జగన్ ప్రయారిటీ ఎవరికో?

ఆ జిల్లాలో ముగ్గురు ముఖ్యనేతలున్నారు. ముగ్గురూ ముఖ్యమంత్రి జగన్ కు కావాల్సిన వారే. ముగ్గురూ పదవుల్లేక ఖాళీగా ఉన్నారు. వారిలో తొలుత జగన్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారన్నది [more]

Update: 2019-12-11 14:30 GMT

ఆ జిల్లాలో ముగ్గురు ముఖ్యనేతలున్నారు. ముగ్గురూ ముఖ్యమంత్రి జగన్ కు కావాల్సిన వారే. ముగ్గురూ పదవుల్లేక ఖాళీగా ఉన్నారు. వారిలో తొలుత జగన్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో జగన్ ముగ్గురికీ పదవులు ఇస్తాారా? ఇవ్వగలరా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అది శ్రీకాకుళం జిల్లా. ముగ్గురు నేతలు దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణి, పేరాడ తిలక్ లు.

ముగ్గురూ కావాల్సిన వారే….

ఈ ముగ్గురు నేతలు జగన్ కు బాగా కావాల్సిన వారే. ముగ్గురిలో పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ లు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ అండగా ఉన్నారు. కిల్లి కృపారాణి ఎన్నికలకు ముందు పార్టీలో చేరినా ఆమె ప్రభావం ఎన్నికల్లో కన్పించిందనేది కాదనలేని వాస్తవం. ముగ్గురూ కాళింగ సామాజికవర్గానికి చెందిన వారే. అయితే ఈ ముగ్గురిలో దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లకు జగన్ టిక్కెట్ ఇచ్చినా మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయారు. కిల్లి కృపారాణికి నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇద్దరూ ఓడిపోయి…..

టెక్కలి నియోజకవర్గంలో పేరాడ తిలక్ టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన ప్రస్తుతం టెక్కలి ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆయన తనకు జగన్ ఏదో ఒక పదవి ఇస్తారని నమ్మకంతో ఉన్నారు. అచ్చెన్నాయుడికి వచ్చే ఎన్నికల్లోనైనా చెక్ పెట్టాలంటే పేరాడ తిలక్ ను అన్ని రకాలుగా ఆదుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇక మరో నేత దువ్వాడ శ్రీనివాస్. ఈయన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నారు. ఈయన ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు.

చివరి నిమిషంలో చేరినా…..

మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చినా ఆమె రాకతో పార్టీకి ప్రయోజనం చేకూరిందనే చెప్పాలి. పార్టీలో చేరిక సందర్భంగా జగన్ కిల్లికృపారాణికి హామీ ఇచ్చారంటున్నారు. కిల్లి కృపారాణి మాత్రం రాజ్యసభను కోరుకుంటున్నారు. ఈ ముగ్గురు నేతలు ఒకే సామాజిక వర్గం కావడం, ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో జగన్ తొలుత ఎవరికి ప్రయారిటీ ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఎవరిని తొలుత అదృష్టం వరిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముగ్గురికీ జగన్ పదవులు ఇవ్వడం ఖాయమన్న టాక్ పార్టీలో ఉంది.

Tags:    

Similar News