జగన్… జైలు..ఎన్నాళ్ళిల్లా…?

జగన్ పేరు పక్కనే జైలు అని గిట్టని వారు రాసేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి పాత కాపు టీడీపీ వరకూ ఇదే మాట. [more]

Update: 2019-11-18 14:30 GMT

జగన్ పేరు పక్కనే జైలు అని గిట్టని వారు రాసేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి పాత కాపు టీడీపీ వరకూ ఇదే మాట. జగన్ జైలుకు పోతాడు అంటూ తరచూ విమర్శలు చేస్తూంటారు. తన మీద పెట్టిన కేసులతో జగన్ పోరాడుతున్న మాట అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పుకోవాలంటే కేసులతో పాటే కాలం కదులుతుంటే జగన్ కూడా రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈ మధ్య ట్రయల్ కోర్టులో సీబీఐ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ జగన్ ఇపుడు ముఖ్యమంత్రి స్థానంలో బలంగా ఉన్నారు, ఆయన ఒకనాటి జగన్ కాదంటూ చెప్పుకొచ్చారు. వారు నెగిటివ్ గా తమ వాదన చెప్పినా కూడా జగన్ సీబీఐ కేసులు ఎన్ని వెంటాడుతున్నా అనుకున్న గమ్యానికి చేరుకున్నారన్నది అక్కడ ఆవిష్ర్క్రుతమైన వాస్తవం. అదే సమయంలో ఈ కేసులు ఎంత సుదీర్ఘంగా సాగుతున్నాయో కూడా చెప్పకనే చెప్పినట్లైంది.

సీబీఐ చిటికేస్తే..?

సీబీఐ చిటికేస్తే జగన్ జైల్లో ఊచలు లెక్కబెడతారు ఇది టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటు కామెంట్. అంటే జగన్ కేసుల్లో జైలుకు తప్పకుండా వెళ్తారని టీడీపీ ఇంకా బలంగా నమ్ముతోందన్నమాట. వైసీపీ నేతలు ఆరోపించినట్లుగా చీకటి ఒప్పందాల‌ మూలంగా కాంగ్రెస్ కేసులు వేస్తే టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు అప్పట్లో ఇంప్లీడ్ అయ్యారన్నది తెలిసిందే. ఇక ఇసుక ధర్నా సందర్భంగా మాజీ పోలీస్ అధికారి, టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ పదహారు నెలలు జైలుకు వెళ్ళొచ్చారని, మళ్ళీ ఎపుడు పోతారో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఇటువంటి వారు మన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం దారుణం అని తీవ్రమైన పదజాలం వాడేశారు. ఇక టీడీపీలో చంద్రబాబు నుంచి లోకేష్ బాబు వరకూ ట్విట్టర్ కి పనిచెప్పారంటే ఎక్కడో ఒక దగ్గర జగన్, జైలు అని ప్రస్తావించకుండాఉండరు.

కోరిక తీరేనా…?

జగన్ పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయన మీద వరసగా పదకొండు చార్జిషీట్లు దాఖలు చేసి బెయిల్ రాకుండా చూశారు. సరే ఇపుడు జగన్ బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అంటున్నారు. జగన్ ఎపుడైనా జైలుకి వెళ్తారని కూడా జోస్యాలు చెబుతున్నారు. జనసేనాని పవన్ లాంటి వారు అయితే ఎన్నికల్లో ఇదే విషయం పదే పదే ప్రచారం చేశారు. ఇక నిన్నా మొన్నా కూడా జగన్ పరిస్థితి ఎపుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరి అంతా అనుకున్నట్లుగా జగన్ జైలు కి వెళ్తారా? ఇక్కడ జగన్ కేసుల్లో ఆధారాలు లేవని న్యాయ నిపుణులతో సహా అంతా అంటున్న సంగతి పక్కన పెడితే రాజకీయంగా చూసినా జగన్ని జైలుకు పంపితే లాభం ఎవరికి అన్నది పాయింట్.

సానుభూతేనా…?

జగన్ ని జైలుకు పంపిస్తే ఆనాడు ఎన్టీయార్ కి వచ్చిన సానుభూతి కంటే ఎక్కువగా ఆయనకు వస్తుంది. మళ్లీ ఆయనే ఏపీలోని 175 సీట్లలో జెండా ఎగరేసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఎవరికి కోరికలు ఉన్నా రాజకీయం కూడా అనుమతించాలి కదా. జగన్ జనంలో బదనాం అయితే అపుడు జైల్లో వేస్తారు అని కూడా టీడీపీ తమ్ముళ్ల మరో ప్రచారం. అలా చేసినా కూడా పోయిన ఇమేజ్ మళ్ళీ కోరి మరీ తెచ్చి ఇచ్చినట్లవుతుందనే లెక్కలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఇదే వరమూ శాపమూ కూడా. అందువల్ల జగన్ జైలూ ఈ రెండూ ఆయనకు నిద్ర పట్టనీయకుండా చేసే కామెంట్స్ మాత్రమే. వాటిని ప్రయోగిస్తూ మానసికంగా ఇబ్బందుల పాలు చేయడం తప్ప భారతీయ రాజకీయాల్లో జరిగేది పెద్దగా ఏముండదని విశ్లేషకులు చెబుతూంటారు. అందువల్ల తీరని కోరికలే ఇలా విపక్ష నేతలను పదే పదే మాట్లాడిస్తాయేమో. ఏది ఏమైనా ట్రయల్ కోర్టు తీర్పు వచ్చేవరకూ అంతా కట్టుబడి ఉండడం అసలైన న్యాయమేమో.

Tags:    

Similar News