టైమింగ్ కరెక్ట్ గా లేదేమో? జగన్ మాత్రం మర్చిపోయేట్లు లేరే?

కరోనా లేదు… గిరోనా లేదు.. అవన్నీ జాన్తా నై… ముందు వారి సంగతి తేల్చాల్సిందే. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా [more]

Update: 2020-03-24 12:30 GMT

కరోనా లేదు… గిరోనా లేదు.. అవన్నీ జాన్తా నై… ముందు వారి సంగతి తేల్చాల్సిందే. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో వణికిపోతుంటే, ప్రత్యర్థి పార్టీని ఇంకా వణికించాలన్నది జగన్ ఆలోచనగా కన్పిస్తుంది. అందుకే ఈ కీలక సమయంలోనూ జగన్ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు ఆదేశించింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచే అమరావతి భూముల విషయంలో సీరియస్ గా ఉన్నారు.

ప్రకటనకు ముందే…?

ప్రజలను తప్పుదోవ పట్టించి కేవలం ఒక సామాజికవర్గం, చంద్రబాబు సన్నిహితులు లాభపడేందుకే రాజధానిగా అమరావతిని డిసైడ్ చేశారని జగన్ తొలి నుంచి ఆరోపిస్తున్నారు. బినామీ పేర్లతో వేలాది ఎకరాలను తన సన్నిహితులకు కట్టబెట్టిన చంద్రబాబు ఆర్థికంగా బలోపేతమవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. రాజధాని ప్రకటన రాక ముందే విజయవాడకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో భూముల కొనుగోళ్లు ఎలా జరిగాయన్నది అందరికీ కలిగే సందేహమే.

టీడీపీ నేతలే లక్ష్యంగా…..

టీడీపీ నేతలతో పాటు అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారు రాజధాని భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత వంటి వారు ఈ భూముల దందాలో ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధాని భూముల కొనుగోళ్లపై ఏర్పాటయిన మంత్రి వర్గ ఉపసంఘం కూడా నాలుగువేల ఎకరాలు టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితులు కొనుగోలు చేసినట్లు అసెంబ్లీలోనే ప్రకటించింది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఐడీ కూడా విచారణ చేపట్టింది.

సీబీఐకి అప్పగిస్తూ…..

కానీ రాజధాని భూముల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అదే సీబీఐతో విచారణ జరిపించి చంద్రబాబు భూబాగోతాన్ని వెలికితీయాలని జగన్ భావించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా కరోనా విజృంభిస్తున్న టైమ్ లోనూ జగన్ దానిని మర్చిపోకుండా సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది సరైన సమయం కాదన్న వాదన కూడా విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News