లాజిక్ లేకుండా పోయింది… గబ్బు మాత్రం మిగిలింది

జగన్ ని సరైన సమయంలో కేంద్రం ఆదుకుంది. నిన్న పోలవరం మొత్తం అంచనాలకు ఆమోదం తెలిపి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకరించిన [more]

Update: 2020-03-22 14:30 GMT

జగన్ ని సరైన సమయంలో కేంద్రం ఆదుకుంది. నిన్న పోలవరం మొత్తం అంచనాలకు ఆమోదం తెలిపి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకరించిన కేంద్రం ఇపుడు అనుకోని వరం ఇచ్చింది. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. కానీ నిధులు మాత్రం మొదటి విడతగా పెద్ద ఎత్తున విడుదల చేసింది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 14వ ఆర్ధిక సంఘం నిధులుగా విడుదల చేయడం నిజంగా గొప్ప విషయమే. ఈ విధంగా మొదటి విడతలో ఏపీకి రూ.1,301వేల కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయడం అంటే ఏపీ నెత్తిన పాలు పోసినట్లే.

వాటి కోసమే రచ్చ…..

నిజానికి జగన్ సర్కార్ ఆది నుంచి స్థానిక ఎన్నికల నిర్వహణ అనివార్యం అని చెబుతోంది. సకాలంలో ఈ ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోతాయని కూడా వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేసేవారు. హఠాత్తుగా ఎన్నికలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిలుపుదల చేయడంతో జగన్ మండిపడింది కూడా ఇందుకే. అయితే కేంద్రం మాత్రం ఎన్నికలు జరగకపోయినా ఏపీలోని లోకల్ బాడీలకు నిధులను విడుదల చేయడంతో ఏపీ సర్కార్ లో కొత్త ఆనందం కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాన్ని అర్ధం చేసుకుంటూ కరోనా కట్టడికి లోకల్ బాడీల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నిధులు విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. దానికి ప్రకారం. రాష్ట్రంలోకి పంచాయితీ, మండల, జిల్లా పరిషత్ లకు రూ.870.23వేల కోట్లు దక్కగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మరో రూ.431 కోట్లు ఇచ్చారు.

విపక్షానికి అస్త్రం….

ఇక మరో వైపు చూసుకుంటే జగన్ 14వ‌ ఆర్ధిక సంఘం నిధులు ఆగిపోతే ఆ తప్పు విపక్షానిదేనని నిందించారు. అలాగే నిమ్మగడ్డ మీద కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక అనుభవం నిండా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నిధులు ఎక్కడికీ పోవు, కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారి ఆ కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయడం జరిగింది కాబట్టి ఏదో విధంగా తెచ్చుకోవచ్చునని వాదించారు. ఇక కేంద్రం కూడా ఇవ్వాలనుకుంటే ఇస్తుందని కూడా చెప్పారు. నిమ్మగడ్డ సైతం ఏపీ సీఎస్ కి రాసిన లేఖలో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తం విపక్షం నిధుల గురించి అభయం ఇచ్చేలా మాట్లాడాయి. ఇపుడు ఇంత రచ్చ తరువాత కేంద్రం వారం వ్యవధిలో స్థానిక నిధులు విడుదల చేయడంతో విపక్షానికి కొత్త ఆయుధం వచ్చినట్లైంది.

రాజకీయమేనా…?

ఇప్పటిదాకా స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో జగన్ వాదన‌లో అయిదు వేల కోట్లు మురిగిపోతాయన్న అంశంతో జనాలు కూడా ఏకీభవించారు. ఇపుడు కేంద్రమే స్వయంగా నిధులను ఆపేయకుండా విడుదల చేయడంతో జగన్ వాదనలో మిగిలినదంతా రాజకీయ రచ్చగానే చూసే వీలు ఏర్పడింది. కేవలం పదవుల కోసం, పార్టీ కోసమే సీఎం హోదాను సైతం పక్కన పెట్టి జగన్ ఇంతలా ఎస్ఈసీని తూలనాడారని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయి దారుణమైన భాష వాడారన్న సందేశం జనంలోకి వెళ్ళిపోయింది. దీన్ని మరింతగా ప్రచారం చేసేందుకు చంద్రబాబు కూడా ఇక ఇపుడు తయారుగా ఉంటారు. దాంతో రానున్న రోజులో లోకల్ బాడీ ఎన్నికల వాయిదా విషయంలో వైసీపీ చేసిన రచ్చకు ఎలాంటి లాజిక్ లేకుండా పోతుంది, గబ్బు మాత్రం మిగులుతుంది.

Tags:    

Similar News