కొత్త ట్రెండ్ తో ముందుకు?

జగన్ ఏడాది పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు? సంతృప్తి స్థాయి ఎలా ఉంది? ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారా? [more]

Update: 2020-02-17 02:00 GMT

జగన్ ఏడాది పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు? సంతృప్తి స్థాయి ఎలా ఉంది? ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారా? ఈ విషయాలన్నీ తేల్చేది స్థానిక సంస్థల ఎన్నికలే. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి నాలుగేళ్ల జగన్ పాలన ఉంటుందన్నది వాస్తవం. ఇప్పటి వరకూ తాను అనుకున్నదే జగన్ చేశారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరుస్తున్నారు. విపక్షాలు, ప్రజాసంఘాల సూచలను పట్టించుకోవడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

అయితే స్థానిక సంస్థలు ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు అత్యంత అవసరం. జగన్ అధికారం చేపట్టి ఏడాది గడవక ముందే ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఫలితాలు ఖచ్చితంగా పాలనపై ప్రభావం చూపుతాయి. పాలన తీరు ఎలా ఉందన్నది ఫలితాలను బట్టి అర్థమవుతుంది. అందుకే జగన్ మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు జిల్లా నేతలను అప్రమత్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నేతల మధ్య విభేదాలు……

అధికారంలోకి రావడంతో జిల్లా స్థాయిలో విభేదాలు తీవ్రమయ్యాయి. అనేక ప్రాంతాల్లో నేతల మధ్య పొసగడం లేదు. పదవులు దక్కలేదని కొందరు, ప్రాధాన్యత లేదని మరికొందరు అలకపాన్పు ఎక్కారు. వీరందరినీ సముదాయించే సమయం, తీరిక జగన్ కు లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను బట్టే భవిష్యత్తులో ప్రాధాన్యముంటుందని దాదాపుగా ఎమ్మెల్యేలందరికీ జగన్ పరోక్షంగా సంకేతాలు పంపారు.

సర్వే ద్వారా అభ్యర్థులు…..

ఇక తాజాగా అభ్యర్థుల ఎంపిక కూడా జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎవరు పోటీ చేయాలన్న దానిపై జగన్ ఇప్పటికే పదమూడు జిల్లాల్లో సర్వే చేయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం ఉండదని కూడా చెప్పారు. అయితే వారి గెలుపుకు శ్రమించాల్సి ఉంటుందని, గెలిపించుకుని వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కుతుందని జగన్ స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ అనుచరులకు, సన్నిహితులకు ఇచ్చిన మాటేంటని మదనపడుతున్నారు. మొత్తం మీద గోల్ కొట్టాలంటే కేంద్ర పార్టీ నుంచే స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక జరుగుతుండటం విశేషం.

Tags:    

Similar News