ఎందుకు జగన్ ఇంత వీకయ్యారు…?

న్యాయస్థానాల్లో జగన్ ప్రభుత్వానికి వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అమరావతి రాజధాని తరలింపు నుంచి నిన్న సంగం డెయిరీ వరకూ అన్ని ప్రభుత్వానికి న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయినవే. [more]

Update: 2021-05-24 11:00 GMT

న్యాయస్థానాల్లో జగన్ ప్రభుత్వానికి వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అమరావతి రాజధాని తరలింపు నుంచి నిన్న సంగం డెయిరీ వరకూ అన్ని ప్రభుత్వానికి న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయినవే. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాలపై కంటే న్యాయస్థానాలపైనే ఎక్కువ పోరాటం చేస్తున్నారని అనిపిస్తుంది. కేసులు వీగిపోవడం, న్యాయస్థానాలు తప్పుపట్టడం వెనక కారణాలపై జగన్ లోతైన అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది.

న్యాయ నిపుణుల…..

జగన్ సరైన న్యాయనిపుణులను నియమించకోక పోవడమే ఇందుకు కారణమా? అన్న అనుమానాలు పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. 151 స్థానాలతో భారీ మెజారిటీ సాధించానని చెప్పుకోవడానికి మినహా జగన్ అనుకున్నది జరగడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70కి పైగా కేసుల్లో న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు తినాల్సి వచ్చింది. దీనికి కారణం న్యాయ నిపుణుల సలహాలేనంటున్నారు.

దాదాపు అన్ని కేసుల్లో…..

సంగం డెయిరీ విషయాన్ని తీసుకున్నా, అమరరాజా కంపెనీ భూములు వెనక్కు లాక్కునా, దానికి విద్యుత్తు సరఫరాను నిలిపేసినా, గొట్టిపాటి రవికుమార్ మైనింగ్ కంపెనీలపై జరిమానా విధించినా వారంతా న్యాయస్థానాలకు వెళ్లి ఊరట చెందుతున్నారు. జగన్ కుమాత్రం తలబొప్పి కడుతోంది. సంగం డెయిరీని ప్రభుత్వ పరం చేస్తూ తెచ్చిన జీవోను న్యాయస్థానం తప్పుపట్టడాన్ని ఇప్పుడు న్యాయపరంగా మరో ఓటమి అని వైసీపీ నేతలే విశ్లేషించు కుంటున్నారు.

రాజధాని తరలింపు….

ఇక అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. దీనికి కారణం న్యాయస్థానంలో కేసులు నలుగుతుండటమే. హైకోర్టు ఎప్పటికి ఈ కేసు విచారణ పూర్తి చేస్తుందో తెలియదు. ఇప్పటికీ విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే జగన్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఇప్పటికైనా జగన్ రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుభవజ్ఞులైన న్యాయనిపుణులను నియమించుకోకుంటే భవిష్యత్ లో న్యాయపరంగా మరిన్ని చికాకులు తప్పవంటున్నారు.

Tags:    

Similar News