అప్పుల కుప్పగా ఏపీ.. వెనుక స్టోరీ ఏంటి..?

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైనా 50 వేల రూపాయ‌ల అప్పు ఉంటుంద‌ని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఇటీవ‌ల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు ల‌క్షల [more]

Update: 2020-07-14 05:00 GMT

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైనా 50 వేల రూపాయ‌ల అప్పు ఉంటుంద‌ని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఇటీవ‌ల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు ల‌క్షల కోట్ల పైచిలుకు బ‌డ్జెట్‌ను మించిపోయిన అప్పులు ప్రభుత్వాన్ని, ప్రజ‌ల‌ను కూడా ఒణికిస్తున్నాయి. అయితే, వాస్తవానికి దేశంలో ప‌శ్చిమ బెంగాల్‌, యూపీ, పంజాబ్ వంటి కీల‌క రాష్ట్రాల‌తో పోల్చుకుంటే.. ఏపీ అప్పులు పెద్దగా లేవ‌నేది కేంద్రం మాటే! అయిన‌ప్పటికీ.. ప్రస్తుతం ఏపీ అప్పు.. రూ.3ల‌క్షల కోట్ల రూపాయ‌లు. అందులోనూ.. గ‌త చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పే రెండు ల‌క్షల పైచిలుకు కోట్ల రూపాయ‌లు. జ‌గ‌న్ ప్రభుత్వం చేసిన అప్పు తొలి ఏడాదిలో 84 వేల కోట్ల రూపాయలుగా ఉంది.

బాబు హయాంలోనే…

దీంతో రాష్ట్రం అప్పుల మ‌యంగా ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన త‌ర్వాత 16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్‌తో ప‌ని ప్రారంభ‌మైంది. దీనిలో కేంద్రం ఒక మాట అంటే.. రాష్ట్రం మ‌రో లెక్క చెప్పి న విష‌యం తెలిసిందే. కేంద్రం కేవ‌లం ఆరు వేల కోట్ల రూపాయ‌లే లోటు బ‌డ్జెట్‌తో ఏపీ ఏర్పడిందని తెలిపింది. దీనిలో నాలుగున్నర వేల కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చేశామ‌ని .. చంద్రబాబు హ‌యాంలోనే కేంద్ర ప్రభుత్వం గ‌ణాంకాల‌తోపాటు వెల్లడించింది. ఇక‌, చంద్రబాబు ప్రవేశ పెట్టిన ప‌థ‌కాలు కావొచ్చు.. ప్రచారం కావొచ్చు.. రాష్ట్రం అప్పుల దిశ‌గా అడుగులు వేయ‌డానికి బాబు హ‌యాంలోనే బీజం ప‌డింద‌ని చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వమూ భాగమే….

అయితే ఇందులోనూ.. కేంద్ర ప్రభుత్వం పాత్రను తొసిపుచ్చలేం. రాష్ట్రానికి ఉండే అప్పుల ప‌రిమితిని కేంద్రం స‌వ‌రించ‌డం ప్రారంభించింది. తాను రాష్ట్రాల‌కు ఇచ్చే (తిరిగి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేని) గ్రాంట్లను రాను రాను త‌గ్గించేసి.. అప్పులు చేసుకునే అవ‌కాశాన్ని పెంచుతూ పోయింది. దీంతో రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఇది రాజ‌కీయంగా ప్రభావం చూపించే విష‌యం కావ‌డంతో నిధులు తెచ్చుకోక త‌ప్పని ప‌రిస్థితి. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు మాసాల‌ ముందు 10 వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసి.. ప‌సుపు కుంకుమ కింద పందేరం చేసింద‌నే లెక్కలు దీనిలో భాగ‌మే.

అప్పులపై వడ్డీలు….

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం కూడా ఇదే ప‌ద్ధతిని అవ‌లంబిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యలోటు 14% గా ఉంది. అంటే ఇది సుమారు 5053 కోట్ల రూపాయ‌ల‌ని లెక్కలు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో చేసిన అప్పుల‌కు చెల్లించాల్సిన వ‌డ్డీలు ఏకంగా 20.9 శాతం పెరిగాయి. దీంతో ఏటా 5501 కోట్ల రూపాయ‌ల‌ను వ‌డ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. మీ ప్రభుత్వం అప్పులు చేసింద‌ని, అందుకే రాష్ట్రం అప్పుల మ‌యంగా మారింద‌ని వైసీపీ చెబుతుంటే.. దీనికి భిన్నంగా టీడీపీ మీరు ఏడాదిలోనే మేం ఐదేళ్లలో చేసిన అప్పులు చేశారంటూ.. ఎదురు దాడికి దిగింది. ఎలా చూసుకున్నా.. అటు కేంద్రం ఇవ్వక‌.. ఇటు రాష్ట్రంలో ఆదాయం పెర‌గ‌క‌పోవ‌డంతో అప్పులు చేయ‌క త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింద‌న్నది నిజం.

Tags:    

Similar News