జగమొండి జగన్ తో టాలీవుడ్ కి లడాయి….?

సరైన వారితోనే ఇపుడు టాలీవుడ్ కి లడాయి పడింది అంటున్నారు. జగన్ సీఎం గా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఆయన పార్టీ లోకల్ బాడీ ఎన్నికలతో [more]

Update: 2021-04-12 08:00 GMT

సరైన వారితోనే ఇపుడు టాలీవుడ్ కి లడాయి పడింది అంటున్నారు. జగన్ సీఎం గా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఆయన పార్టీ లోకల్ బాడీ ఎన్నికలతో పాటు వరసబెట్టి అన్ని ఎన్నికల్లోనూ గెలిచి విజేతగా ఉంది. దాంతో రాజకీయంగా అతి పెద్ద బలవంతుడు ఏపీలో జగన్ అని వేరే చెప్పాల్సింది లేదు. అదే సమయంలో జగన్ విషయంలో టాలీవుడ్ గతంలో స్పందించిన తీరు కూడా ఇపుడు చర్చకు వస్తోంది. ఇక జగన్ సర్కార్ తాజాగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తోంది.

బహు దూరమేనా…?

టాలీవుడ్ కొలువు తీరింది హైదరాబాద్ లో. అంటే ఏపీకి పొరుగు రాష్ట్రం కిందనే లెక్క. ఇక్కడ ఉంటూ హీరోలు తమ పన్నులను ఆదాయంగా తెలంగాణా సర్కార్ కి అప్పగిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణాలో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కూడా వెంటనే స్పందిస్తున్నారు. తమకు తోచిన రీతిన భూరి విరాళాలు కూడా ఇస్తున్నారు. తెలంగాణా సర్కార్ పెద్దలకు తలలో నాలుకగా మెలుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలను తరచూ కలుస్తూ వీర లెవెల్ లో పొగుడుతున్నారు. అదే ఏపీ విషయం తీసుకుంటే తమకు బహు దూరం అన్నట్లుగా ఉంటున్నారు.

గ్యాప్ వచ్చిందా…?

ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ టాలీవుడ్ పెద్దలతో ఆ మధ్యన నిర్వహించిన భేటీ కూడా ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వలేదు, విశాఖను పాలనారాజధానిగా ప్రకటించిన జగన్ సర్కార్ అక్కడే టాలీవుడ్ ని కూడా విస్తరించాలని చూస్తోంది. దానికి సినీ పెద్దల సహకారాన్ని కోరింది. స్టూడియోల నిర్మాణానికి భూములు ఇస్తామని కూడా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పూర్తిగా హైదరాబాద్ లో సెటిల్ అయిన సినిమా పరిశ్రమను కదపడానికి టాలీవుడ్ పెద్దలు ఇష్టపడడంలేదు. దానికి మించి తెలంగాణా ప్రభుత్వంతో ఉన్న సంబంధాలను చెడగొట్టుకుంటామేమో అన్న భయాలు కూడా కొందరికి ఉన్నాయని అంటున్నారు. దీంతో ఏపీ సర్కార్ తో ఒక విధమైన గ్యాప్ వచ్చేసింది అంటున్నారు.

అతి పెద్ద రెవిన్యూ ….

నిజానికి విభజన ఏపీలోనే ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ఆదాయం కూడా అక్కడే బాగా వస్తుంది. ఇంతకాలం కొత్త సినిమాలకు, పెద్ద హీరోల మూవీస్ కి అదనపు షోలతో పాటు, ఎంత పడితే అంత టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చింది. నిజానికి సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం చూస్తే ఇది పూర్తిగా ఉల్లంఘనే. కానీ సినీ పెద్దలతో ఉన్న మొహమాటాలు వారితో సామరస్యంగా వ్యవహరించాలని చూస్తూండడం వల్లనే ఇది సాధ్యపడింది. ఇపుడు సినిమాలను రాజకీయాలను కొందరు కలిపేశారు. పైగా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఈ రకమైన కొందరి డ్యూయల్ రోల్ వల్ల మొత్తం సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతోంది. జగన్ సీఎం అయ్యాక ఆయన్ని కనీసం అభినందించడానికి ఒక్క సినీ ప్రముఖుడూ ముందుకు రాకపోవడం వెనక కూడా పార్టీల రాజకీయాలు ఉన్నాయని అంటారు. అయితే వీటికి మించి సినీ పెద్దలతో ఏపీ ప్రభుత్వానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కొందరి కారణంగానే అవి చెడుతున్నాయని అంటున్నారు. జగన్ అయితే ఇలాంటి విషయాల్లో దృష్టి పెట్టాలే కానీ జగమొండి అని చెబుతారు. దాంతో తెలుగు సినిమా రంగంలో పెద్ద సినిమాల విషయంలో ఇపుడు కలవరం రేగుతోంది. సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి సామరస్యపూర్వకమైన పరిష్కారం చేసుకోకపోతే ఇది పెద్దది అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

Tags:    

Similar News