అమరావతిలో సాధ్యం కాదు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మకమైనదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మూడు రాజధానుల బిల్లుపై జగన్ ప్రసంగించారు. వెలగపూడి తాత్కాలిక రాజధాని మాత్రమేనని అన్నారు. ఇప్పుడు [more]

Update: 2020-01-20 16:55 GMT

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మకమైనదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మూడు రాజధానుల బిల్లుపై జగన్ ప్రసంగించారు. వెలగపూడి తాత్కాలిక రాజధాని మాత్రమేనని అన్నారు. ఇప్పుడు తాము చేసే ప్రయత్నం దిద్దుబాటు అని జగన్ తెలిపారు. రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. దీర్ఘకాలంగా అనేక తప్పిదాల వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. చరిత్ర చెప్పిన పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. మద్రాస్ ను తర్వాత కర్నూలును, ఆ తర్వాత హైదరాబాద్ ను పోగొట్టుకున్నామని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ పై చంద్రబాబు అబద్ధాలు గంటన్నర చెప్పారన్నారు. సూపర్ క్యాపిటల్ వద్దని, పరిపాలన కార్యాలయాలు అన్ని జిల్లాలకు విస్తరించాలని కమిటీ చెప్పిందన్నారు. ప్రభుత్వ భూములు రాయలసీమలో ఉన్నాయా? అని అడిగితే ప్రభుత్వం స్పందించలేదన్నారు. శివరామకృష్ణన్ ఏం చెప్పారో వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. శివరామకృష్ణన్ రిపోర్ట్ ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చేసిన తప్పువల్లనే పదేళ్లు రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ ను కోల్పోయామన్నారు.

బినామీల పేరిట…

చంద్రబాబు బినామీల పేరిట వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. గుంటూరు, విజయవాడకు అమరావతి ఎంత దూరంలో ఉందో తెలుసా? అని ప్రశ్నించారు. రెండు ప్రాంతాల నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో రాజధానిని ఏర్పాటు చేశారన్నారు. లీకులు ఇచ్చిన నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో టీడీపీ నేతలు ఎందుకు భూములు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. దూరంగా, మూలగా విసిరేసినట్లుండే ప్రాంతంలో టీడీపీ నేతలు భూముుల కొనుగోలు చేశారన్నారు. రాజధాని అమరావతిని నిర్మించడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారన్నారు. అంత ఖర్చు పెట్టి రాజధానిని నిర్మిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని జగన్ ప్రశ్నించారు. అభివృద్ధి ఒకే చోట జరిగితే నష్టమని జగన్ అభిప్రాయపడ్డారు. రాజధానిలో కనీస సౌకర్యాలను కూడా చంద్రబాబు ఏర్పాటు చేయలేకపోయారన్నారు. మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం ఎకరానికి 2 కోట్ల చొప్పున లక్ష కోట్ల అంచనాలు వేశారని,8 కిలో మీటర్ల విస్తీర్ణంలో 53వేల ఎకరాలలో మౌలిక సదుపాయాల కోసమే లక్ష కోట్లు అవసరం అని చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని జగన్ చెప్పారు. 14వేల కోట్లతో కొత్త సచివాలయం కోసం టెండర్లను కూడా చంద్రబాబు పిలిచారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్ని కుప్పిగంతులు వేశారో అందరూ చూశారని జగన్ ఎద్దేవా చేశారు.

సంక్షేమ కార్యక్రమాలను…..

ఇరవై ఏళ్లలో అమరావతిని కట్టాలన్నా మూడు లక్షల కోట్లు అవుతుందన్నారు. ఏడాదికి 1200 కోట్లు చొప్పున ఖర్చు పెడితే చంద్రబాబు గ్రాఫిక్ రాజధాని నిర్మాణానికి 100ఏళ్ళు పడుతుందని తెలిపారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఐదు రెట్ల వేగంతో పని చేస్తే 20ఏళ్ళలో పూర్తి అవుతుందని జగన్ తెలిపారు. ఆయనతో పాటు ఎల్లోమీడియా సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాదనను తెరపైకి తెచ్చిందన్నారు. 36 వేల కోట్లు ఖర్చుపెట్టి సోలార్ విద్యుత్తును ప్రభుత్వం ఉత్పత్తి చేయగలిగితే రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించవచ్చని, ప్రభుత్వంపై ఏడాదికి ఎనిమిదివేల కోట్ల భారం తప్పుతుందని జగన్ పేర్కొన్నారు. విద్య వైద్యం కోసం, గోదావరి – పెన్నా అనుసంధానికి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. అంతా అమరావతిలో ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కలలు గన్న అమరావతి నిర్మాణం సాధ్యం కాదు అని జగన్ తేల్చి పారేశారు. మా మేనత్త ను ఈ జిల్లాలోనే ఇచ్చి వివాహం చేశామని, విజయవాడలో రాజ్ ,యువరాజ్ థియేటర్ల నిర్మాణంతో తమకు ముప్ఫయి ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తనకు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే ఉన్నా ముఖ్యమంత్రిగా అది సాధ్యపడదన్నారు. అమరావతి ఏదో ఒక రోజుకు మహానగరంగా అభివృద్ది చెందుతుందన్నారు. తనకు ఈ ప్రాంతంపై ఎటువంటి కోపం లేదని జగన్ చెప్పారు.

Tags:    

Similar News