దాగుడు మూతలు ఆడితే.. గొంతు పెంచకుంటే?

వైసీపీ అధినేత జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. దాగుడు మూతలు ఆడితే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. రాష్ట్రానికి [more]

Update: 2021-02-23 02:00 GMT

వైసీపీ అధినేత జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. దాగుడు మూతలు ఆడితే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేకపోగా ఉన్నవి కూడా పీకి పారేస్తుంది. ఇటువంటి సమయంలో నోరు పెద్దది చేయకపోతే జగన్ కు భవిష‌్యత్ లో కష్టాలు తప్పవు. జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటింది. ఈ ఇరవై నెలల్లోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం అంతంత మాత్రమే.

అన్నీ కష్టాలే…..

జగన్ ఏ సమయాన ముఖ్యమంత్రి పదవి చేపట్టారో కాని ఏవో ఒక విఘ్నాలు ఎదురవుతూనే ఉన్నాయి. దాదాపు ఏడాది పాటు కరోనా కదలనివ్వకుండా చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చింది. దీనికి తోడు పోలవరం, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఏడాది పాటు అడగ లేకపోయారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను కూడా ఇవ్వలేకపోయారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైందో కూడా తెలియదు.

ఢిల్లీ వెళ్లి కలసి వచ్చినా….

అయితే జగన్ ఈ ఇరవై నెలల కాలంలో ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్రమంత్రులను కూడా కలసి వినతులను సమర్పించి వచ్చారు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేదు. పోలవరం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. ఇక తాను అనుకున్న సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పై ఆధారపడాలి లేకుంటే మరన్ని అప్పులను జగన్ చేయాల్సి ఉంటుంది.

ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే…?

ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కూడా జగన్ కు ఇబ్బందికరంగా మారింది. విపక్షాల విమర్శలను పక్కన పెట్టినా, ప్రయివేటీకరణ ఆపే బాధ్యత జగన్ దే అవుతుంది. ఎందుకంటే దాదాపు 28 మంది ఎంపీలున్న వైసీపీ ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పై గొంతు పెంచకపోతే అనేక అనుమానాలు తలెత్తే అవకాశముంది. ఇప్పటికే జగన్ కేసులకు భయపడి కేంద్రంతో లాలూచీ పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు వాటిని జనం నిజం అనుకునే అవకాశముంది. ఇప్పటికైనా జగన్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News