగో ర్యాంక్ వచ్చిన జగన్ ఈసారి [more]

Update: 2020-08-09 06:30 GMT

చూడబోతే యువ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు కరెక్ట్ గానే ఉన్నట్లున్నాయి. లేకపోతే దేశంలో మూడవ ర్యాంక్ ఎలా సాధించగలరు. గతసారి నాలుగో ర్యాంక్ వచ్చిన జగన్ ఈసారి మూడవ ర్యాంక్ కి ఎగబాకారు. ఆయన పాలనంతా గట్టిగా ఏడాది కూడా కాలేదు, కానీ దేశంలోని పెద్ద రాష్ట్రాలను, బలమైన ముఖ్యమంత్రులను నెట్టుకుని ముందుకురావడం ఆషామాషీగా చూడలేమన్నది నిజం. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ మొదటి ప్లేస్ లో ఉన్నాడంటే కేంద్రం అండ ఉంది. నిధులకు లోటు లేదు, ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ కూడా సంపన్న రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నారు. పై ఇద్దరూ అన్ని విధాలుగా అనుభవం సాధించిన వారు. ఇక‌ వెనకబడిన వారిని చూసినా ఆశ్చర్యమే. నితీష్ కుమార్ కానీ మమతా బెనర్జీ, కానీ పొరుగున ఉన్న తెలంగాణా సీఎం కేసీఆర్ కానీ ఏం తక్కువ తినలేదు. కానీ వారందరి కంటే జగన్ ఎందుకు ముందుకు వచ్చారూ అంటే సమాధానం సింపుల్.

అవే ఆదుకున్నాయా….

జగన్ చేతికి ఎముక లేనట్లుగా నిధులు కుమ్మరిస్తున్నారు. తన హామీలలో తొంబై శాతం అమలు చేసిన సీఎంగా ఉన్నారు. అదే విధంగా ఖజానాకు వచ్చిన ప్రతీ పైసా కూడా జనం ఖాతాలోనే వేస్తున్నారు. జగన్ కే గుర్తులేని ఎన్నో స్కీములను ఆయన అమలు చేశారంటే మెచ్చాల్సిందే. అందువల్లనే ఏపీలో పాలన ఎలా ఉంది అంటే పైసలు చేతిలో పడిన వారంతా బాగానే ఉందని చెబుతారు. ఇక వైసీపీ మంత్రుల లెక్క ప్రకారం చూసుకున్న ఏపీలో మొత్తం మూడున్నర కోట్లకు పైగా జనాలకు జగన్ పధకాలు అమలవుతున్నాయి. మిగిలిన వారిలో కూడా ఇంటికి ఒక పధకం అయినా ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.

అక్కడ మైనస్ ….

ఇక జగన్ ఇంత చేసినా ఆయనకు 11 శాతం మాత్రమే రిజల్ట్ వచ్చింది. అదే విధంగా ఢిల్లీ సీఎం కి 15 శాతం, యోగికి 24 శాతం వచ్చింది. మరి వారితో పోలిస్తే జగన్ చాలా దూరంగా ఉన్నారు. ఆ దూరం ఎందువల్ల అంటే అభివృధ్ధి అన్నది ఏపీలో లేకపోవడం వల్లనేనని అంటారు. జగన్ ఏడాది పాలనలో కొత్తగా ఒక్క ఇటుక రాయి పడలేదు, గట్టి ప్రాజెక్టు ఒకటి లేదు, ఇక యాక్షన్ ప్లాన్ అంటూ కూడా సిధ్ధం కాలేదు. అంటే వచ్చిన డబ్బు అంతా చిల్లరగా జగన్ ఖర్చు చేస్తున్నారు తప్ప శాశ్వతమైన అభివృధ్ధికి మాత్రం సుపరిపాలకుడిగా కేటాయించడంలేదని విశ్లేష‌ణలు ఉన్నాయి. అందుకే జగన్ కి అది మైనస్ గా కనిపిస్తోంది.

అలా చేస్తేనే ….

జగన్ ఇపుడు చేస్తున్నది అంతా తాత్కాలికం. అంటే ఆయన డబ్బులు ఇస్తేనే జనం బాగుంది అంటారు. ఆయన కనుక ఏ కారణం చేతనైనా సంక్షేమాన్ని ఆపితే అపుడు ఇదే జనంలో నెగిటివిటీ వస్తుంది. అంత మాత్రం చేస్త పధకాలు ఆపమని కాదు, వాటిని కొనసాగిస్తూనే ప్రగతికి బాటలు వేయాలి. ఏపీ వంటి కొత్త రాష్ట్రానికి యువ ముఖ్యమంత్రిగా జగన్ కి బంగారం లాంటి అవకాశం వచ్చింది. చరిత్రలో మిగిలేలా అభివృధ్ధి పనులు చేస్తే జగన్ ని జనమంతా మెచ్చుకుంటారు. అపుడు వచ్చే ర్యాంకులే శాశ్వతం అవుతాయని మేధావులు కూడా అంటున్నారు. జగన్ కి ప్రజాదరణ లేదని ఎవరూ అనరు, దాన్ని అలా నిలబెట్టుకుంటూనే పది కాలాలు పచ్చగా ఏపీ నిలబడేలా ఆయన అభివృధ్ధి చేసి చూపిస్తే మొదటి ర్యాంక్ ని చేరుకోవడం పెద్ద కష్టం కాబోదు. మరిన్ని టెర్ములు ఆయనే సీఎంగా ఉండడానికి కూడా అది దోహదపడుతుంది.

Tags:    

Similar News