ఆ బ్యాచ్ ని నమ్మొచ్చా?

వైసీపీలోకి పరుగులు తీసుకుంటూ వస్తున్న కమ్మ సామాజికవర్గం నాయకులను జగన్ ఆశీర్వదించి పార్టీ కండువా కప్పేస్తున్నారు. పైగా వారిని కోరి మరీ ఆహ్వానిస్తున్నారు. మరి ఈ రకమైన [more]

Update: 2019-11-20 06:30 GMT

వైసీపీలోకి పరుగులు తీసుకుంటూ వస్తున్న కమ్మ సామాజికవర్గం నాయకులను జగన్ ఆశీర్వదించి పార్టీ కండువా కప్పేస్తున్నారు. పైగా వారిని కోరి మరీ ఆహ్వానిస్తున్నారు. మరి ఈ రకమైన రాజకీయం జగన్ వరకూ కరెక్ట్ గా ఉన్నా పార్టీలో మాత్రం పెద్ద చర్చగా ఉంది. వైసీపీ ఇపుడు ఏపీలో బలంగా ఉంది. 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ మంచి ప్రదర్శన చేస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పార్టీని డెవలప్ చేసుకుంటే మరిన్ని ఎన్నికల్లో సులువుగా గెలిచే వీలుంది. అలాంటిది పదేళ్ళు నానా కష్టాలు పడి సంపాదించిన అధికారాన్ని టీడీపీ నుంచి వస్తున్న కమ్మ సామాజికవర్గానికి పంచడం అంటే వైసీపీలోనే కొంత అసంత్రుప్తి చెలరేగుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే జగన్ మాత్రం టీడీపీ ఎలిమినేషన్ అన్న ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.

జూనియర్ జపంతోనే…

టీడీపీ నుంచి వస్తున్న కమ్మ నాయకులకు అక్కడ సరైన ప్రాధాన్యత లేకపోవడం ఒక కారణమైతే అధికారం వైపు రావాలనుకోవడం మరో కారణం. వీరంతా గతంలో జగన్ ని నానా మాటలు అన్నవారే. ఇక ఇలా వస్తున్న బ్యాచ్ కి టీడీపీ అంటే ఇష్టమే. అందులో లోకేష్ నాయకత్వంతోనే గొడవ ఉంది. అంటే తమ సామాజిక వర్గం ఐడెంటిటీని కాపాడే టీడీపీ పది కాలాలు ఉండాలనుకుంటున్నారు. ఆ విషయం ఎక్కడా దాచుకోకుండా బయటపెట్టుకుంటున్నారు. పార్టీని అన్న నందమూరి స్థాపించారని, దాన్ని జూనియర్ ఎన్టీయార్ కి ఇవ్వకుండా బాబు మోసం చేశారని అంటున్నారు. ఇందులో నిజం ఉన్నా కూడా టీడీపీ అధికారంలో ఉన్నపుడు కిక్కురుమనకుండా ఇపుడే పాత విషయాలు తవ్వి తీసి బురద జల్లడం అంటే అందులో పరమార్ధం అందరికీ తెలిసిందే. టీడీపీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నాయకత్వంలో బతికి బట్టకట్టదని తెలుసుకుని బయటపడుతున్న తెలివైన బాపతుగానే వీరిని భావించాలి. ఇక జూనియర్ ఎన్టీయార్ అంటే వల్లమాలిన ప్రేమను వీరంతా కనబరుస్తున్నారు. అది కూడా ఆలోచించాలి.

కోవర్టులుగానా…?

ఇక జూనియర్ ఇపుడు 36 ఏళ్ళ యువకుడు. ఆయనకు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేవరకూ ఆయన అభిమాన కమ్మ నాయకులకు వేరే ఆప్షన్ లేక వైసీపీలో చేరి రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారని అంటున్నారు. జూనియర్ కనుక 2024 లో రాజకీయాల్లోకి వస్తానని అంటే మళ్ళీ వీరే కాదు, ఆ సామాజిక వర్గంలో వైసీపీలో మంత్రులుగా ఉన్న వారు సైతం జగన్ ని, పార్టీని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వస్తున్న వారు అవకాశవాదులు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. మరో వైపు బీజేపీలోకి చంద్రబాబు నలుగురు తన అనుంగు అనుచరులైన ఎంపీలను పంపారని ప్రచారంలో ఉంది. అదే మాదిరిగా హార్డ్ కోర్ కమ్మ నాయకులను కొందరిని బాబే వైసీపీలోకి పంపుతున్నరన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.

చెడ్డ పేరేనా…?

ఇక నిన్నటి వరకూ టీడీపీలో ఉంటూ ఆ అధికార ఫలాలు అనుభవించిన వారు ఇపుడు దారుణంగా అదే పార్టీ అధినేతనే విమర్శిస్తూ బయటకు వచ్చారంటేనే వారిని ఎంతవరకూ నమ్మాలో కూడా వైసీపీ హై కమాండ్ ఆలోచించుకోవాలి అంటున్నారు. మరో వైపు ఈ తరహా ఫిరాయింపులను ఎంతలా ప్రోత్సహిస్తే అంతలా జనంలో చెడ్డ అవడం తప్పించి వైసీపీకి కొత్తగా ఏమీ మిగలదు అన్నది చంద్రబాబు ఉదంతం ఎపుడో నిరూపించింది. ఆయన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఏం బావుకున్నారని కూడా వైసీపీలో వినిపిస్తున్న మాట. మొత్తానికి జగన్ బాబుని టార్గెట్ చేస్తూ ఆడుతున్న డేంజర్ గేమ్ అటూ ఇటూ తిరిగి వైసీపీ మెడకే చుట్టుకుంటుందని అంటున్నారు.

Tags:    

Similar News