జగన్ అలా చేస్తేనే బెటర్… అది మంచిది కూడా?

పీవీ నరసింహారావు. గొప్ప నాయకుడు. ఆయన రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే గొప్ప సాహితీకారుడు అయి ఉండేవారు. అలాగే గొప్ప మేధావిగా చరిత్రపుట‌ల్లో నిలిచేవారు. ఆయన ఆనాటి రాజకీయ [more]

Update: 2020-08-02 09:30 GMT

పీవీ నరసింహారావు. గొప్ప నాయకుడు. ఆయన రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే గొప్ప సాహితీకారుడు అయి ఉండేవారు. అలాగే గొప్ప మేధావిగా చరిత్రపుట‌ల్లో నిలిచేవారు. ఆయన ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఆయన్ని ఇందిరాగాంధీ సమాదరించింది. ఆయన మేధస్సునే ఉపయోగించుకుంది. ఆ తరువాత రాజీవ్ గాంధీ కూడా పితృసమానుడుగా చూసుకున్నారు. ఆ మీదట‌నే పీవీకి కష్టాలు మొదలయ్యాయి. అయితే రాజీవ్ మరణాంతరం అనూహ్యంగా పీవీ నరసింహారావు ప్రధాని పదవి అలంకరించారు. ఆయన‌ అయిదేళ్ల పాటు దిగ్విజయంగా నెహ్రూ కుటుంబేతరుడిగా అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మరో వైపు ప్రధానిగా బాధ్యతలు గొప్పగా నిర్వహించారు.

వైఎస్ తో అలా….

ఇక పీవీ ప్రధానిగా ఉన్న కాలంలోనే ఒక ఎంపీగా వైఎస్ కడప నుంచి లోక్ సభలో అడుగుపెట్టారు. రాజీవ్ గాంధీ తరువాత వైఎస్ ని కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి పెద్దగా ఆసరా ఇచ్చింది ఆ రోజుల్లో ఎవరూ లేరని అంటారు. ఇక పీవీ తన పాత మిత్రులను చేరదీసి ఏపీకి ముఖ్యమంత్రులుగా పంపించారు. అలా కేంద్రంలో మంత్రిగా ఉన్న విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా చేశారు. ఇక ఈ టైంలో ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న వైఎస్ ని పీవీ ప్రోత్సహించలేదని చెబుతారు. పైగా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఢిల్లీకే పరిమితం చేశారు.

కడప ఉదంతం….

ఇక కడపలో జరిగిన ప్రధాని పీవీ సభలో చెప్పులు విసిరారు. అదెవరో తెలియకపోయినా వైఎస్సార్ అలా చేయించారని ఆయన నిత్య అసమ్మతినేత అని నాడు మీడియాలో రాతలు వచ్చాయి. వైఎస్సార్ వ్యతిరేక వర్గం పనిగట్టుకుని దాన్నే ప్రచారంలోకి తెచ్చింది. ఇక విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వైఎస్సార్ అవకాశాలను దెబ్బగొట్టడానికేనని నాడు ఆయన అనుచరులు భావించారని అంటారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా పీవీ అంటే వైఎస్సార్ కి ఎపుడూ గౌరవం ఉండేదని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత పీవీ ఇంటికి ఎళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారని కూడా చెబుతారు.

జగన్ కే పేరు……

ఈ ఏడాది పీవీ శతజయంతి సంవత్సరం. తెలుగు నాట పీవీ లాంటి నేత మరొకరు పుట్టరు. పైగా అయిదేళ్ల పాటు ప్రధానిగా చేయడమే కాదు, దేశానికి దశ, దిశ చూపించిన నేత. ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం అవసరం. పీవీ సెంటినరీ సెలెబ్రేషన్లు ఏపీలో కూడా నిర్వహించాలని రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు సూచించారు. ఇది నిజంగా మంచి సూచనే. అదే విధంగా పీవీకి భారత రత్న కోసం మంత్రివర్గం ప్రతిపాదించాలని కూడా రాజు కోరారు. ఇది సముచితమే. పీవీని ఒక తెలుగు ముఖ్యమంత్రిగా జగన్ ప్రస్తుతించడం అవసరం. తెలుగు నాట ఒక ఎన్టీఆర్, వైఎస్సార్, పీవీ, ప్రకాశం లాంటి వారు రాజకీయాలు అతీతంగా పూజనీయులు. తమదైన ముద్ర బాగా వేసుకున్న వారు. అందువల్ల పీవీ విషయంలో జగన్ అలా చేస్తే ఆయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ కి కూడా గౌరవం ఇనుమడిస్తుంది. అదే విధంగా కొత్త జిల్లాకు ఒకదానికి పీవీ పేరు పెట్టడం కూడా ఉత్తమం. నాడు తండ్రి వైఎస్సార్ పీవీని అవమానించారు అన్న మచ్చ ఏదైనా ఇంకా ఉంటే కొడుకు జగన్ దాన్ని తుడిచేయడానికి కూడా ఇది ఉపయోపడుతుంది. మరి జగన్ ఆలోచన చేయాలి.

Tags:    

Similar News