అందుకే వాళ్లంతా విస్తరణ అటే వణుకుతున్నారు?

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. పాతిక మంది మంత్రులను జగన్ తన క్యాబినేట్ లోకి తీసుకున్నారు. వారిలో చాలా మంది పేర్లు ఎవరికీ ఇప్పటికీ [more]

Update: 2021-05-05 05:00 GMT

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. పాతిక మంది మంత్రులను జగన్ తన క్యాబినేట్ లోకి తీసుకున్నారు. వారిలో చాలా మంది పేర్లు ఎవరికీ ఇప్పటికీ తెలియదు అంటే సబబు. దానికి కారణం కూడా వారే అని చెప్పాలి. అలాగని వారికేమీ అప్రధాన‌ శాఖలు చేతిలో లేవు. అత్యంత కీలకమైన శాఖలను వారికి జగన్ అప్పగించారు. వారు శాఖాపరంగా కూడా పెద్దగా సందడి చేయరు. అదే విధంగా విపక్షాల నుంచి ప్రభుత్వాన్ని కాసుకునే విషయంలో కూడా ఎలాటి ప్రయత్నాలుచేయరు. వారి లిస్ట్ చూస్తే చాలా పెద్దదే మరి.

కౌంటర్లేవీ…..?

రాయలసీమ నుంచి చాలా మంది మంత్రులు జగన్ కొలువులో ఉన్నారు. వారిలో బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన అతి ముఖ్యమైన ఆర్ధిక శాఖను చూస్తున్నారు. ఆయన తన శాఖ గురించి కూడా పెద్దగా మీడియా ముందుకు రారు అన్న మాట ఉంది. ఆయన హుందాగా పాలిటిక్స్ చేస్తారు అంటారు. ఆర్ధిక శాఖకు చెందిన మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు వైసీపీని ఎపుడూ తూర్పారా పడుతూంటారు. కానీ దానికి ఆ శాఖ మంత్రిగా బుగ్గన కనీసంగా కూడా స్పందించరు. ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి జయరామ్ కూడా మీడియాకు ముందుకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు.

ఒట్టేసుకున్నారేమో…?

ఇక అనంతపురం జిల్లాకు చెందిన శంకరనారాయణ బలమైన నేతగా భావించి జగన్ మంత్రిని చేశారు. ఆయన‌ కూడా మౌనంగానే ఉంటూ కధ నడిపిస్తున్నారు. చిత్తూరుకు చెందిన నారాయణస్వామి అపుడపుడు కొంచెం కౌంటర్లు వేస్తారు కానీ నెల్లూరు కి చెందిన మంత్రి గౌతం రెడ్డి అయితే విపక్షాలు ఎంతలా రెచ్చుతున్నా తన పనేమీ కాదన్నట్లుగా ఫుల్ సైలెంట్ అవుతారు. అనిల్ కుమార్ యాదవ్ గతంలో దూకుడు చూపించేవారు, కానీ రెండున్నరేళ్ళ కాలపరిమితి దగ్గరపడడంతో ఆయన కూడా ఇపుడు జోరు తగ్గించేశారు అంటున్నారు.

గొంతు లేపని గోదారి మంత్రులు…?

ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి మంత్రులు చూస్తే పినిసి విశ్వరూప్ అసలు సౌండ్ చేయరు అన్న పేరు తెచ్చేసుకున్నారు. అదే విధంగా కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్న ఆళ్ల నాని అయితే పెదవి విప్పితే తప్పు అన్నట్లుగా ఉంటారు. మరో మంత్రి తానేటి వనిత కూడా శాఖాపరమైన అంశాల్లో కూడా పెద్దగా నోరు విప్పరు అన్న విమర్శలు ఉన్నాయి. కొత్త మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ చడీ చప్పుడూ లేదన్న ప్రచారం ఉంది. ఇదే వరసలో ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన పుష్ప శ్రీవాణి కూడా ఉంటారని అంటున్నారు. మరో వైపు విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస రావు కూడా తన పరిధిని తానే తగ్గించేసుకుని మడి కట్టుకున్నారని చెబుతారు. పెద్ద మనిషిగా ఉండేందుకు మరో ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఇష్టపడితే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని హోం మంత్రి మేకతోటి సుచరిత భావిస్తారు అని పేరు.

మిగిలింది వీరేనా ..?

జగన్ సర్కార్ తరఫున ఏదైనా మాట్లాడాలి అంటే ఎంతసేపూ పేర్ని నాని, కొడాలి నాని మాత్రమే గొంతు చించుకుంటారు అన్న టాక్ ఉంది. అదే కృష్ణా జిల్లాకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గట్టిగా తగులుకుంటారు. వారితో పాటు గోదావరి జిల్లాల మంత్రి కన్నబాబు మాత్రమే దూకుడు చేస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్రాలో నుంచి చూస్తే కొత్త మంత్రి సీదరి అప్పలరాజు బాగానే విపక్షానికి బ్రేకులు వేస్తారని పేరు. ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయాణ సమయానుకూలంగా గట్టిగానే మాట్లాడుతారు అంటారు. మొత్తానికి జగన్ మంత్రుల్లో చాలా మంది నోరు చేయడలేదు. అలాగని శాఖల మీద కూడా పట్టు సాధించిన దాఖలాలు లేవు. ఇంతకీ ఈ లిస్ట్ అంతా జగన్ దగ్గర ఉండకుండా పోతుందా. అందుకే మంత్రి వర్గ విస్తరణ అంటేనే అంతా వణుకుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News