జగన్ లో ఆశలు పెరుగుతున్నాయ్

జగన్ ఆశావాది. ఎంతటి ఆశావాది అంటే పదేళ్ళ పాటు కష్టపడైనా తాను అనుకున్నదాని కోసం ఎదురుచూడగల గుండె నిబ్బరం కలిగిన ఆశావాది. అదే ఆశని ఆయుధంగా చేసుకుని [more]

Update: 2020-05-06 14:30 GMT

జగన్ ఆశావాది. ఎంతటి ఆశావాది అంటే పదేళ్ళ పాటు కష్టపడైనా తాను అనుకున్నదాని కోసం ఎదురుచూడగల గుండె నిబ్బరం కలిగిన ఆశావాది. అదే ఆశని ఆయుధంగా చేసుకుని మొత్తానికి జగన్ ఏపీ సీఎం అయ్యారు. అలా ఇలా కాకుండా ప్రత్యర్ధుల మాడు పగిలేలా భారీ మెజారిటీ సాధించి మరీ కుర్చీ ఎక్కారు. ఆ తరువాత కూడా ఆయన తనదైన పాలన చేసుకుంటూ వస్తున్నారు. తన టార్గెట్ ల విషయంలో ఎవరు చెప్పినా జగన్ వినరు అన్నది నిజం. ఇక జగన్ చూపు ఇపుడు స్థానిక ఎన్నికల మీద ఉందని అంటారు. ఓ వైపు చూస్తే కరోనా మహమ్మారి బయట కాచుకుని ఉంది. ఈ సమయంలో ఎన్నికలు అంటే ఎలా అన్న సంశయం జగన్ సహా వైసీపీ పెద్దల్లో ఉంది. దానికి ఇపుడు రాజ మార్గమే దొరికినట్లైంది.

అలా ఉద్ధరించారా…

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏ సభలోనూ సభ్యుడు కాకుండా సీఎం పీఠం ఎక్కేశారు. ఆయన ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ కాకపోతే కుర్చీ ఖాలీ చేయాల్సిందే. దాంతో గడువు దగ్గరపడడంతో మొత్తానికి ప్రధాని మోడీ ద్వారా ఒత్తిడి తెచ్చి మరీ మహారాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిధ్ధం చేయించారు. ఆ ఎన్నికలతో పాటే రాజ్యసభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పావులు కదుపుతోందని తాజా సమాచారం. దేశంలో 58 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో 37 మంది ఏకగ్రీవం అయ్యారు. ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల‌ నగరా తొందరలో మోగనుంది.

స్థానికం కూడా….

ఇలా ఒక్కొక్కటిగా ఎన్నికలకు తెర లేస్తున్న వేళ ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను కూడా జరిపించాలని జగన్ ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే స్థానిక ఎన్నికల కధ సగంలో ఉంది. చాలా చోట్ల వైసీపీకే అనుకూలంగా ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. దాంతో మిగిలిన వాటిలో కూడా జెండా ఎగరేస్తే వైసీపీకి క్షేత్ర స్థాయిలో కూడా పట్టు దొరుకుతుందని, పార్టీకి తిరుగుండదని జగన్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఇపుడు దేశంలో ఎన్నికలకు ఈసీయే నేరుగా చొరవ చూపుతున్నందువల్ల ఏపీలో విపక్షాలు సైతం స్థానిక ఎన్నికల విషయంలో యాగీ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదని జగన్ సహా వైసీపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

జూన్ నెల ముహూర్తం…..

ఇక స్థానిక ఎన్నికలకు జూన్ నెల ముహూర్తంగా వైసీపీలో వినిపిస్తోంది. ఎందుకంటే జూలై తరువాత వానలు కురుస్తాయి. ఆ తరువాత పొలిటికల్ గా కూడా ఎలా ఉంటుందోనని అనుకున్న సమయానికి ఎన్నికలు జరిపించాలని అనుకుంటున్నారు. రేషన్ షాపుల్లో సరకులకు కూపన్లు ఇచ్చిన మాదిరిగా టైం స్లాట్ పెట్టి ప్రతీ పోలింగ్ బూత్ వద్ద నిర్ణీత సంఖ్యకు ఓటర్లు మించకుండా ఎన్నికలు జరిపించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా చేయడం వల్ల కరోనా మహమ్మారి నుంచి సేఫ్ గా ఉంటూనే సామాజిక దూరం పాటిస్తూ ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చూడవచ్చునని భావిస్తున్నారుట. మొత్తానికి చూసుకుంటే రాజ్యసభ ఎన్నికలకు కనుక ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ మరుక్షణం ఏపీలో లోకల్ బాడీస్ కి ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News