మేనేజ్ చేయలేకపోతున్నారా?

ఒక ముఖ్యమంత్రి, అందునా దేశంలో అరుదుగా మాత్రమ వచ్చే విక్టరీ. అసలైన ప్రజాస్వామ్యం అనిపించేలా యాభై ఒక్క శాతం ఓట్లు, ఎనభై శాతం సీట్లు తెచ్చుకున్న పార్టీకి [more]

Update: 2019-12-10 15:30 GMT

ఒక ముఖ్యమంత్రి, అందునా దేశంలో అరుదుగా మాత్రమ వచ్చే విక్టరీ. అసలైన ప్రజాస్వామ్యం అనిపించేలా యాభై ఒక్క శాతం ఓట్లు, ఎనభై శాతం సీట్లు తెచ్చుకున్న పార్టీకి అధినాయకుడు జగన్. విపరీతమైన ప్రజాదరణ సంపాదించుకున్న యువనేత కూడా ఆయన. అటువంటి జగన్ కి ఢిల్లీ పట్టు చిక్కడంలేదు. హస్తినతో నేస్తం చేద్దామనుకుంటే మస్తు గా దెబ్బలు తగులుతున్నాయి. జగన్ ఢిల్లీ టూర్ వరసగా అభాసుపాలుకావడం ఇది రెండవసారి. జగన్ మీద ప్రతీ రోజూ బురద జల్లేందుకు ఇటు టీడీపీ, అటు దాని అనుకూల మీడియా పొంచి ఉన్న వేళ జగన్ ఏ మాత్రం కచ్చితత్వం లేని అపాయింట్ల మీద ఆధారపడి హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారన్నది ఇప్పటికీ ప్రశ్నే. జగన్ కి ఢిల్లీలో పలుకుబడి లేదని లోకానికి చాటాలని ఓ వైపు ప్రతిపక్షం గట్టిగా ప్రయత్నం చేస్తున్న వేళ ముఖ్యమంత్రి టూర్ ఎంత పకడ్బందీగా ఉండాలి. కానీ జరుగుతున్నదేంటి.

లాబీయింగ్ మిస్….

జగన్ కి ఢిల్లీలో పెద్దగా లాబీయింగ్ లేదన్నది మరో సారి రుజువు అయిందని అంటున్నారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ప్రారంభానికి వెళ్ళిన జగన్ ఉన్నట్లుండి షెడ్యూల్ లో లేని ఢిల్లీకి వెళ్ళారు. నిజానికి ఆయనకు ఢిల్లీలో అమిత్ షా కానీ, ప్రధాని మోడీ కానీ అపాయింట్మెంట్లు ఇవ్వలేదని, దాని కోసం ప్రయత్నం కూడా జరగలేదని సీఎంవో ఆఫీస్ సమాచారం. మరి అలాంటపుడు జగన్ ఎందుకు వెళ్ళారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. మరి ఢిల్లీలో విజయసాయిరెడ్డిని నమ్ముకునే జగన్ ఇలా టూర్ వేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఢిల్లీ లెవెల్లో ఎంతో లాబీయింగ్ ఉంటే తప్ప అప్పటికపుడు పెద్దల అప్పాయింట్మెంట్లు దొరకవు. మరి ఆ పని విజయసాయి చేశారని జగన్ నమ్మి వెళ్ళారా అన్నది ఒక డౌట్ గా ఉంది.

రాజు గారే బెటరా…?

జగన్ పార్టీలోనే మరో ఎంపీ ఉన్నారు. ఆయనే నరసాపురం నుంచి నెగ్గిన రామక్రిష్ణం రాజు. ఆయనకు ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద పలుకుబడి అలా ఇలా లేదు. గతంలో విజయసాయిరెడ్డిని సాయి రెడ్డి గారు అని ఆగి మరీ పలకరించిన ప్రధాని మోడీ ఇపుడు రాజుగారు బాగున్నారా అంటున్నారు. అంతేనా ఎపుడు కావలిస్తే అపుడు రాజు గారు బీజేపీ ఆఫీస్ లోకి దూరేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలసి మరీ అక్కడే భేటీలు వేస్తున్నారు.

పలుకుబడి తగ్గిందా?

ఓ వైపు జగన్ తన అనుమతి లేకుండా ఎవరికీ కలవద్దని చెప్పినా భేఖాతర్ చేస్తూ దూసుకుపోతున్నారు. తాను టికెట్ ఇస్తే గెలిచిన ఒక ఎంపీకి బీజేపీ పెద్దలు ఇస్తున్న విలువ, గౌరవం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా తనకు దక్కకపోవడం జగన్ కి నిజంగా బాధాకరమైన అంశమే. మరి ఎక్కడ గ్యాప్ వచ్చిందో వైసీపీ, బీజేపీ సంబంధాలు చెడిపోయాయో తెలియదు కానీ విజయసాయిరెడ్డి పలుకుబడి కూడా కేంద్ర స్థాయిలో కరిగిపోతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఢిల్లీలో కీలకమైన స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలను మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారా అన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోందని అంటున్నారు.

Tags:    

Similar News