జగన్ ప్లాన్ బి అదేనా.. అందుకోసమేనా?

జగన్ ఎపుడూ బయటపడరు. ఆయన మనసులో ఏముందో కూడా తెలుసుకోవడం కష్టమైన పనే. కేంద్రంలోని మోడీకి మద్దతుగా జగన్ ఏనాడూ బాహాటంగా మాట్లాడిందీ లేదు. అలాంటి జగన్ [more]

Update: 2021-05-08 14:30 GMT

జగన్ ఎపుడూ బయటపడరు. ఆయన మనసులో ఏముందో కూడా తెలుసుకోవడం కష్టమైన పనే. కేంద్రంలోని మోడీకి మద్దతుగా జగన్ ఏనాడూ బాహాటంగా మాట్లాడిందీ లేదు. అలాంటి జగన్ కఠిన కరోనా వేళ మనమంతా మోడీకి అండగా ఉండాలి అంటూ పక్క రాష్ట్రం సీఎం కి హిత బోధ చేస్తున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మోడీ కరోనా విషయంలో నాన్ సీరియస్ గా ఉన్నారని ఆరోపణలు చేశారు. దాని మీద జగన్ ట్వీట్ చేస్తూ మనలో మనకు ఈ సంక్షోభ సమయంలో విమర్శలు వద్దు, దాన్ని వల్ల మరింత బలహీనం అవుతాం, మోడీకి సహకరించాలి. అపుడే ఆయన సమర్ధంగా కరోనాను ఎదుర్కొంటారు అంటూ చాలా మంచిగా సూచించారు. కానీ ఇపుడు ఇదే దేశంలో హాట్ టాపిక్ గా మారుతోంది.

టైమ్ చూసి మరీ …

అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత మోడీ హవా రాజకీయంగా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇక సెకండ్ వేవ్ కరోనా విషయంలో కేంద్రం సరిగ్గా డీల్ చేయలేదని జాతి మొత్తం మీద అసంతృప్తి పెరుగుతోంది. మరో వైపు మోడీ మీద విపక్ష శిబిరం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ మొదలుకుని వివిధ రాష్ట్రాలలోని విపక్ష నేతల దాకా ఎవరూ మోడీని వదలడంలేదు. ఈ నేపధ్యంలోనే సోరెన్ కూడా మీడీ మీద తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దానికి బీజేపీ నుంచి కౌంటర్ పడలేదు కానీ అశ్చర్యకరంగా జగన్ వకాల్తా పుచ్చుకుని తప్పు అలా మోడీని అనకూడదు అంటున్నారు. అది కూడా టైమ్ చూసుకుని మరీ మోడీకి మద్దతుగా జగన్ నిలుస్తున్నారు. అదే కదా దేశంలో వేడి వేడి వార్త మరి.

అంతవరకేనా…?

నిజానికి మోడీ మీద జగన్ కి అభిమానం ఉంటే ఆయన దాకా ఆగవచ్చు. తనలాగే పాలిస్తున్న మరో సీఎం కి ఆయన సూచనలు ఇచ్చే పరిస్థితి ఏముంటుంది. పైగా జగన్ ఇప్పటిదాకా తెలంగాణా గురించే ఎక్కడా మాట్లాడలేదు. అలాంటిది జార్ఖండ్ సీఎం విషయంలో ఆయన ఎందుకు చొరవ తీసుకున్నారు అన్నదే ప్రశ్న. మోడీ ని మంచి చేసుకోవడానికి జగన్ ఇదంతా చేస్తున్నారా లేక కరోనా విపత్తు వేళ దేశమంతా ఒక్కటిగా ఉండాలని మంచి మాటలు చెబుతున్నారా అన్నదే ఎవరికీ అర్ధం కాని విషయం. అయితే జగన్ ఏ రకంగా మోడీకి మద్దతు ఇచ్చినా దానికి రాజకీయ కారణాలే ఎవరైనా వెతుకుతారు. ఎందుకంటే జగన్ కూడా రాజకీయ నేత కాబట్టి.

మమతకు దూరమా…?

దేశంలో ప్రాంతీయ శక్తులను కూడగట్టే పని మొదలవుతోందని ఒక వైపు ప్రచారం సాగుతోంది. మరో వైపు చంద్రబాబు లాంటి వారు మోడీ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో జగన్ తన రాజకీయ ఆలోచనలను చెప్పేందుకు కరోనా విషయాన్ని ఎంచుకున్నారన్న విశ్లేషణ ఉంది. మోడీకి మనమంతా మద్దతు ఇవ్వాలి అని చెప్పడం ద్వారా తన మద్దతు ఆయనకే అన్న సందేశాన్ని జగన్ వినిపించారు అంటున్నారు. ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపలను రేపవచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల దన్ను తనకు ఉంటుందని మమత నమ్ముతున్నారు. ఆమె మోడీ అంటే మండిపోతారు. దానికి కరోనా సెకండ్ వేవ్ తో కూడా పని లేదు. అలాంటి మమత కు దూరంగా జరిగేందుకేనా జగన్ ఈ విధమైన ఆలోచన చేశారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా జగన్ మాత్రం దేశంలో ప్రాంతీయ కూటములకు ఇప్పటికైతే దూరమే అన్నది స్పష్టం. రేపటి రోజున మోడీకి మెజారిటీ బాగా తగ్గితే ప్లాన్ బీ ఉండొచ్చేమో కానీ జగన్ మనసూ మద్దతూ మోడీకే అన్నది దీని ద్వారా తెలుస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News