కుట్టేసుకుంటే…ఎలా…?

మౌనం శక్తివంతమైనదే. ఎన్నో విషయాలు ఆ విధంగా సంకేతాలుగా పంపవచ్చు. అయితే మౌనం సాధువులకు, సంతులకు సరిపోతుంది. దైనందిన రాజకీయాల్లో ఉన్న వారికి మౌనం అవసరమే కానీ [more]

Update: 2019-09-26 02:00 GMT

మౌనం శక్తివంతమైనదే. ఎన్నో విషయాలు ఆ విధంగా సంకేతాలుగా పంపవచ్చు. అయితే మౌనం సాధువులకు, సంతులకు సరిపోతుంది. దైనందిన రాజకీయాల్లో ఉన్న వారికి మౌనం అవసరమే కానీ అన్ని సందర్భాంల్లో అది కుదరదు. పైగా వాడిగా వేడిగా సాగే రాజకీయాల్లో మౌనవ్రతం పడితే అసలుకే ఎసరు వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక్కసారిగా మౌనీ బాబాగా మారిపోయారు. ఆయన నోట మాటలు వస్తే ముత్యాలు రాలుతాయన్న తీరుగా మూతికి బిరడా వేసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్నో సంఘటనలు జరిగాయి. కీలకమైన విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ వైఎస్ జగన్ మాట్లాడితే ఒట్టు. ఏపీ లాంటి కొత్త రాష్ట్రంలో, కొత్త ముఖ్యమంత్రి పాలన తీరు ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు జనం ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడితే ప్రజానీకానికి అదో నిబ్బరం, అదో ధైర్యం. మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు వద్దు అంటున్నారు.

నమ్మకం ఇచ్చే నోట….

ఇపుడు ఏపీలో సచివాలయ పరీక్షల లీకేజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. లక్షా పాతిక వేల మంది అభ్యర్ధుల జీవితాలకు సంబంధించిన విషయమిది. అంతకు మించి పరీక్ష రాసిన 20 లక్షల మంది అభ్యర్ధుల సందేహాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విపక్షం బురద జల్లిందని తేలిగ్గా తీసిపారేయాల్సిన వ్యవహారం కానే కాదు. విపక్షం తప్పు చెప్తే ఇది ఒప్పు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే మంత్రుల స్థాయిలో ఏవో ఖండన మండనలు జరిగాయి కానీ వైఎస్ జగన్ మాత్రం ఈ అంశంపై పెదవి విప్పలేదు. వైఎస్ జగన్ ఈ విషయం మీద సమీక్ష చేసినట్లుగా వార్తలు వచ్చాయి. లీకేజ్ అసలు జరగలేదు అని ముఖ్యమంత్రి నోట నుంచి మాట వస్తే లక్షలాది మందికి భరోసా. పరీక్ష రాసి అవకాశం దక్కని వారికి కూడా అదే నమ్మకమైన మాట. అలా కాకుండా విపక్షాల విమర్శలు చేస్తూనే ఉంటాయి నాకేంటి అనుకుంటే మాత్రం అది పెద్ద రచ్చకే దారితీసే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయమే కాదు, పోలవరం, అమరావతి రాజధాని, కేంద్ర నిధుల సాయం, ప్రత్యేక హోదా, తెలంగాణాతో ఉన్న విభజన సమస్యలు ఇలా ప్రతీ అంశం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబితే దాని మీద ఉండే నమ్మకం వేరు. అన్ని విషయాలు కాకపోయినా కీలకమైన వాటికి సంబంధించి స్పందించాల్సినది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్నది నిజం.

విపక్షాల డిమాండ్….

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వీడాలని ఏపీలో ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి విషయం మీద యాగీ చేయడం అలవాటు అయినా కొన్ని అంశాల్లో ప్రభుత్వ విధానం ఇది చెప్పగలిగే స్థాయి హోదా ముఖ్యమంత్రికే ఉందని అంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైఎస్ జగన్ మౌనంగా ఉండడం తగదని అంటూ చురకలు అంటించారు. దీని పలాయనవాదంగా కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సమాధానం చెప్పలేకనే వైఎస్ జగన్ నోరు కుట్టేసుకుంటున్నారని కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మరి వైఎస్ జగన్ ఈ విషయం తప్పు అని నిరూపించాలంటే ప్రభుత్వ వాదనతో ముందుకు రావాలి. తప్పు జరిగితే సరిదిద్దుకోవచ్చు, అదే ఒప్పు అయితే గట్టిగా సమర్దించుకోవచ్చు కానీ మాట్లాడడం వల్ల ప్రజలలో గూడు కట్టుకున్న అనేక సందేహాలకు సమాధానం లభిస్తుంది. ఏపీలో అయిదు కోట్ల ప్రజలకు వైఎస్ జగన్ జవాబుదారి, ప్రతిపక్షాలకు కాదన్నది గుర్తుంచుకుని ప్రజల కోసం ఆయన మీడియా ముఖంగా మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. మరి చూడాలి.

Tags:    

Similar News