జగన్ వైఎస్ కానే కాదు.. ఎందుకంటే?

కష్టపడి సాధించుకున్న అధికారం. సొంతంగా పెట్టిన పార్టీ, పది కాలాలు ఉండాలి ముఖ్యమంత్రి పదవి. అలాగే పార్టీ కూడా పచ్చగా ఉండాలి. ఇదీ జగన్ మనసులో సదా [more]

Update: 2020-07-30 03:30 GMT

కష్టపడి సాధించుకున్న అధికారం. సొంతంగా పెట్టిన పార్టీ, పది కాలాలు ఉండాలి ముఖ్యమంత్రి పదవి. అలాగే పార్టీ కూడా పచ్చగా ఉండాలి. ఇదీ జగన్ మనసులో సదా మెదిలే ఆలోచనలు. దాంతో జగన్ ఒక పధ్ధతి ప్రకారం తనకంటూ సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. పాత నీరు, కొత్త నీరు మధ్య తేడా చూపిస్తున్నారు. తనతో అడుగులు వేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్ కి తన తండ్రి వైఎస్సార్ లెగసీ కావాలి. తన తండ్రితో ఉన్న వారు ఇపుడు జగన్ కి అవసరం లేదు. కానీ వైఎస్సార్ నీడను కూడా దాటి చాలా ముందుకు వచ్చేశారాయన. జగన్ కి ఇపుడు తనవారు అయిన మనుషులు కావాలి. తమ అధికారం, అదఋష్టం అన్నీ జగనే అని చెప్పుకునే వారు కావాలి.

అనూహ్యమే…..

అందుకే జగన్ ఇద్దరు మంత్రులను అనూహ్యంగా ఎంచుకున్నారు. జగన్ కొత్త మంత్రులు ఎవరూ అన్నపుడు మీడియాలో వచ్చిన పేర్లూ హడావుడి చాలానే ఉందనిపించింది. ఎంతో మంది కోటి ఆశలతో అమాత్య కిరీటం తమదేనని భావించారు. ఎవరికి తోచిన సమీకరణలు వారు వేసుకుని తమకు గ్యారంటీ అనుకున్నారు. కానీ జగన్ లెక్కలు వేరు. జగన్ కి కావాల్సింది తన చేతులో మీదుగా కిరీట ధారణ జరగాలి. తన వల్ల ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారికే మంత్రి పదవి ఇస్తే జీవితాంతం వారు తన గురించి చెప్పుకుంటారన్నది జగన్ ఆలోచన. తనతోనే కలసి ఉంటారని కూడా ఆశ. ఇక తనదైన ముద్ర కూడా రాజకీయాల్లో బలంగా ఉంటుందని కూడా జగన్ భావించిన దానికి ప్రతిరూపమే ఓ అప్పలరాజు, ఒక చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ మంత్రులు కావడం.

వారు అక్కడేనా…?

జగన్ వైఎస్ కుమారుడిగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అపుడు జగన్ వెంట పూర్తిగా కాంగ్రెస్ మనుషులే కనిపించారు. మాజీ మంత్రులు కూడా నాడు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా కూడా తరువాత రోజుల్లో తామే మళ్ళీ చక్రం తిప్పుతామని కూడా అనుకున్నారు. కానీ జగన్ వారిని పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో కొందరికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చి అసెంబ్లీ దాకా తీసుకువచ్చారు. కొందరిని మంత్రులుగా చేశారు. కానీ ఇపుడు అధికారం జగన్ చేతిలో ఉంది. దాంతో ప్రభుత్వంలో తనదైన శైలిలో కొత్త ముద్ర ఉండేలా చూడాలని జగన్ తపన పడుతున్నారు. పైగా ఇపుడు జగన్ కి ఎక్కడలేని వెసులుబాటు ఉంది. అందుకే ఆయన స్వేచ్చగా ప్రయోగాలు చేస్తున్నారు.

వెనకేనోయ్….

వెనకబడితే వెనకనేనోయ్ అని మహాకవి గేయం ఉంది. ఇపుడు కాంగ్రెస్ ముద్ర నుంచి జగన్ బయటకు వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా మంత్రులు ఇతర పదవులు పొందిన సీనియర్లు వైసీపీలో చాలా వెనకబడ్డారు. వారు అలా వెనకనే ఉంటారు. జగన్ మాత్రం తన టీంని తయారు చేసుకుని ముందుకు వెళ్తారు. జగన్ కి ఇపుడు కావాల్సింది బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు. స్వతహాగా ఆయన రెడ్డి కులస్థుడు అయినా మిగిలిన రెడ్డిలకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు, ఇదే జగన్ చెప్పే సందేశం. జగన్ సైన్యం అంటూ కొత్తగా తయారు కావాలి. అందులో సామాజిక వర్గ సమతూకం ఉండాలి. తన రాజకీయం అపుడే బాగా పండుతుంది. ఇదే జగన్ ఆలోచన. మొత్తానికి జగన్ ముద్ర పడిన వారికే రాజయోగం అని చెప్పకనే చెప్పేశారు. ఇక సీనియర్లకు తత్వం పూర్తిగా అర్ధమైంది. అయినా చేసేదేమీ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్ వైఎస్సార్ అంతకంటే కాదు.

Tags:    

Similar News