మట్టివాసన తెలిసిన మాస్ లీడర్

నవ యువ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ఇది తొలి పుట్టిన రోజు. వై.ఎస్. వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ ప్రజానేతగా అపూర్వ విజయంతో అధిష్టించిన పదవి [more]

Update: 2019-12-21 02:00 GMT

నవ యువ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ఇది తొలి పుట్టిన రోజు. వై.ఎస్. వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ ప్రజానేతగా అపూర్వ విజయంతో అధిష్టించిన పదవి మాత్రం స్వార్జితం. తండ్రి ఆశయాలు, రాష్ట్ర అవసరాలను సంతులనం చేసుకుంటూ సాగిస్తున్న ప్రస్థానంలో తనదైన ముద్ర తో పాలనలో తొలి అడుగులు వేస్తున్నారు.

ప్రజానేతగా….

ప్రజానాడిని పట్టగలిగిన వాడు జననేతగా ఎదుగుతాడు. మట్టివాసన తెలిసిన వాడు మాస్ లీడర్ గా నిలుస్తాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు అంశాల్లోనూ జనహృదయాల్లో తనదైన ముద్ర వేయగలిగారు. అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అరుదైన రికార్డుతో అద్భుతవిజయం సాధించారు. గడచిన ఆరునెలల కాల వ్యవధిలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశలో అడుగులు వేస్తున్నారు. పరిపాలనపై రాజకీయంగా విమర్శలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ రాష్ట్రం పట్ల కమిట్ మెంట్, తాను అనుకున్నది చేయాలనే పట్టుదల, ప్రజలకు మేలు చేయాలనే తపన, సంక్షేమంపై చిత్తశుద్ధి విషయంలో వేలెత్తి చూపడం కష్టమే.

అయిదువేళ్లు…

పేదవాడికి అయిదువేళ్లు నోటిలోకి వెళ్లడమంటే సంతుష్టిగా భోజనం చేయడమని లెక్క. తన పాలనకు అయిదు అంశాలే విధివిధానాలుగా ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి రాజకీయ దుర్గాన్ని నిర్మించుకుంటున్నారు. పారదర్శకత..ప్రజాసంక్షేమం.. సామాజిక న్యాయం..సాధికారత.. అధికార వికేంద్రీకరణ దిశలో తొలి అడుగులు వేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతగా నిర్వహించిన ప్రజాసంకల్పమే ప్రభుత్వ మార్గదర్శక నియమావళిగా రూపుదాల్చింది. 3643 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలనలో సంక్షేమ పథకాల రూపంలో పాదముద్రలు వేసుకుంటోంది. ప్రజాంతరంగాన్ని అర్థం చేసుకుంటూ పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి నడిచిన ప్రతి అడుగూ పాలనకు మైలురాయిగా మారుతోంది.

జన నీరాజన జైత్రయాత్ర…

సంక్షోభాలనుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది. సహనం నుంచే రాటుదేలుతుంది. సవాళ్ల తోనే సత్తా తెలుసొస్తుంది. కాంగ్రెసు అధినాయకత్వాన్ని ధిక్కరించి సొంత పార్టీ నిర్మించి ఒకవైపు కేసులు, మరో వైపు ప్రతికూలమైన ప్రభుత్వాలను ఎదుర్కొంటూ సాగించిన ఏడేళ్ల పోరాటం సామాన్యమైనది కాదు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని ప్రజాసంకల్పానికి శ్రీకారం చుట్టారు. పదం పదం ప్రజాపాదమై కలిసి నడిచినప్పుడు కష్టసుఖాలు, కడగండ్లు కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఎగుడుదిగుళ్లు , ఎత్తుపల్లాలు, లోతైన ప్రశ్నలు, అంతే లేని అన్వేషణలు ఎన్నెన్నో… వాటన్నిటినీ మధించి పరిష్కారం అన్వేషించినప్పుడే ప్రజాప్రస్థానం పూర్తవుతుంది. జన సంకల్పం నెరవేరుతుంది. జయగీతం పాడుతుంది. పాదయాత్రే ప్రజాస్వామ్య జైత్రయాత్రగా జననీరాజనాలు అందుకుంది. ముఖ్యమంత్రిగా పదవిని కట్టబెట్టింది.

