జగన్ కి అక్కడి సపోర్ట్ ?

పేరుకు జాతీయ పార్టీలు కానీ విధానాలు ఎక్కడా ఒకేలా ఉండవు, కేవలం రాజకీయాలు మాత్రమే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని చూసినపుడు ఇదే అర్ధమయ్యేది. విభజన కాలంలో ఆంధ్రా, [more]

Update: 2020-04-25 14:30 GMT

పేరుకు జాతీయ పార్టీలు కానీ విధానాలు ఎక్కడా ఒకేలా ఉండవు, కేవలం రాజకీయాలు మాత్రమే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని చూసినపుడు ఇదే అర్ధమయ్యేది. విభజన కాలంలో ఆంధ్రా, తెలంగాణాగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి కొట్టుకునేదాకా వెళ్ళారు. దీని మీద ఇతర పార్టీలు సైతం ఈస‌డించుకున్నాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఒక విధానం ఉండదా అని విమర్శలూ వచ్చేవి. ఇదిలా ఉంటే ఇపుడు కాంగ్రెస్ స్థానంలో బీజేపీ వచ్చింది. ఆ పార్టీకి తేడా పార్టీగా ఒకపుడు పేరు. ఇపుడు మాత్రం కాంగ్రెస్ ని మక్కీకి మక్కీ అనుసరిస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి.

జగన్ భేష్…..

ఈ మాటలు అన్నది బీజేపీ నేతలే. అయితే వారు ఏపీ వారు కాదు. తెలంగాణాకు చెందిన వారు. తెలంగాణాకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అయితే ఏపీలో జగన్ కరోనా కట్టడిలో బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. అంతే కాదు కేసీఆర్ కన్నా బాగా చేస్తున్నారని అనేశారు. జగన్ ముందు చూపుతో ఏపీలో కొంత సడలింపు ఇస్తూ లాక్ డౌన్ వేళ బతుకు బండి కూడా సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని కూడా అంటున్నారు. తెలంగాణాలో అయితే లాక్ డౌన్ని పొడిగిస్తూ జన జీవితాన్ని ఇబ్బందులో నెడుతున్నారని కూడా అంటున్నారు. ప్రజలకు జీవితం కూడా ముఖ్యమన్న సంగతి కేసీయార్ గుర్తెరగాలని హితవు చెప్పారు. ఇక జగన్ సర్కార్ విధానాల మీద గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాగానే ఉన్నాయని చెప్పడం విదితమే.

వీరు ఇలా…..

ఇక ఏపీకి చెందిన బీజేపీ నేతలకు కేసీఆర్ దేవుడులా కనిపిస్తున్నారు. కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించి కరోనా కట్టడికి ప్రయత్నిస్తే జగన్ మాత్రం సడలింపులు ఇచ్చారని విమర్శిస్తున్నారు. జగన్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కూడా అంటున్నారు. కరోనా విషయంలో పరీక్షలు కూడా తెలంగాణాలో బాగా జరుగుతున్నాయని కన్నా లాంటి వారు అంటున్నారు. మరి ఒకే పార్టీ, రెండు అభిప్రాయాలు ఎలా సాధ్యమంటే వారు జాతీయ భావాలు పక్కన పెట్టేసి ప్రాంతీయ పార్టీల నేతల్లా మారారనుకోవాలి. మరో వైపు రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని అనుకోవాలి.

మోడీ అండ …..

ఇక ఇంకోవైపు కేంద్రంలోకి మోడీ సర్కార్ కూడా జగన్ తో ఎప్పటికపుడు టచ్ లో ఉంటోంది. కరోనా సవాల్ ని ఎదుర్కొనేందుకు తాము అండగా ఉంటామని ఏకంగా ప్రధాని మోడీ జగన్ కి హామీ ఇస్తున్నారు. జగన్ సౌత్ కొరియా నుంచి తెప్పించిన రాపిడ్ కిట్లను కూడా కేంద్రం ప్రశంసిస్తోంది. ఏపీలో సగటున పరీక్షలు దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రధాని సైతం కరోనా విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే నేరుగా సంప్రదించాలని జగన్ కి ఫోన్ చేసి మరీ చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీలో ఏపీ నాయకులు ఒకలా ఉంటే కేంద్రం, తెలంగాణా మాత్రం జగన్ కి సపోర్ట్ గానే ఉంటున్నారు. మరి ఇది ఫక్త్ రాజకీయం అనుకోవాలా. లేక ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నదే నిజమని నమ్మాలా. ఏమో కమలం తేడా పార్టీయే సుమీ.

Tags:    

Similar News