జగన్ ముందు వారందరూ తేలిపోయారే ?

జగన్ కి ఏమి అనుభవం ఉంది. ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదు, అటువంటి జగన్ కి ఆదిలోనే కరోనా విపత్తు లాంటి పెను సవాల్ ఎదురైంది. ఇంకేంటి [more]

Update: 2020-07-14 13:30 GMT

జగన్ కి ఏమి అనుభవం ఉంది. ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదు, అటువంటి జగన్ కి ఆదిలోనే కరోనా విపత్తు లాంటి పెను సవాల్ ఎదురైంది. ఇంకేంటి ఏపీ జనానికి ఇబ్బందులే అని ఎకసెక్కం ఆడిన వారు ఇపుడు అదే నోటితో జగన్ శభాష్ అంటున్నారు. కరోనా విసిరిన సవాల్ ని సరిగ్గా అర్ధం చేసుకుని తగిన యాక్షన్ ప్లాన్ తో సమాధానం చెబుతున్న అతి కొద్ది మంది నాయకుల్లో జగన్ ఒకరు. జగన్ కరోనా విషయంలో పూర్తి వాస్తవికతతో ఉన్నారు. మిగిలిన వారికి భిన్నంగా జగన్ కరోనా మనతోనే ఉంటుంది. దాంతోనే సహజీవనం చేయకతప్పదు అన్న నాడు పూర్తి అవహేళకు గురి అయ్యారు. అదే సమయంలో కొందరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా ఫలానా టైంలో పోతుంది అటూ డెడ్ లైన్లు పెట్టి తాము సమర్ధంగా పనిచేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. నాలుగు నెలల తరువాత సీన్ కట్ చేస్తే జగన్ అన్నదే నూటికి నూరు శాతం నిజం అయింది.

కరెన్సీ కళ …..

కరోనా పేరిట రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించారు. నూటికి నూరు శాతం ప్రజలు ఇంట్లోనే ఉండిపోయారు. వారికి పని లేదు, ఆదాయం కూడా లేదు, అటువంటి వేళ చేతిలో నగదుని పెట్టి రేషన్ నెలకు రెండు సార్లు ఇస్తూ జీవనం కొంత వరకూ నడిచేలా చూసిన జగన్ కార్యాచరణను ఇపుడు మిగిలిన రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయి. మరో వైపు సంక్షేమ పధకాల మోత మోగించారు. దాంతో ఆర్ధికంగా పేదలకు న్యాయం జరిగింది. కరోనా వేళ అన్ని రాష్ట్రాలు కుదేల్ అయి మార్కెట్లు డల్ అయినా ఏపీలో మాత్రం కదలిక వచ్చిందంటే దానికి జగన్ తీసుకున్న చర్యలే కారణం అని ఇపుడు అంతా ఒప్పుకుంటున్నారు.

అదే తారకమంత్రంగా …..

ఇక మూడు టీలను జగన్ గట్టిగా పట్టుకున్నారు. ట్రాకింగ్,ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ఈ మూడూ కూడా గత మూడు నెలలుగా ఏపీలో నిబధ్ధతతో చేయడం వల్లనే ఇపుడు ఏపీలో అత్యంత ప్రమాదకర పరిస్థితి కరోనా వల్ల లేదు అంటున్నారు. ఓ వైపు కరోనా కేసులు ఎక్కువగా రావడానికి కారణం పరీక్షలు రోజుకు పాతిక ముప్పయి వేల వరకూ చేయడం ప్రధాన కారణంగా వైద్య నిపుణులే చెబుతున్నారు. మరో వైపు చూసుకుంటే కరోనా టెస్టుల్లో దేశంలోనే చాలా ముందుంటూ ఇప్పటికి పది లక్ష మార్క్స్ ని దాటేసిన రాష్ట్రంగా ఏపీ ముందుంది.

అది చాలు….

ఇక కరోనా వేళ ఏకంగా 1088 అంబులెన్సులను ఒక్కసారి ప్రారంభించి రోడ్ల మీదకు తీసుకురావడం ద్వారా జగన్ జాతీయ స్థాయిలో ఒక్కసారిగా హైలెట్ అయ్యారు. ఆరోగ్యం మీద కరోనా విసిరిన సవాల్ కి ఇదీ నా జవాబు అంటూ ఏపీ తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల దేశమంతా ఏపీ వైపు చూసేలా చేశారు. మొబైల్ ఆసుపత్రులను అలా పల్లెలకు పంపడం ద్వారా అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జగన్ కరోనాను గట్టిగా ఎలా ఎదుర్కోవచ్చో నిరూపించారు. ఇక వాలంటీర్ల వ్యవస్థ గురించి అంతా చెప్పుకున్నదే. ఈ రకమైన చర్యలతోనే జగన్ ఇపుడు ఇతర రాష్ట్రాల సీఎంలకు కూడా ఆదర్శంగా నిలిచారు. అందువల్లనే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి జగన్ ని పొగుడుతున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిధ్ధరామయ్య కొనియాడుతున్నారు. డిల్లీ మంత్రి సిసోడియా వంటి వారు భేష్ జగన్ అంటున్నారు. ఒక సంక్షోభం నుంచి సత్తా చాటడం అంటే ఇదేనేమో. జగన్ తీసుకుంటున్న చర్యల మూలంగా పాలన ఎక్కడా ఆగలేదు, సంక్షేమానికి బ్రేక్ పడలేదు. షెడ్యూల్ ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. ఇదెలా సాధ్యమంటే జగన్ విజన్ అనుకోవాలేమో.

Tags:    

Similar News