సాహసం.. శ్వాసగా…

జగన్ అనే జనసమ్మోహనాస్త్రం ..తండ్రి వైఎస్ బాటలో అడుగులు వేస్తూ సుదీర్ఘపాదయాత్రతో నవ్యాంధ్రకు కొత్త సంకల్పం చెప్పినప్పుడు అయిదు కోట్ల ఆంధ్రులు ఆసక్తిగా చూశారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంచలనం. 134 నియోజకవర్గాల్లో 2017 నవంబరు 6 నుంచి 2019 జనవరి 9 వరకూ సాగిన ప్రజాసంకల్పం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకే కాదు, వ్యక్తిగా జగన్ కు సైతం నూతన పథనిర్దేశం చేసింది. జగన్ వ్యక్తిత్వమేమిటో ప్రజలకు తెలిసేలా చేసింది. సహస్ర వృత్తుల సమస్త సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. ఆ అవ్వాతాతల వెతలను కళ్లారా చూసే వీలు చిక్కింది. బడికిపోలేని విద్యార్థుల బతుకుచిత్రం అర్థమైంది. మద్యం మహమ్మారి కాటేస్తుంటే కుంగిపోతున్న కుటుంబాల కథలు కన్నీళ్లు పెట్టించాయి. ఫలితంగానే తాను పదవిలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధంపై దశలవారీ తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర చరిత్రలో ఒక సాహసమనే చెప్పాలి.

పాదయాత్ర పాఠాలు..

గిట్టుబాటు లేక గింజుకుంటున్న రైతన్నకు అండ నివ్వాల్సిన అవసరాన్నిపాదయాత్ర గుర్తు చేసింది. రోజువారీ కూలీ దొరక్క కొట్టుకుంటున్న దినసరివేతన కార్మికుని కష్టం గుండెలను పిండేసింది. ఇదంతా పాదయాత్ర చలవే. ఈ సుదీర్ఘ ప్రస్థానం నుంచి తాను గ్రహించిన అనుభవాలనే సంక్షేమ పథకాలుగా మలచి బడుగు, బలహీన,పీడిత,తాడిత ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రిగా ఉపక్రమించారు జగన్ మోహన్ రెడ్డి. ఆబాలగోపాలం తనను ఆదరించి అక్కున చేర్చుకున్న క్షణాల్లో వారిలో కనిపించిన ఆకాంక్షలు, ఆశలనే తన ఆశయాలుగా మార్చుకుని పరిపాలనకు శ్రీకారం చుట్టారు.

నవ్యాంధ్రలో నవరత్నాలు…

సామాజిక న్యాయమూ సంక్షేమంలో అంతర్బాగమనేనన్న అంశాన్ని గుర్తించి పాలనలో పెద్దపీట వేశారు. దిగువస్థాయిలో జీవిస్తున్న ప్రజలకు నిజమైన సాధికారత నివ్వడానికి కాంట్రాక్టులు మొదలు, నామినేటెడ్ పోస్టుల వరకూ రిజర్వేషన్ ఖరారు చేశారు. బడికెళ్లే పసిపిల్లాడు మొదలు వయసుడిగిన వ్రుద్ధుని వరకూ తాను అండగా నిలుస్తానని జగన్ తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో చాటిచెబుతున్నారు. సామాజిక న్యాయం , సాధికారత దిశలో శాసనసభ తొలి సమావేశాల్లోనే 15 బిల్లులను ఆమోదించడమే కాదు, నవరత్నాలు అమలు నవ్యాంధ్ర గుండె చప్పుడుగా మార్చేశారు. రైతు భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, పథకమేదైనా ప్రజలే దానికి జీవనాడి. అన్నివర్గాలకు సంత్రుప్తస్థాయిలో సంక్షేమం అన్నది ప్రభుత్వ పాలనకు తారకమంత్రంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రణాళికను పవిత్ర గ్రంథంగా భావించే జగన్ సంక్షేమం విషయంలో ఒక రికార్డు స్రుష్టించారు. భవిష్యత్తులో అభివ్రుద్ధి కి సంబంధించిన అంశాలను సంతులనం చేసుకొంటూ ముందుకు సాగడమే ఆయన ముందున్న కర్తవ్యం. ముఖ్యమంత్రిగా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్ కు “తెలుగు పోస్ట్” జన్మదిన శుభాకాంక్షలు

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News