జగన్ షాడో ఆయనేనట.. అందుకే ఆయన టార్గెట్ ?

జగన్ పార్టీలో నంబర్ టూలు ఉన్నాయో లేవో కానీ అందరూ చెప్పుకునేది మాత్రం విజయసాయిరెడ్డి పేరునే. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడని అంటారు. జగన్ ఏ [more]

Update: 2020-03-02 09:30 GMT

జగన్ పార్టీలో నంబర్ టూలు ఉన్నాయో లేవో కానీ అందరూ చెప్పుకునేది మాత్రం విజయసాయిరెడ్డి పేరునే. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడని అంటారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన్ని కనీసంగానైనా సంప్రదిస్తారని చెబుతారు. అయితే జగన్ తన నీడను కూడా నమ్మరని, ఆయనకూ మిగిలిన నేతలూ మధ్య దూరం చాలా ఉంటుందని, ఒక పరిధి దాటి ఎవరూ ముందుకు పోలేరని కూడా మరో మాట పార్టీ నేతల్లో ఉంది. ఎవరు ఏమనుకున్నా కొన్ని అంశాల్లో జగన్ నీడలా కొందరు నేతలు ఉంటున్నారని, వారె ఆయన‌కు కళ్ళూ ముక్కూ చెవులని ప్రచారం ఉంది. చిత్రంగా విపక్షాలు దీన్ని గట్టిగా విమర్శిస్తున్నాయి.

డమ్మీ మంత్రులట……

జగన్ క్యాబినేట్లో మంత్రులు పాతిక మంది వరకూ ఉన్నారు. వారిలో పనిమంతులు అరడజన్ మంది కూడా ఉండరని విమర్శలు కూడా ఉన్నాయి. మరో నలుగురైదుగురిని వదిలేసినా సగానికి సగం మంది మాత్రం డమ్మీలేనని పెద్ద ఎత్తున టీడీపీ ఓ వైపు ప్రచారం చేస్తోంది. జగన్ ఏరి కోరి కీలక శాఖలను పలు సామాజికవ‌ర్గాలకు చెందిన వారికి ఇచ్చారు. అయితే వీరంతా నిమిత్తమాత్రులని, అసలు తెర వెనక చక్రం తిప్పేది వేరేవారు అని కూడా అంటున్నారు. అక్కడ ఆదేశాలతోనే ఈ మంత్రిత్వ శాఖల్లో పనులు, నిర్ణయాలు చకచకా జరుగుతాయని అంటున్నారు.

కీలక శాఖల్లో….

ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న ఓ కీలక శాఖలో మహిళా మంత్రి ఉన్నారు. అయితే ఆమెను పక్కన పెట్టి మొత్తం కధను జగన్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తున్నారని ఈ మధ్యనే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇపుడు ఏకంగా జలవనరుల శాఖతో పాటు, మరిన్ని శాఖల మంత్రుల మీద పెత్తనం చేస్తున్నారని అదే నేత అంటున్నారు. ఇక ఆయన చెప్పడం అధికారులు చేయడంగానే ఆయా శాఖల‌ తీరు ఉందని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

టార్గెట్…..?

ఇదే కాదు, పార్టీలో కూడా సజ్జల ప్రాధాన్యత బాగా పెరిగిపోయిందని అంటున్నారు. ఆయన సోషల్ మీడియా వింగ్ కి నేతృత్వం వహిస్తున్నారట. దాని ద్వారా టీడీపీ మీద ఎప్పటికపుడు ప్రతి విమర్శలు చేయిస్తున్నారుట. దీంతో టీడీపీ టార్గెట్ గా సజ్జల ఉంటున్నారని తెలుస్తోంది. తెర వెనక ఉంటూ బాణాలు వెస్తున్న సజ్జలను బలహీనపరిస్తే సగం విజయం సాధించినట్లేనని టీడీపీ భావిస్తోంది. టీడీపీ సోషల్ మీడియా విభాగం కారకర్తలకు కూడా సజ్జల గురించి పరిచయం చేయడమే కాదు, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో చెబుతూ ప్రతివ్యూహాలు రూపొందించుకోవాలని టీడీపీ పెద్దలు చెబుతున్నారుట. మొత్తానికి జగన్ కి కుడి భుజంగా విజయసాయి అనుకుంటే షాడోగా సజ్జల ఉన్నారని అంటున్నారు. మరి అందుకే ఇపుడు పచ్చ పార్టీ నేతలకు సజ్జల టార్గెట్ అవుతున్నారని, ఆయన మీదనే ఇపుడు కొత్తగ బురదజల్లుడు కార్యక్రమం మొదలైందని భోగట్టా.

Tags:    

Similar News