పట్టించుకునే వారేరీ? పలికే వారేరీ?

కేటీఆర్. ఇపుడు మళ్ళీ తెలంగాణాలో మారుమోగుతున్న పేరు. కేసీయార్ సీఎంగా ఉన్నా కూడా మంత్రి, భావి వారసుడు కేటీఆర్ హడావుడి పార్టీలో ప్రభుత్వంలో ఎక్కువగా ఉంది. కేసీఆర్ [more]

Update: 2020-04-25 13:30 GMT

కేటీఆర్. ఇపుడు మళ్ళీ తెలంగాణాలో మారుమోగుతున్న పేరు. కేసీయార్ సీఎంగా ఉన్నా కూడా మంత్రి, భావి వారసుడు కేటీఆర్ హడావుడి పార్టీలో ప్రభుత్వంలో ఎక్కువగా ఉంది. కేసీఆర్ విధానపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నా అమలు తీరుని ఎప్పటికపుడు సమీక్షిస్తూ కేటీఆర్ దూకుడుగా ఉంటున్నారు. ఆయన కరోనా విపత్తు వేళ యావత్తు తెలంగాణా సమాజానికి ఆపద్భాంధావుడుగా అవతారం ఎత్తారు. జనాల్లోకి దూకుడుగా రావడమే కాదు, ట్విట్టర్ వేదికగా ఎప్పటికపుడు స్పందిస్తున్నారు. ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు.

మంచి మార్కులే….

కేటీఆర్ నిజంగా టీఆర్ఎస్ సర్కార్ కి కొండంత అండగా ఉంటున్నారు. ఆయన అటు మాస్ లో ఇటు క్లాస్ లో కూడా కనిపిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మేధావులతో అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు చెబితే తక్షణ సాయం అందిస్తూ భారీ ఉపశమనం కలిగిస్తున్నారు. అదే సమయంలో నగరంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఇళ్ల నుంచి రావద్దంటూ వారిలో చైతన్యం తెస్తున్నారు. సమస్యలు ఉంటే నేరుగానే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం నిరంతరం తమ కోసం పనిచేస్తుందన్న నిబ్బరాన్ని యావత్తూ తెలంగాణా సమాజానికి కలిగిస్తున్నారు. అలా మంచి మార్కులే సంపాదిస్తున్నారు.

ఏపీలో భిన్నం…..

ఇక ఏపీలో తీసుకుంటే జగన్ జనంలోకి పోరు. కనీసం మీడియాలోనైనా కనిపించరు. ఆయన పార్టీ నాయకులు సైతం పెద్దగా రావడంలేదు. మరో వైపు ప్రచారం తాము కోరుకోవడం లేదని వైసీపీ సర్కార్ పెద్దలు చెబుతున్నా జనాలకు భరోసా ఇవ్వడానికైనా మీడియాను వాడుకోవాల్సి ఉంది. కానీ అలా జరగడంలేదు. ఇక లాక్ డౌన్ వల్ల ఏపీలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. జగన్ అధికారులతో సమీక్షలు నిర్వహించడం వరకూ బాగానే ఉన్నా కరోనా కట్టడికి నియమించిన మంత్రుల బృదందం సైతం మీడియా ముఖంగా చాలా తక్కువగా స్పందిస్తోందని అంటున్నారు.

పలికే వారుంటే ….?

ప్రభుత్వం అంటే ఒక పెద్ద వ్యవస్థ. బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి అన్న ప్రశ్న సామాన్యుడికి వెంటనే ఉత్పన్నం అవుతుంది. అందువల్ల కనీసం మీడియాలో ఎప్పటికపుడు టచ్ లో ఉండేలా మంత్రులకు బాధ్యతలు కేటాయించడం, పార్టీ నేతలు ట్విట్టర్ ద్వారా మేధావులను, విద్యావంతులను కదిలించే ప్రయంత్నం చేయడం ద్వారా వైసీపీ సర్కార్ తానున్నానన్న భరోసా కల్పిస్తే బాగుండేది. ఇక జగన్ మంత్రులు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా జనంలో మాత్రం ఏమీ చేయడంలేదన్న భావన రావడానికి ప్రచార లోపమే కారణం అంటున్నారు. ఏపీకి కూడా ఇపుడు అర్జంట్ గా ఓ కేటీయార్ కావాలి. అది జగన్ కుటుంబం నుంచి వచ్చినా ఫరవాలేదు అంటున్నారు. మరి ఆ దిశగా ఇకనైనా వైసీపీ సర్కార్ ఆలోచనలు చేస్తుందా. చూడాలి.

Tags:    

Similar News