వైసీపీ స్వీట్ హార్ట్ అవుతుందా?

ఏపీలో వైసీపీ పవరేంటో బీజేపీకి ఆరు నెలల క్రితమే తెలిసింది. అరుదైన విజయాన్ని అందుకున్న జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడు ప్రధాని ఆయనను హత్తుకున్న సీన్ ఇప్పటికీ అందరికీ [more]

Update: 2019-12-19 08:00 GMT

ఏపీలో వైసీపీ పవరేంటో బీజేపీకి ఆరు నెలల క్రితమే తెలిసింది. అరుదైన విజయాన్ని అందుకున్న జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడు ప్రధాని ఆయనను హత్తుకున్న సీన్ ఇప్పటికీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ తరువాత మాత్రం ఎందుకో జగన్ కి ఢిల్లీకి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. దానికి కొన్ని సంకేతాలు కూడా కనిపించాయి. జగన్ ఈ మధ్యలో రెండు సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలవకుండా వెనక్కి వచ్చేశారు. ఇక మరో వైపు బీజేపీని తెగ పొగుడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్త దోస్తీని చెప్పకనే చెబుతున్నాడు. చంద్రబాబు అయితే తనకు సన్నిహితులైన ఎంపీలు బీజేపీలోకి చేరాక జగన్ మీద గట్టిగానే నోరు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీతో వైసీపీ రిలేషన్లు ఎలా ఉన్నాయి? ఎంతదాకా వచ్చాయి? అన్న దాని మీద అయితే ఎవరికీ క్లారిటీ లేదు.

బలమైన పార్టీగా…..

ఇప్పటికే లోక్ సభలో 22 మంది ఎంపీలతో వైసీపీ మూడవ అతి పెద్ద పార్టీగా ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తరువాత వైసీపీదే మూడవ స్థానం. మరి ఆ విధంగా కేంద్రానికి కీలకమైన సమయాల్లో నైతిక మద్దతు ఇస్తూ వైసీపీ ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది. మరో వైపు రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు వైసీపీకి ఉన్నారు. వారు సైతం కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఈ పరిస్థితి మరింతగా మారుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల తరువాత పెద్దల సభలో వైసీపీ బలం ఏకంగా ఆరుకు పెరుగుతుంది. అంటే జాతీయ రాజకీయాల్లో ఓ విధంగా ఎవరూ వైసీపీని విస్మరించలేని పాత్ర అన్న మాట.

బీజేపీ చూపు….

ఇక దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణంలో బీజేపీకి చిరకాల మిత్రులు సైతం దూరం అవుతున్నారు. మూడు దశాబ్దాల మిత్రుత్వం ఉన్న శివసేన హఠాత్తుగా ఝలక్ ఇచ్చేసింది. మరో వైపు బీహార్ లోని నితీష్ నాయకత్వంలోని జేడీయూ కూడా అనుమానస్పద‌ వైఖరితోనే ఉంది. ఈ నేపధ్యంలో రానున్న రోజులలో బీజేపీకి ఇంకా కొన్ని కీలకమైన బిల్లులు కొన్ని ఆమోద ముద్ర వేయించుకునేందుకు రెడీగా ఉన్నాయి. దాంతో బీజేపీకి ఏ విధంగా చూసుకున్నా వైసీపీ అవసరం తప్పనిసరిగా ఉందని అంటున్నారు. ఆ విధంగా కేంద్రానికి వైసీపీ హాట్ ఫావరేట్ పార్టీ అయినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు.

కొత్త ఆశలతో…

ఇక ఇప్పటికి ఏడు నెలలుగా కనీసమాత్రంగానైనా కేంద్ర సాయం లేకుండా ఏపీ సర్కార్ బండిని నెట్టుకువచ్చిన జగన్ కి కొత్త ఏడాది కోటి ఆశలతో స్వాగతం పలుకుతోందని అంటున్నారు. ఢిల్లీ రాజకీయ సమీకరణలు పూర్తిగా జగన్ కి అనుకూలంగా మారుతున్నాయని అంటున్నారు. బీజేపీకి జగన్ అవసరం 2020లో మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు. పార్లమెంట్ లో వైసీపీ బలంతో పాటు నమ్మకమైన మిత్రునిగా కూడా జగన్ కొత్త ఏడాది బీజేపీకి కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జగన్ సైతం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. కేంద్ర పెద్దల నుంచి సానుకూలత లభించినదాన్ని తన రాజకీయానికి, రాష్ట్రాభివృధ్ధికి వాడుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా 2019 ఏపీలో వైసీపీకి కొత్త వెలుగులు ఇస్తే 2020 ఢిల్లీలో ఆ పార్టీ మెరిసేందుకు గొప్ప అవకాశాలు ఇస్తుందని వైసీపీ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి.

Tags:    

Similar News