బాబు రికార్డ్ బద్దలు కొడతారా ?

చంద్రబాబు ఏ విషయంలోనైనా తనది ఒక రికార్డు అని చెప్పుకుంటారు. ఆయన ప్రతీ దాన్ని సానుకూలం చేసుకోవడానికి చూస్తారు. నాలుగేళ్ళ పాటు కేంద్రంతో పొత్తు పెట్టుకుని రెండు [more]

Update: 2020-02-19 14:30 GMT

చంద్రబాబు ఏ విషయంలోనైనా తనది ఒక రికార్డు అని చెప్పుకుంటారు. ఆయన ప్రతీ దాన్ని సానుకూలం చేసుకోవడానికి చూస్తారు. నాలుగేళ్ళ పాటు కేంద్రంతో పొత్తు పెట్టుకుని రెండు వైపుల నుంచి అధికారం అనుభవించిన చంద్రబాబు బీజేపీకి తలాక్ చెప్పేశాక ఒక రేంజిలో విరుచుకుపడేవారు. ఆ సమయంలో ఆయన అన్న మాటలు చూస్తే తాను 29 సార్లు ఢిల్లీ వెళ్ళానని, ప్రధానిని కలసి ఏపీకి సాయం చేయమని గట్టిగా కోరానని, అయినా వారు పట్టించుకోలేదని చెప్పుకున్నారు. అప్పట్లో తమ్ముళ్ళూ కూడా ఇదే గొప్పగా చెప్పేవారు. తమ నేత రాష్ట్ర ప్రయోజనాల కోసం 29 సార్లు ఢిల్లీ గడప తొక్కారని కూడా ప్రకటనలు ఇచ్చేవారు. ఇపుడు జగన్ వంతు వచ్చింది.

ఇప్పటికే ఇలా….

ఆయన అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఎనిమిది సార్లు ఢిల్లీ గడప తొక్కారు. అంటే సగటున నెలకు ఒకసారి అన్న మాట. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారీ ప్రధాని మోడీని దర్శించుకుని వస్తున్నారు. వీలును బట్టి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. జగన్ ఈ విధంగా చేస్తున్న ఢిల్లీ దండయాత్రలు చూసుకుంటే ఆయన‌ మొత్తం పదవీ కాలం అరవై నెలల్లో అరవై సార్లు ఢిల్లీ టూర్లు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. సరే ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు. ఏపీకి ఏమి తెస్తున్నారు అని ఇపుడు విపక్షంలో ఉన్న టీడీపీ గట్టిగా నిలదీస్తోంది.

వినతులేనా….?

జగన్ ఢిల్లీ వెళ్తున్నారు, ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. వారి చేతుల్లో వినతిపత్రాలు పెడుతున్నారు. అందులోని అంశాలు మీడియాకు ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు. అంతే అక్కడితో జగన్ ఢిల్లీ టూర్ ముచ్చట ముగిసిపోతోంది. మరి దాని మీద మీడియా బ్రీఫింగ్ మాత్రం ఎవరూ ఇవ్వడంలేదు. దాంతో జగన్ ఢిల్లీ టూర్ వల్ల ఏపీకి ఏం ఒరిగిందన్నది ఎవరికీ అర్ధం కానిపరిస్థితి ఉంది. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఢిల్లీ పర్యటన చేసినపుడు వెంటనే ఆయన మీడియా మీటింగ్ పెట్టి తాను ఏమి అడిగాను, కేంద్రం ఎలా స్పందించింది చెబితే అటు రాజకీయ పార్టీలకే కాదు, ఇటు ఏపీ ప్రజలకూ కూడా ఓ స్పష్టత వస్తుంది.

మౌనమేనా…?

జగన్ అలా చేయకపోవడం వల్ల ఆయన ఉత్త చేతులతోనే వెనక్కు వస్తున్నారన్న భావన కలుగుతోంది. ఓ విధంగా ఇది రాజకీయంగా కూడా వైసీపీకి ఇబ్బంది కలిగించే పరిణామంగా చెబుతున్నారు. ఏపీ ప్రజలు కూడా ముఖ్యమంత్రి పర్యటన మీద ఆసక్తిగా ఉంటారు. ఏపీ ఇపుడు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉందని అందరికీ తెలుసు. దాంతో కేంద్ర సాయం ఒక్క పైసా అయినా తీసుకువస్తే సంతోషించేది జనమే. వారే రేపు జగన్ రాజకీయ సమర్ధతను గుర్తించి ఓట్లు వేసేది. అటువంటి జనాలకు కూడా మీడియా ద్వారా చెప్పుకోకుండా కేవలం సీఎంఓ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం మంచిది కాదని వైసీపీఎలోనే మాట వినిపిస్తోంది.

చేటుగా మారేనా….?

జగన్ ఇలా చేయడం వల్లనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జగన్ ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారని అడుగుతున్నారు. సీపీఐ రామకృష్ణ లాంటి వారు అయితే ఒక అడుగు ముందుకేసి జగన్ ఢిల్లీ టూర్ మొత్తం వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు జగన్ తన కేసుల గురించి మాట్లాడుకోవడానికే తరచూ ఢిల్లీ వెళ్తున్నారని కూడా తమ్ముళ్ళు నిందలు వేస్తున్నారు. మరి ఇదంతా అవసరమా. మీడియాతో జగన్ మాట్లాడితే పోయేదేముంది. రాజకీయంగా కూడా అది ప్లస్ అవుతుంది. మరి దాన్ని జగన్ ఎపుడు గుర్తిస్తారో అంటున్నారు.

Tags:    

Similar News