ఈయనది మహా మొరటు రాజకీయం ?

ఆయన పేరులో మోహనముంది. ఆయన రూపం జగన్మోహనం. అవును. ఇదంతా జగన్ అనబడే వైఎస్ జగన్ మోహనరెడ్డి గురించి చెబుతున్నదే. సాధారణంగా ఎవరైనా యాక్టర్ ని మీరు [more]

Update: 2020-07-04 12:30 GMT

ఆయన పేరులో మోహనముంది. ఆయన రూపం జగన్మోహనం. అవును. ఇదంతా జగన్ అనబడే వైఎస్ జగన్ మోహనరెడ్డి గురించి చెబుతున్నదే. సాధారణంగా ఎవరైనా యాక్టర్ ని మీరు ఇది కాకపోతే ఏం అవుతారు అని అడిగితే డాక్టర్ అవుతాను అంటారు. మరి జగన్ సీఎం కాకపోయి ఉంటే, ఆయన రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమై ఉండేవారు. ఇది అందరికీ కలిగే ఇంటెరెస్టింగ్ డౌటే. ఇక జగన్ తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉన్నపుడు కూడా బిజినెస్ లోనే ఉండేవారు. దానికి ముందు జగన్ ఏమి కావాలనుకున్నారు. అంటే నిజంగా ఆసక్తే. ఆయన సినిమా హీరో కావాలనుకున్నారుట. అది ఆయన చెప్పింది కాదు, ఆయన సొంత మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అలా అయితే….?

అంటే ఇదంతా ఓ పాతికేళ్ల క్రితం నాటి ముచ్చట. జగన్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలని మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఆలోచన చేశారట. అన్నట్లు ఆయనతో పాటు మరో తమ్ముడు కలసి యోగి అని ఒక సినిమా తీశారు కూడా. అంటే సినిమా పిచ్చి అన్నది మేనమామకు ఉంది. మేనల్లుడు చూడచక్కగా ఉన్నాడు. అతన్ని హీరోగా చేస్తే పోలా అనుకున్నారట. దానికి స్క్రిప్ట్ వంటివి అన్నీ కూడా రెడీ చేశారట. మరి ఎక్కడ ఆగిందో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సరే ఇక జగన్ కూడా అందరిలాగానే సినిమాలు చూసేవారు. ఆయన బాలయ్య ఫేవరేట్ అంటారు. ఆ విషయం ఈ మధ్య బాలయ్య కూడా చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ తరువాత కధ అందరికీ తెల్సిందే. జగన్ బిజినెస్ లోకి దిగారు, ఆ తరువాత వైఎస్సార్ అనూహ్యంగా ఉమ్మడి ఏపీకి సీఎం కావ‌డంతో రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది అంటారు. 2009 ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగారు. అక్కడ నుంచి ఆయన రాజకీయ ప్రస్తానం తెరచిన పుస్తకమే.

రఫ్ గానే ….

నిజానికి జగన్ ని మొదటి నుంచి చూసిన వారంతా ఆయన సున్నితం అంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక జగన్ రఫ్ గానే ఉంటూ వస్తున్నారు. ఆయన అనుకున్నదే చేస్తారు, ఎదుటి వారిని పట్టించుకోరు అంటారు. తాను తలచిందే రైటూ అనే రకం. జగన్ దూకుడు ఆయనకు బలంగా ఉన్నా కొన్ని సార్లు రివర్స్ అవుతోంది కూడా. అయినా జగన్ వెరవడం లేదు, ఎక్కడా తగ్గడంలేదు. రాజకీయాలో ప్రత్యర్ధులను ఆయన అసలు స్పేర్ చేయడంలేదు. ఆయన్ని ఒకనాడు అలా సున్నితంగా చూసిన వారే ఇపుడు ఇదేంటి అని ఆశ్చర్యపోయేలా జగన్ తీరు ఉంటోందిట.

షాకిచ్చేలా….

జగన్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నంతవరకూ సున్నితత్వాన్ని కాపాడుకోగలిగారు అంటారు. వైఎస్సార్ దుర్మర‌ణం తరువాత రాజకీయం రెండవ కోణాన్ని, ఆ వికృత రూపాన్ని చూసిన ఆయన అలా మారిపోయారని అంటారు. ఒకర్ని అణగదొక్కాలంటే మరీ ఇంతలా దిగజారిపోవాలా అనేలా ప్రత్యర్ధులు జగన్ ని టార్గెట్ చేయడంతో ఆయన మొరటు రాజకీయమే చేయాల్సివచ్చిందని అంటారు. ఇక ముఖ్యమంత్రిగా కూడా జగన్ పాలన మోహనంగా ఉంటుందని అనుకుంటే ప్రజల వరకూ ఓకే కానీ ప్రత్యర్ధులకు మాత్రం ఆయన అరవీర భయంకరుడే అయిపోతున్నారు.

ఆధునిక తరానికి ప్రతినిధిగా….

చంద్రబాబు లాంటి వారు డైరెక్ట్ ఫైట్ కి రారు. ఎక్కడో గిల్లుతారు, మరి జగన్ లాంటి వారు దాన్ని లౌక్యంగా గ్రహించి విరుగుడు మందు వేస్తే సరిపోతుంది. కానీ అంతవరకూ వేగే ఓపిక లేనితనం వల్లనే జగన్ పొలిటికల్ గా అడ్డంగా దొరికిపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో తమిళనాడు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని కూడా మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతారు. జగన్ ఆధునిక రాజకీయ నాయకుడు. కానీ ముల్లుకు ముల్లు, కంటికి కన్ను అన్న తీరున ఆయన వ్యవహరిస్తున్న తీరు గత కాలం మొరటు రాజకీయాన్నే గుర్తు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే జగన్ పడ్డ బాధలకు, ఆయన్ని టీడీపీ వంటి పార్టీలు వేధించిన దానికి జగన్ రిటార్ట్ తీర్చుకోవడంలో తప్పులేదని వైసీపీలో అంటారు.

Tags:    

Similar News