ఇప్పుడైనా నోరు విప్పితే?

వైసీపీ అధినేతగానే జగన్ నయం అనుకుంటున్నారు సొంత పార్టీ వారు కూడా. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ నేతలకు కూడా దూరం పాటిస్తున్నారు. ఆ సంగతి అలా [more]

Update: 2020-01-15 08:00 GMT

వైసీపీ అధినేతగానే జగన్ నయం అనుకుంటున్నారు సొంత పార్టీ వారు కూడా. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ నేతలకు కూడా దూరం పాటిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన మీడియాను కూడా బాగా దూరం పెడుతున్నారు. మీడియాను జగన్ పలుకరించి అచ్చంగా ఎనిమిది నెలలు అవుతోంది. ఆయన చివరి సారిగా మీడియా ముందుకు వచ్చింది ఏపీలో మే 23న అయితే, ఆ తరువాత మే 24న ఢిల్లీలో. అది లగాయితూ జగన్ మీడియాని ఫేస్ చేసిన సందర్భమే లేదు. జగన్ తీరు పట్ల విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోవడంలేదు. ఇక్కడ అధికారులు కూడా రెండు పోలికలను తెస్తున్నారుట. చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రతీ దానికీ ఎక్కువ చేసేవారని, రోజులో పలుమార్లు మీడియాతో పాటు ఎక్కడో ఒక చోట అలా మాట్లాడుతూనే ఉండేవారని, జగన్ మాత్రం సీఎంగా మౌన మునిగా ఉంటున్నారని. నిజానికి ఈ రెండూ కూడా అతి చేష్టలేనని మేధావులు అంటున్నారు.

చెప్పాల్సింది లేదా?

జగన్ నోటి వెంట మాటలు వినాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆయన తాము ఓటేసి గెలిపించిన నాయకుడు, నాధుడు. జగన్ మాట్లాడితేనే దేనికైనా క్లారిటీ దొరుకుతుందని రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్ గత నెల 17న అసెంబ్లీలో నాలుగు ముక్కలు మాట్లాడారు. మూడు రాజధానులు అంటూ చిచ్చు రేపారు. ఆ తరువాత జగన్ ఎక్కడా దాని మీద పల్లెత్తు మాట అనలేదు. నిజానికి నాటి నుంచి ఏపీలో రచ్చ ఒక్క లెక్కన సాగుతోంది. జగన్ ఈ విషయంలో తాను ఏమనుకుంటున్నదీ గట్టిగా మీడియా ముఖంగానైనా జనాలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. తాను నమ్మిన మూడు రాజధానుల గురించి ఆయన డిఫెండ్ చేసుకోవడానికైనా మాట్లాడితే జనాలకు అసలు విషయం అర్ధమవుతుందని అంటున్నారు.

తటస్థులు ఉన్నారుగా….

జగన్ తాను చెప్పేదేదో మంత్రులు చెబుతారని వదిలేస్తున్నారు. కానీ జగన్ చెప్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. భరోసా కూడా వస్తుంది. అమరావతి తరలిస్తున్నంతగా ప్రతిపక్షం బిల్డప్ ఇస్తోంది. దాని మీద రైతులు కానీ ప్రజలు కానీ ఆందోళన పడుతున్నారు. ఇదే విషయమై జగన్ అమరావతి రాజధాని ఉంటుంది. అక్కడ కూడా అభివ్రుధ్ధి చేస్తాము, తాను ఉన్నాను, అన్నీ వింటున్నాను. చూస్తున్నాను అనేలా కచ్చితమైన హామీ ఇస్తే ఇంత పెద్ద ఎత్తున మహిళలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయరు కదా. అదే సమయంలో విపక్షాల మాటలకు ప్రభావితం కూడా కారు కదా. కానీ జగన్ మాత్రం మీడియాకు దూరం అంటున్నారు. కనీసం పత్రికా ప్రకటనకు కూడా ఆయన నుంచి నోచుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి.

దూరమైపోతారు…

ఇలాగే మౌనంగా ఉంటే జగన్ కి తొలి ఏడాది బాగానే ఉన్నా తరువాత రోజుల్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మీడియాలో కొంత సెక్షన్ అతి చేస్తోంది. ఒక పార్టీకి అనుకూలంగా ఉంది, కానీ మొత్తం మీడియా అలా లేదు. ఇపుడు జగన్ మీడియాను మొత్తానికే దూరం పెడితే వారంతా కూడా నెగిటివ్ అవుతున్నారన్న భావన వస్తోంది. మంత్రులు కూడా భయం భయంగా మాట్లాడుతుంటారు, వారు అధినేత మాటలను ఎప్పటికీ పూర్తిగా అనువదించలేరు. పైగా సరైన సమాచారం జనాలకు చేరకపోవచ్చు కూడా. మరి జగన్ మీడియాను పక్కన పెడితే ఆయనకు అవసరమైన సందర్భాల్లో వారు కూడా దూరం జరుగుతారు. అపుడు ఇంత కంటే ఎక్కువగా ఇబ్బంది పడాల్సివస్తుందని కూడా అంటున్నారు. మరో వైపు జగన్ నియమించుకున్న మీడియా సలహాదారులు సైతం లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వ వాదన ఎక్కడా సరిగ్గా వినిపించకపోవడం వల్లనే ఇసుక, ఇంగ్లీష్ తో పాటు, ఇపుడు అమరావతి రాజధాని కూడా కోతి పుండు బ్రహ్మ రాక్షసిగా మారిందని అంటున్నారు. మరో వైపు జగన్ వేల కోట్లతో సంక్షేమ పధకాలు అమలు చేసినా కూడా వాటికి కూడా జనంలో పెద్దగా ప్రచారం లభించడంలేదని అంటున్నారు.

Tags:    

Similar News